Magazines

మదుపర్లపై మాయాజాలం

2 గంటల క్రితం

Stock Markets
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 5 నిమిషాల చదవడం

పెట్టుబడుల ఉపసంహరణపై ఆంక్షలు?
మోడీ సర్కార్‌ వైఫల్యాలు కప్పిపుచ్చుకొనేందుకు కొత్త మార్గం

'స్టాక్‌ మార్కెట్‌' కంట్రోల్ పై కేంద్రం గుత్తాధిపత్యం

అనుమానాలకు తావిస్తున్న కేంద్రమంత్రి నిర్మలమ్మ వ్యాఖ్యలు

ఒకేరోజు రూ.6.15 లక్షల కోట్లు ఆవిరి

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్ర్తి
లక్షల కోట్ల సంపద. ఒక్క క్లిక్‌తో మాయమైపోతోంది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లకు భారతమార్కెట్‌పై విశ్వాసం సన్నగి ల్లుతోంది. ఏ దశలోనూ కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టర్లకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. భారత స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా పతనం అవుతుండటాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్థికరంగంలో కేంద్ర ప్రభుత్వ విధానపరమైన లోపాలు వెల్లడవుతుండటంతో ఆ అసహనాన్ని మదుప రుల (ఇన్వెస్టర్లు)పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నా రు. విదేశాల్లో భారతదేశం పరువు తీస్తున్నారం టూ ప్రతిపక్షాలపై విరుచుకుపడే మంత్రి.. ఈనెల 19న థాయ్ లాండ్‌లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మదుపరులు (ఇన్వెస్టర్లు) తమ వాటాలను సులభంగా అమ్ముకోగలగడం (లిక్విడిటీ), అధిక ద్రవ్య లభ్యత కారణంగా భారత మార్కెట్లలో లాభాల శాతం తగ్గుతోంది' అని కేంద్ర ప్రభుత్వ అసమర్థతను సామాన్య ఇన్వెస్టర్ల మీదికి నెట్టేసే ప్రయత్నం చేశారు. అయితే దీని వెనుక ఆమె మరో హెచ్చరిక కూడా చేసినట్టు కనిపిస్తుంది. స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన తర్వాత వాటి ఉపసంహరణను నియంత్రిస్తూ కేంద్రం కొత్తగా ఏవైనా మార్గదర్శకాలు ఇస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వైఫల్యాలపై మౌనం..

ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత స్టాక్‌ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. రాబడులు తగ్గడానికి లిక్విడిటీనే కారణమైతే, విదేశీ ఇన్వెస్టర్లు ఎందుకు భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారన్న ప్రశ్నకు కేంద్రం సమాధా నం చెప్పాలి. మార్కెట్‌ పతనానికి ఎగ్జిట్‌ సౌల భ్యాన్ని కారణంగా చూపడం సమ స్య మూలా లను పక్కదారి పట్టించడమేనని స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.

ఇవీ కారణాలు

భారత స్టాక్‌ మార్కెట్‌ పతనానికి ప్రధానంగా అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దడంలో విఫలమైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విఫలమయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మార కం విలువ బుధవారంనాడు రూ.94.44 పైస లుగా ఉంది. అంటే క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర భారత కరెన్సీలో రూ.10,388కి పెరిగింది. ఇక్కడ క్రూడ్‌ ఆయిల్‌ ధరను నియంత్రించడం లో, రూపాయి మారకం విలువ పడిపోవడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని అంగీకరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సిద్ధంగా లేరు.

రెండు రోజుల్లో రూ.11 లక్షల కోట్లు ఫట్‌..

వరుసగా రెండో రోజూ సూచీలు నేల చూపులు చూశాయి. దీంతో రూ.11 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. బుధవారం ఒక్కరోజే మార్కెట్‌ విలువ రూ.6.15 లక్షల కోట్లు తగ్గి రూ.461.78 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. ఇంతక్రితం సెషన్‌లో ఇది రూ.467.93 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు అక్టోబర్‌ 19న కూడా మదుపర్ల సంపదకు సుమారు రూ.5 లక్షల కోట్ల మేర కోత పడింది. ప్రధాన సూచీలతో పోలిస్తే స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లలో పతనం తీవ్రంగా ఉండటం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది. భారత స్టాక్‌ మార్కెట్లలో ఏరంగం కూడా లాభాల్లో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనేక కంపెనీల షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. గడచిన ఏడు పనిదినాల్లో దాదాపు రూ.18 లక్షల కోట్ల సంపదను మదుపరులు కోల్పోయారు. గడచిన నెల రోజుల్లో సెప్టెంబర్‌ నెల చివరి నుంచి అక్టోబర్‌ వరకు మార్కెట్‌ వరుసగా 8 వారాల పాటు నష్టాలను చవిచూడటం 25 ఏండ్లలో ఇదే తొలిసారి. ఇది సుదీర్ఘ నష్టాల రికార్డుగా కూడా నమోదైంది. స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేయడానికి అందుబాటులో ఉండే ఒక నిర్దిష్ట కాలపరిమితి (డెరివేటివ్స్‌ సిరీస్‌)లో సెప్టెంబర్‌ మాసంలో నిఫ్టీ-50 దాదాపు 6.7 శాతం వరకు పతనమవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇంట్రాడే భారీ నష్టాలు: స్టాక్‌ మార్కెట్‌లో ఒకే రోజులో షేర్లను కొనుగోలు చేసి, అదే రోజున తిరిగి విక్రయించడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్‌ అంటారు. అక్టోబర్‌ నెలలో పలు సెషన్లలో మార్కెట్‌ భారీగా కుప్పకూలింది. అక్టోబర్‌ 1న రూ. 9.5 లక్షల కోట్లు, అక్టోబర్‌ 8న ఒకే రోజు సుమారు రూ. 11 లక్షల కోట్ల పైగా ఇన్వెస్టర్ల సంపద (మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) ఆవిరైపోయింది. అక్టోబర్‌ 21న కూడా ఒక దశలో భారీ అమ్మకాల ఒత్తిడితో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 8.53 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. మార్కెట్‌ ముగిసే సమయానికి ఆ నష్టం రూ.6.15 లక్షల కోట్లుగా ఉంది.

ఎందుకీ ఉపసంహరణలు?

భారత ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాదిలో రూ.3,07, 151 కోట్లు (32.52 బిలియన్‌ డాలర్లు) ఉపసంహరించుకున్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. ఇతర దేశాల్లోని స్టాక్‌ మార్కెట్లు వర్ధమానవేగంతో ముందుకు దూసుకెళ్తుంటే భారత్‌ వెనుకబడటానికి కారణాలేమిటన్నదే అసలు ప్రశ్న.

భారత స్టాక్‌ మార్కెట్లలో దేశీయ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నా, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2026 సెప్టెంబరులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి రూ.38,306 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. అయినప్పటికీ సూచీలు బలహీనపడటం, విదేశీ నిధుల ఉపసంహరణ, కంపెనీల భవిష్యత్‌ లాభాలపై అంచనాలు, అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని విస్మరించలేమని ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు.

ఉపసంహరణ అంతర్భాగమే!

పెట్టుబడులను ఎప్పుడైనా వెనక్కి తీసుకునే అవకాశం మార్కెట్‌ వ్యవస్థలో అంతర్భాగం. ఆ స్వేచ్ఛను సమస్యగా చిత్రీకరించడం కన్నా, పెట్టుబడిదారులు ఎందుకు భారత మార్కెట్ల నుంచి వైదొలుగుతున్నారో విశ్లేషించడం ముఖ్యం. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, కంపెనీల లాభదాయకతను బలోపేతం చేయడం, సాంకేతిక రంగాల్లో అవకాశాలను విస్తరించడం, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కల్పించడమే దీర్ఘకాలిక పరిష్కారాలు. కేంద్రం ఆ బాధ్యతల్ని విస్మరించి, తప్పును మరొకరిపైకి నెట్టే ప్రయత్నం చేయడం గర్హనీయం!

విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ : విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌ నుంచి అత్యంత భారీ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. సెప్టెంబర్‌ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 35,861 కోట్లను ఉపసంహరించుకున్నారు. అక్టోబర్‌ నెలలో ఇప్పటివరకు కేవలం కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో దాదాపు రూ.52,100 కోట్లను మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి లాగేశారు. ఈ రెండు నెలల్లోనే దాదాపు రూ. 3.12 లక్షల కోట్లకు పైగా నిధులను విదేశీ ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు.

నష్టాలు ఇలా...


దసరా పండుగ సెలవు తర్వాత బుధవారం భారత స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సెన్సెక్స్‌ మరోసారి 143.21 పాయింట్లు (0.19 శాతం) నష్టపోయి 73,709.69 వద్ద ముగిసింది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) లో టాప్‌ 50 కంపెనీల కూటమి అయిన నిఫ్టీ-50 మరోసారి 77.60 పాయింట్లు (0.34శాతం) నష్టపోయి, 22,811.35 వద్ద స్థిరపడింది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లో లిస్ట్‌ అయిన అత్యంత కీలకమైన, ఎక్కువ లావాదేవీలు జరిగే టాప్‌ బ్యాంకింగ్‌ షేర్ల సమూహం అయిన నిఫ్టీ బ్యాంక్‌ కూడా 511.20 పాయింట్లు (0.92శాతం) మరోసారి క్షీణించి 54,976.90 వద్దకు చేరింది.


కేంద్రం నిర్లక్ష్యం..


ఆయిల్‌ ధరల మంట: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 110 డాలర్లు (రూ.10,388) దాటడం భారత్‌ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. దీన్ని నియంత్రించాల్సింది కేంద్ర ప్రభుత్వమే.


అమెరికా బాండ్‌ రాబడులు: యూఎస్‌ 10-ఇయర్స్‌ ట్రెజరీ బాండ్‌ రల్డ్స్‌, డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతం కావడంతో విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన యూఎస్‌ మార్కెట్లలోకి మళ్లిస్తున్నారు. అక్కడి కంటే ఇక్కడి భారత మార్కెట్లు సురక్షితం అని భరోసా కల్పించడంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ విఫలమయ్యారు.


భారత మార్కెట్‌ వాల్యుయేషన్స్‌: ఇతర అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతీయ షేర్ల వాల్యుయేషన్లు చాలా ఖరీదుగా మారడం, కంపెనీల 
త్రైమాసిక ఆదాయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఒక కారణం. మోడీ సర్కార్‌ పారిశ్రామిక విధానాల్లోని లోపాలు భారత స్టాక్‌ మార్కెట్లలో వెల్లడవుతున్నాయి. దాన్ని గుర్తించకపోగా.. సమస్యను తప్పుతోవ పట్టించేలా కేంద్రం వ్యాఖ్యలు, చర్యలు ఉంటున్నాయి. మొత్తానికి భారత స్టాక్‌ మార్కెట్‌లో ఏదో ఉపద్రవం సంభవించబోతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్