(ఈ రోజు ప్రపంచ బాలికా దినోత్సవం)
ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నట్టు గణాంకాలు చెబుతు న్నాయి. ప్రతీ 101 మంది పురుషులకు 100 మంది మహిళలు ఉన్నారు. మనదేశంలో 715 మిలియన్ల మహిళలు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మహిళా జనాభా ఉన్న దేశాలు మోల్డోవా, లుథివియా, రష్యా ఉండగా అత్యధిక మహిళలు ఉన్న నగరం జపాన్‌లోని టోక్యో. ఇంత భారీ ఎత్తున మహిళలు ఉన్నప్పుటికీ సమానత్వం, హక్కులు, రక్షణ, విద్యా, ఆరోగ్యం, లింగ అసమానతలు వంటి అంశాల్లో వారి పరిస్థితి నేటికీ ఆందోళనకరంగానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో చూసినా మహిళలు, బాలికలపై జరుగుతున్న వివిధ రకాల దాడులు, హింసలు, కిడ్నాప్‌లే కనపడు తున్నాయి. ‘మహిళలకు, బాలికలకు రక్షణ ఎక్కడ’ అనే ప్రశ్న వేధిస్తున్నది.
మనదేశంలోనైతే అమ్మాయిని మహాలక్ష్మితో పోలుస్తారు. వాస్తవంగా బాలికలకు ఇస్తున్న గౌరవం ఏమిటి? ఎక్కడ చూసినా మగవారి ఆధిపత్యమే. మహిళలు లేకపోతే మనుగడే లేదు అనే నిజాన్ని అందరూ గుర్తించాలి. మహిళలు, బాలికల రక్షణ, హక్కులు, భద్రత కోసం ప్రయత్నం చేయాలి. దీనిలో భాగంగానే అమెరికా పౌర హక్కుల నేత ‘ఎలనార్ రూజ్ వెల్ట్’ మహిళల హక్కుల కోసం పోరాటం చేసి, సమానత్వంలో భాగంగా ‘మ్యాన్’ అనే మాటకు బదులుగా ‘పీపుల్’ అనే పదం వాడుకలోకి తెచ్చారు. అటువంటి ఆమె జన్మదినమైన అక్టోబర్ 11వ తేదీని ‘ప్రపంచ బాలికా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం.
ఈ ఏడాది థీమ్
అమ్మాయిల రక్షణపై 2012 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ‘కెనడా’లోని ‘ప్లాన్ ఇంటర్నేషనల్’ అనే సంస్థ రూపొందించిన ‘ఐ యామ్ ఏ గర్ల్’ అనే క్యాంపెయిన్ ప్రతిఫలమే ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఇక ప్రపంచ వ్యాప్తంగా బాలికల సమస్యలు పరిష్కారం కోసం ‘ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ’ 66/170 తీర్మానం ఆమోదం చేసి, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరపాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది ‘ఎండ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ గర్ల్ రైట్స్’ అనే థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుతున్నారు.
భర్త బాధితులే ఎక్కువ
నేటి బాలికలే రేపటి మహిళలు. భవిష్యత్తు వ్యాపార వేత్తలు, కుటుంబ యజమానులు, రాజకీయ నేతలు అనే విషయాలు గ్రహించాలి. అందుకే ఐక్యరాజ్యసమితి తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 17వ లక్ష్యంగా ‘లింగ సమానత్వం, స్త్రీలు స్వయం సమృద్ధి సాధించడం, సమాన హక్కులు, ఆర్థిక స్వావలంబన’ 2030 నాటికి సాధించాలని నిర్ణయించి, తదనుగుణంగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నేటికి 133 మిలియన్ల బాలికలు విద్యకు దూరంగా ఉన్నారు. ప్రతీ 10 మందిలో 4 గురు కనీసం అప్పర్ ప్రైమరీ స్కూల్ చదవడం లేదు. అలాగే ‘యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైం’ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భర్త బాధితులే ఎక్కువగా ఉన్నారు.
తేలిసిన వారే ఎక్కువ
‘ఓ.హెచ్.సి.హెచ్. ఆర్’ సంస్థ రూపొందించిన లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్, లైగింక దాడులు, వివక్షత వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువగా బాలికలు, మహిళలే. ఇక మనదేశంలో ప్రతీ రోజు 88 మంది లైంగిక దాడులకు గురౌతున్నారు. ముఖ్యంగా 2015 -2024 మధ్య కాలంలో యన్.సి.ఆర్.బి నివేదికలు ప్రకారం మనదేశంలో మైనర్ బాలికలపై లైంగికదాడులు, హింస పెరిగిపోయింది. 97శాతం దాడులు తెలిసిన వారు, కుటుంబ సభ్యులే చేస్తున్నారు. 18 ఏండ్ల లోపు లైంగిక దాడులకు గురైన బాలికల సంఖ్య 2015లో 10, 934 మంది ఉండగా, 2024 నాటికి 43, 675కు పెరిగిపోయింది. ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే, అనధికారికంగా ఇంకెన్నో..? ఇక ‘పొక్సో’ చట్ట ప్రకారం నమోదైన కేసులు పరిశీలిస్తే 2020-2024 మధ్య కాలంలో బాలికలపై జరిగిన లైంగిక దాడుల సంఖ్య 1,83,372, సెక్సువల్ అసాల్ట్ కింద 96,505, సెక్సువల్ హెరాస్మెంట్ కింద 12,807 కాగా ఇతర కేసుల సంఖ్య 3037.
ఆధునిక బానిసత్వంలో...
గత 24 ఏండ్లలో మనదేశంలో అమ్మాయిలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని యన్.సి.ఆర్.బి, పొక్సో అధికార నివేదికలు చెబుతున్నాయి. గత ఐదేండ్ల కాలంలో 3 లక్షల మంది బాలికలు సెక్సువల్ అబ్యూస్‌కి గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 మిలియన్ల మంది బాధితులు ఆధునిక బానిసత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు బాలికలు, మహిళలే. ఇక మనదేశంలో 2023లో ‘క్రైం అగైన్స్ట్ ఉమెన్’ కింద నమోదైన కేసులు 4,48,211. ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీ బాలికలు, మహిళలకు రక్షణలేని ప్రాంతంగా తరచూ వార్తల్లో నిలవటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఒడిసా, తెలంగాణ వంటి రాష్ట్రాలు బాలికలు, మహిళలకు రక్షణలేని ప్రాంతాలుగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.
ఓట్ల కోసం తప్ప
ఇటీవల కోల్‌కతాలో జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. మన తెలుగు రాష్ట్రాల్లోనైతే రెసిడెన్షియల్ పాఠశాలల్లో, వసతి గృహాల్లో కూడా బాలికలకు రక్షణ లేదు. ఇక పని ప్రదేశాల్లో భద్రత లేని పరిస్థితి. పాఠశాలల్లో బాలికలకు కనీసం ప్రత్యేక మూత్రశాలలు లేకపోవడం విచారకరం. మరి మన పాలకులు ఎప్పుడు గ్రహిస్తారో చూడాలి. కేవలం ఓట్ల కోసం కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు తప్పా, బాలికల అభ్యున్నతికి కృషి చేయడం లేదు. ఈ కారణంగానే అంతర్జాతీయ మహిళా రక్షణ భద్రత సూచిలో(2025-26) మన భారతదేశం 131వ స్థానంలో ఉంది. 181 దేశాల్లో మన దేశ ర్యాంకు 131 అంటే ఎంతో ఆందోళన పడవలసిన విషయం. దేశం అభివృద్ధి చెందుతున్నదనీ, జీడీపీ వృద్ధిరేటు సాధిస్తుందని సంబర పడుతున్న పాలకులు, బాలికల అభివృద్ధిలో ఎంతగా వెనుకబడి ఉన్నారో గుర్తిస్తే మంచిది. ఇక యుద్ధాల సమయంలో ఎక్కువగా బలయ్యేది బాలికలు, మహిళలే. శరణార్థుల్లో కూడా అఘాయిత్యాలు, అన్యాయాలకు గురయ్యేది వారే.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
మనదేశంలో ఇప్పటికే బాలికలు, మహిళల రక్షణ కోసం చాలా చట్టాలు ఉన్నాయి. కానీ ఇవేవీ వారికి రక్షణ కల్పించలేకపోతున్నాయి. మద్యం, డ్రగ్స్ వంటివి ఈ అఘాయిత్యాలకు ప్రధాన కారణం. అలాగే సామాజిక మాధ్యమాలు, అశ్లీల చిత్రాలు, పోర్న్ సైట్లు, వివిధ రకాల వెబ్ సైట్లు, యాప్స్, డేటింగ్ యాప్‌లు, చెడు స్నేహితులు, తల్లిదండ్రులకు దూరంగా ఉండటం, నైతిక, మానవ విలువలు లేకపోవడం, కొన్ని రకాల మోజులు, ఆకర్షణలకు లోనవడం, సులభంగా డబ్బులు సంపాదించడం, నిఘా లోపం వంటి మరెఎన్నో కారణాలు కూడా కారణమవుతున్నాయి. అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. బడ్జెల్లో నిధులు కేటాయించాలి. ముఖ్యంగా విద్యా వైద్య రంగాలపై దృష్టి పెట్టాలి. చట్టాలు సక్రమంగా అమలు చేయాలి. నిఘా వ్యవస్థ పటిష్టపరచాయి. పోలీస్ పెట్రోలింగ్ పెరగాలి. డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపాలి. తల్లిదండ్రులు మరింత శ్రద్ధ తీసుకోవాలి. బాధ్యతలు నేర్పాలి. సెల్ వాడకంపై నియంత్రణ ఉండాలి. ఉపాధ్యాయులు నైతిక విలువలు, మానవ విలువలు బోధించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయాలి. ఈ విధంగా ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టడం ద్వారానే బాలికలకు రక్షణ లభిస్తుంది. పాలకులు అంటున్న 2047 నాటికి వికసిత భారత్ సాధ్యం కావాలంటే బాలికలు, మహిళలు భాగస్వామ్యంతోనే సాధ్యమని గ్రహించాలి.
బాలికల రక్షణతోనే...
యునెస్కో గణాంకాలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 5 గురు బాలికల్లో ఒకరికి బాల్య వివాహాం జరుగుతుంది. ఈ వయసులో ఉన్న ప్రతీ 4 గురు వివాహితుల్లో ఒకరు హింసకు గురౌతున్నారు. 15-19 ఏండ్ల మధ్య వయసులో ఉన్న బాలురుతో పోలిస్తే, దాదాపు రెట్టింపు మంది ఇదే వయసున్న బాలికలు చదువు మానేస్తున్నారు. బాల్య వివాహాల్లో అత్యధికంగా అనగా 31శాతం సబ్ సహారా దేశాల్లో జరుగుతున్నాయి. దీనివల్ల చాలా మంది శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్న వివిధ చర్యల వల్ల గత 25 ఏండ్ల కాలంలో సుమారు 68 మిలియన్ల మంది బాల్య వివాహాలు నుంచి బయటపడ్డారు. ముఖ్యంగా 1995 ‘బీజింగ్ డిక్లరేషన్’ మంచి ఫలితాలు వచ్చాయి. ఒక్క మాట మాత్రం వాస్తవం.. బాలికలకు రక్షణ కల్పించడం ద్వారా, మంచి విద్య, ఆరోగ్యం అందించడం ద్వారా మంచి కుటుంబాలు ఏర్పడతాయి, బలమైన సమాజం అభివృద్ధి చెందుతుంది, శాంతి సామరస్యం ఉంటుంది.
- ఐ.ప్రసాదరావు 9390509791






కామెంట్‌లు (0)