Magazines

సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకా విడుదల

1 గంట క్రితం

Das and Ashutosh Ranka released
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 2 నిమిషాల చదవడం

శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని లిఖిత పూర్వక హామీ

 రిలీజ్‌‌కు ఢిల్లీ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశం

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

​ ఢిల్లీలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకాలను విడుదల చేయాలని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్ రితు రాజ్‌ ఆదేశించారు. వారు సమర్పించిన పూచీకత్తులను అంగీకరించిన అనంతరం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌కు ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు వారి జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కోరినప్పటికీ, కోర్టు వారి విడుదలకు అనుమతించింది. అయితే ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు వారి జ్యుడీషియల్‌ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలన్న అంశంపై బుధ‌వారం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ రితు రాజ్‌ విచారణ చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని, రాజ్యాంగ పరిధిలోనే నిరసనలు నిర్వహిస్తామని వారు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జంతర్‌మంతర్‌ నిరసన స్థలంగా గుర్తింపు లేని ప్రాంతంగా ఉన్నంతకాలం అక్కడ ఆందోళనలకు పిలుపునివ్వబోమని వారు కూడా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు సమర్పించిన హామీలను నమోదు చేసుకున్న మేజిస్ట్రేట్‌ వారిని విడుదల చేయాలని ఆదేశించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకాలను ఈనెల 13న పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 14వ తేదీన వీరిని ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించారు. ఈనెల 19న మరో రెండు రోజులపాటు కస్టడీని పొడిగించారు. తాజాగా మరో మూడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు అభ్యర్థించగా, మేజిస్ట్రేట్‌ విడుదలకు ఆదేశించారు. వారు ఆ రోజు జంతర్‌మంతర్‌ వద్ద బారికేడ్లు దాటి లోపలికి వెళ్లి జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ప్రయత్నించారని, అక్కడ నిరసనలపై నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరణ

కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ప్రత్యామ్నాయ న్యాయపరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయని న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రమోనియం ప్రసాద్‌ సూచించడంతో వారు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట తమ విడుదల కోసం వారు ప్రయత్నించారు.

రాజ్యాంగ పరిధిలోనే నిరసనలు

​ శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు హామీ ఇచ్చారు. జంతర్‌మంతర్‌ నిరసన స్థలంగా గుర్తింపు పొందని పరిస్థితి కొనసాగినంతకాలం అక్కడ ఆందోళనలకు పిలుపునివ్వబోమని తెలిపారు. తమ నిరసన కార్యక్రమాలను భారత రాజ్యాంగ పరిధిలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ హామీలను మేజిస్ట్రేట్‌ రికార్డుల్లో నమోదు చేశారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్