Magazines

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే..?

52 నిమిషాల క్రితం

What should you do to keep your eyes healthy?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 4 నిమిషాల చదవడం

‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటారు. అందువల్ల కంటిచూపును సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పౌష్టికాహారం, సరైన జీవనశైలితోపాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వాడకంలో నియంత్రణ పాటిస్తే కంటి చూపును చాలా వరకు కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...

కంటి అలసట, విపరీతంగా స్క్రీన్ చూడటం, శరీరానికి తగినంత నీరు అందకపోవడం, కంటి రక్షణను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలు కంటి ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం, వినోదం రెండింటి కోసం డిజిటల్ పరికరాలపై ఆధారపడటం రోజురోజుకూ పెరుగుతుండటంతో.. ఎక్కువ సమయం స్క్రీన్ల వైపు చూడటం వల్ల కంటి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. అలసటగా అనిపించినప్పుడు కళ్లను రుద్దడం లేదా శరీరానికి అవసరమైనంత నీరు తాగకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అయితే కాలక్రమేణా కళ్లకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

విపరీతంగా స్క్రీన్ చూడటం
నేటి డిజిటల్ ప్రపంచంలో స్క్రీన్​లకు దూరంగా ఉండటం కష్టం. అయినప్పటికీ, ఎక్కువ సమయం స్క్రీన్​లను ఉపయోగించడం వల్ల డిజిటల్ కంటి అలసట ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కళ్లు పొడిబారడం, మసక దృష్టి, తలనొప్పి వంటి సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. అంతేకాకుండా స్క్రీన్​ల నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది నిద్రకు అంతరాయం కలిగిస్తుందని పేర్కొంటున్నారు. కాబట్టి పరిమితం చేసుకోవాలని వివరిస్తున్నారు

సన్​గ్లాసెస్ ధరించకపోవడం
హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను రక్షించుకోకపోవడం వల్ల దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం ఈ కిరణాల బారిన పడటం వల్ల కంటిశుక్లం మ్యాక్యులర్ డీజెనరేషన్, కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు కాలక్రమేణా కంటి వెనుక భాగంలోని నిర్మాణాలను దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కళ్లను తరచుగా రుద్దడం
కళ్లు అలసిపోయినట్లు లేదా మంటగా అనిపించినప్పుడు వాటిని రుద్దడం పైకి హానికరం కాదని అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా ఇది నష్టాన్ని కలిగిస్తుందట. కళ్లను రుద్దడం వల్ల మురికి, బ్యాక్టీరియా కండ్లలోకి చేరి చికాకు కలిగించే అవకాశం ఉంటుంది. లేదా ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. నిరంతరం ఒత్తిడి అనేది కార్నియాను దెబ్బతియడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

కాంటాక్ట్ లెన్స్​లు శుభ్రంగా
కాంటాక్ట్ లెన్స్​లను పరిశుభ్రంగా పెట్టుకోకపోవడం వల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. లెన్స్​లను సరిగ్గా శుభ్రం చేయకపోవడం లేదా కలుషితమైన సొల్యూషన్స్ ఉపయోగించడం వల్ల హానికరమైన సూక్ష్మజీవులు చేరి, ‘మైక్రోబియల్ కెరటైటిస్’ వంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో కాంటాక్ట్ లెన్స్ ధరించేవారైతే, కంటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి క్రమం తప్పకుండా మంచి పరిశుభ్రతను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

క్రమం తప్పకుండా కంటి పరీక్షలు
ప్రారంభంలో ఎటువంటి లక్షణాలను చూపించని గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయస్సు సంబంధిత మ్యాక్యులర్ డీజెనరేషన్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించడానికి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఈ పరీక్షలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి నిర్ధారణ, చికిత్స ఆలస్యమై దృష్టి కోల్పోయే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు.

తగినంత నీరు
డీహైడ్రేషన్ వల్ల కళ్లు పొడిబారడం, అసౌకర్యం, మసక దృష్టి ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో తగినంత నీరు లేనప్పుడు, కన్నీళ్ల ఉత్పత్తి తగ్గి కళ్లలో మంట పుడుతుందని అంటున్నారు. కంటి మొత్తం సౌకర్యం, ఆరోగ్యం కోసం శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని, ఇందుకు క్రమం తప్పకుండా నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.

తగినంత నిద్ర
కళ్లు అలసట నుంచి కోలుకోవడానికి, సరిగ్గా పనిచేయడానికి తగినంత విశ్రాంతి అవసరం. మనం నిద్రపోయే సమయంలోనే కళ్లకు అవసరమైన తేమ తిరిగి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం వల్ల కళ్లు పొడిబారడం, కంటి అలసట, కంటి ఉపరితల రుగ్మతలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు.

సరైన పోషకాహారం
పోషకాల లోపం వల్ల కంటి వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. క్షీణతకు దారితీసే సమస్యల ప్రమాదం పెరుగుతుందని అంటు న్నారు. విటమిన్లు A, C, Eలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉండే ఆహారం రెటీనా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటున్నారు. మంచి దృష్టిని కాపాడుకోవ డానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యమని తెలియజేస్తున్నారు. కొవ్వు తక్కువగా ఉండి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం తీసుకో వడం గుండెకే కాకుండా, కళ్లుకు కూడా సహాయ పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

వయసుకు తగినట్టు జాగ్రత్తలు
- పిల్లల కంటి చూపు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి గర్భస్థ దశలోనే ఆహారం, జీవనశైలిపై ప్రత్యక శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు. కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చాలా ముఖ్యమని చెబుతున్నారు. గర్భిణులు ఆకుకూరలు, క్యారెట్లు, నారింజ వంటి పండ్లు, చేపలు క్రమం తప్పక తీసుకోవాలని పేర్కొంటున్నారు. గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలని తెలియజేస్తున్నారు. - నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల్లో రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ ఏమైనా ఉందా అనేది కంటి డాక్టర్లుతో పరీక్ష చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పుట్టిన వెంటనే పిల్లలకు కంటిలో ఏదైనా పుట్టుకతో వచ్చిన లోపాలు (క్యాటరాక్ట్, గ్లకోమా) ఉన్నాయేమో పరీక్ష చేయించాలంటున్నారు. మెల్లకన్ను లక్షణాల్ని గమనించాలని చెబుతున్నారు. కంటి కదలికలు అసాధారణంగా ఉంటే డాక్టర్​ని సంప్రదించాలని తెలియజేస్తున్నారు. - పిల్లలకు ఆహారంలో పాలు, గుడ్లు, ఆకుకూరలు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ స్క్రీన్లకు సాధ్యమైనంత దూరంగా ఉంచాలని చెబుతున్నారు. ఎక్కువ సమయం మొబైల్ చూస్తే కంటి నరాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలని తెలియజేస్తున్నారు. - బడికెళ్లే పిల్లలు 20-20-20 రూల్ పాటించేలా చూడాలి. ఆన్​లైన్ క్లాసులు వింటుంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడటం అలవాటు చేయాలంటున్నారు నిపుణులు. ఇది కళ్లద్దాలు రాకుండా చాలా వరకు అడ్డుకుంటుందని చెబుతున్నారు. అలాగే చదువుకునేటప్పుడు పుస్తకంపై వెలుతురు సరిగా పడేలా చూసుకోవాలంటున్నారు. రోజుకు కనీసం 1-2 గంటలు సూర్యరశ్మి తగిలేలా ఆరుబయట ఆడుకోవటం వల్ల మయోపియా (దగ్గరి చూపు మాత్రమే కనిపించడం/ హ్రస్వదృష్టి) వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్