Magazines

జనగణన పోర్టల్‌లో మతాల జాబితాలో ఇస్కాన్‌, గోరఖ్‌నాథ్‌, తాంత్రిక్‌ పేర్లు!

59 నిమిషాల క్రితం

జనగణన పోర్టల్‌లో  మ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026 | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : 2027 జనాభా గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వీయ-గణన పోర్టల్‌లో ఇస్కాన్‌, గోరఖ్‌నాథ్‌, తాంత్రిక్‌ పేర్లను చేర్చింది. మతాలు, విశ్వాసాలు, ఆధ్యాత్మిక సంస్థలు, సంప్రదాయాలకు సంబంధించిన పేర్లను ఎంపికలుగా చేర్చడం గమనార్హం. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన మతాలతో పాటు ‘ఇతర’ అనే ఏడో విభాగాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. అందులో 287కు పైగా విభాగాలను చేర్చింది. వాటిలో ఇస్కాన్, రామకృష్ణ పరమహంస, సనాతన, శ్రీరామ్, శ్రీకృష్ణ, వాల్మీకి, రామ్‌దేవ్, బిష్ణోయ్, సర్నా, తాంత్రిక, యోగి, షియా, సున్నీ, మెథడిస్ట్, పెంటెకోస్టల్ తదితర పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, ఈ వర్గీకరణపై జాతీయ మీడియా కేంద్ర హోంశాఖను వివరణ కోరగా, మరుసటి రోజు ఆ పేర్లతో కూడిన డ్రాప్‌డౌన్ మెనూను తొలగించారు. 2027లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల కోసం సోమవారం స్వీయ-గణన పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో పౌరులు జనగణన సిబ్బంది తమ ఇళ్లకు వచ్చేలోపే ఆన్‌లైన్‌లో స్వయంగా తమ కుటుంబ, వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌లో మతానికి సంబంధించిన ప్రశ్న కింద ఆరు ప్రధాన మతాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. వాటిలో ఏదీ తమకు వర్తించకపోతే ‘ఇతర’ విభాగాన్ని ఎంచుకునేలా ఏర్పాటు చేశారు. అయితే, ఈసారి ఆ విభాగంలో గత జనగణనలతో పోలిస్తే భారీ సంఖ్యలో అదనపు పేర్లను చేర్చడం చర్చనీయాంశమైంది.

గత జనగణనల్లో ప్రధాన మతాలకు చెందిన శాఖలు, ఉపవర్గాలు లేదా ప్రత్యేక విశ్వాసాలను ప్రజలు ‘ఇతర మతాలు, విశ్వాసాలు’ విభాగంలో స్వయంగా పేర్కొనేవారు. 2001, 2011 జనగణనల్లో ఈ వివరాలను సేకరించిన తర్వాత వాటిని వర్గీకరించి పట్టికల రూపంలో ప్రచురించారు. కానీ, 2027 జనగణన స్వీయ-గణన పోర్టల్‌లో మాత్రం ముందుగానే 287కు పైగా పేర్లను ఎంపికల జాబితాలో చేర్చడం వివాదాస్పదంగా మారింది. వీటిలో ఇస్కాన్, రామకృష్ణ పరమహంస, రామ్‌దేవ్, ఖల్సా, తిరుపతి బాలాజీ, గోరఖ్‌నాథ్, బసవేశ్వర, బలదేవ్, దేవీ మా, దేవీ భక్త్, దేవ్ సమాజ్, తాంత్రిక, సర్నా వంటి పేర్లు కూడా ఉన్నాయి. గతంలో జనగణనలో ప్రత్యేక మతాలుగా నమోదు కాని కొన్ని పేర్లు కూడా ఈ జాబితాలో కనిపించాయి.

అయితే, డ్రాప్‌డౌన్ జాబితా తొలగింపుపై రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా (ఆర్జీ&సీసీఐ) కార్యాలయ ప్రతినిధి వివరణ ఇచ్చారు. గత జనగణనల మాదిరిగానే ఆరు ప్రధాన మతాలతో పాటు ‘ఇతర’ అనే విభాగం కూడా కొనసాగుతుందని, అందులో ప్రతివాదులు తమకు నచ్చిన ఇతర మతం పేరును స్వేచ్ఛగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అయితే, మరో ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. ఆరు ప్రధాన మతాలకు చెందని ఇతర విశ్వాసాలను ఎవరైనా పేర్కొన్నప్పుడు, వాటి పేర్లను నమోదు చేసే క్రమంలో అక్షర దోషాలు, స్పెల్లింగ్ తప్పులు రాకుండా ఉండేందుకు ముందస్తుగా కొన్ని పేర్లను ‘ప్రిడిక్టివ్ టెక్స్ట్ ఎంట్రీలు’గా సిద్ధం చేసినట్లు తెలిపారు. అయితే, ఈ పేర్లు ప్రిడిక్టివ్ టెక్స్ట్‌గా ఉండాలని, కాని డ్రాప్‌డౌన్ మెనూలో ఎంపికలుగా ఎలా కనిపించాయనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తొలగించిన డ్రాప్‌డౌన్ జాబితాలోని పేర్లు విచిత్రంగా ఉన్నాయని పదవీ విరమణ చేసిన ఓ జనగణన అధికారి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వాటిని పోల్చడానికి గత జనగణనల్లో సరైన సమాచారం అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఈ పేర్లలో చాలా వరకు ప్రధాన మతాల్లోని శాఖలు, ఉప సంప్రదాయాలు లేదా ఆధ్యాత్మిక ఉద్యమాలకు సంబంధించినవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్