సి.ఇ.సి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనీ, ఓట్ చోరీ రాజకీయాలు ఆపాలని దేశం అట్టుడికిపోతుంటే ప్రధాని నరేంద్ర మోడీ పాతికేళ్ల సేవాసంకల్పం ప్రహసనానికి బిజెపి, ఆర్.ఎస్.ఎస్ లతో పాటు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలైన టిడిపి వంటివి ఆరాటపడుతున్నాయి. బడా మీడియాలో వరుసగా వ్యాసాలు, టీవీలలో ప్రసారాలు హోరెత్తిపో తున్నాయి. కార్పొరేట్ల నుంచి కాషాయ స్వాముల వరకూ భజనలో మునిగితేలుతున్నారు. మోడీ స్వయంగా తన రాజకీయ ప్రస్థానం గురించి గొప్పగా చెప్పుకుం టున్నారు. తనను దించేయాలని కుట్రలు జరిగిన ప్రతిసారీ తను మరింత బలోపేతమవుతూ వస్తున్నానని ఎందరినో గెలిపించానుగానీ తానెప్పుడూ పదవులు కోరుకోలేదని నిరాసక్త భంగిమ అభినయిస్తున్నారు. ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపు, ఇంధన ధరల సంక్షోభం, ఎల్‌నినో తాకిడి, నిరుద్యోగ విజృంభణతో యువత జెన్ జీ పోరాటాలు, విద్యా రంగ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ జెన్ ఆల్ఫా కూడా వీధుల్లోకి రావడాలు, దేశ రాజధానిలోనే మహిళలకు రక్షణ లేదేంటని సుప్రీంకోర్టులోనే సంధించిన ప్రశ్నలూ, ఉపాధి కోసం విదేశాలకు తరలివెళ్లినా అక్కడ కూడా ట్రంప్ విధించిన విపరీత ఆంక్షలూ ... ఇవేవీ ఈ భజనపరుల కంట పడటం లేదు. నమో మోడీ, మహా మోడీ స్మరణలోనే వారు మునిగితేలుతున్నారు. ఈ భజన మొత్తం అవాస్తవాలపై ఆధారపడి వుండటం ఒకటైతే ఇంత హంగామాతో హాలాహలం మింగించాలనుకుంటున్న తీరు మరింత ఆందోళనకరం. దీర్ఘకాలం పదవులలో వుండటం ఎవరూ కాదనరు గానీ దాని ఆధారంగానే నేతలు మహాత్ములూ కథాత్మక వ్యక్తులూ అయిపోతారనడం చెల్లుబాటయ్యేది కాదు. పైగా అది పూర్తిగా నిజం కాదు.
మొదటిది ఈ సేవా సంకల్ప్ నిజానికి మోడీ సంకల్పం మాత్రమే. ఈ వేడుకలో ఆయన పుట్టిన రోజును, గుజరాత్ ముఖ్యమంత్రి అయిన రోజునూ కలిపి వ్యక్తిపూజనూ మరోవైపు పాలకుడి పాత్రనూ కలగాపులగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పాత్రలూ కలగాపులగం చేస్తున్నారు. దానికి ముందు ఆయన ఆర్.ఎస్.ఎస్, బిజెపి నేతగా సాగించిన మత రాజకీయాలను-తర్వాత అధికారికంగా అమలు చేస్తున్న నిరంకుశ కార్పొరేట్ హిందూత్వ విధానాలను మోడీ పేరిట చలామణి చేయడం విడ్డూరమే. వాటిని మరుగుపర్చడమే గాక ఇప్పుడు వాటిని కొనసాగించడం కూడా ఘనతేనన్నట్టు నమ్మించే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఇందుకు భిన్నంగా ఈ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారెవరైనా దేశానికి వ్యతిరేకులు, అభివృద్ధికి అడ్డుపడేవారుగా చిత్రించబడుతున్నారు. ఈ భజన బృందాలేవీ విమర్శనాత్మక వాస్తవాలను కనీసంగానైనా స్పృశించకుండా దాటేస్తున్నారు.
లోగుట్టు ఎరుకే
తానెందరి విజయాలకో కృషి చేశాను గానీ ఏనాడూ పదవి కోరలేదని మోడీ మొన్న చెప్పారు. 1995-2000 అయిదేళ్లపాటు గుజరాత్‌లో కేశూభాయ్ పటేల్, శంకర్ సింగ్ వాఘేలా మధ్య విభేదాలు పరిష్కారం కాలేదు గనకే రాజీ అభ్యర్థిగా మోడీని పంపించారు తప్ప ఆయన ప్రజల ఓట్లతో ఎన్నికవలేదు. అప్పుడు కూడా భుజ్ భూకంపం సహాయ కార్యక్రమాలను సమన్వయం చేయడం పేరిట అడుగు పెట్టిన మోడీ నెమ్మడిగా తానే పగ్గాలు చేజిక్కించుకున్నారు. మొదట ఆయనను ఉప ముఖ్యమంత్రిగా వెళ్లి కేశూభాయ్‌కి సహాయం చేయవలసిందిగా అధిష్టానం చెబితే ఒప్పుకోలేదు. వెళితే ముఖ్యమంత్రిగానే వెళతానని పట్టుపట్టారు. నాటి ప్రధాని వాజ్‌పేయి, అతి కీలక నేత అద్వానీ మధ్య తేడాలను ఉపయోగించుకుని అద్వానీ ఆశీస్సులతోనే అధికారంలోకి రాగలిగారు. వచ్చిన కొద్ది కాలంలోనే గోద్రా రైలు బోగీ దగ్థంలో కరసేవకుల సజీవ దహనానికి ప్రతీకారంగా మత మారణకాండ జరిగింది. ఈ భజనలో ఆ మాటే ఇప్పుడు రావడం లేదుగానీ ఖచ్చితంగా మోడీ ప్రస్థానంలో అదే మొదటి అడుగు. ఆ గాయాలు మానక ముందే భయోత్పాతంలోనే ఆదరాబాదరాగా ఎన్నికలు పెట్టించి మళ్లీ గెలిచాననిపించుకున్నారు. మధ్యలో పదవి చేపట్టి మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన మోడీ మొదటి దఫానే పూర్తికాలం ఏలింది లేదు. ముఖ్యమంత్రులుగా జ్యోతిబసు, నవీన్ పట్నాయక్, నర్ బహదూర్ భండారీ లాంటి చాలా మంది రికార్డు మోడీ కంటే ఎక్కువ. ఇక ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎంపిక చేసింది అక్షరాలా కార్పొరేట్ శక్తులే. వరుసగా ఓడిపోయిన బిజెపి, ఆర్.ఎస్.ఎస్ లు అనివార్యంగా ఆయన షరతులకు ఒప్పుకుని మరీ త్రీడీలో చూపించి గెలిపించాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన 4600 రోజులు కలిపి దేశంలోనే అత్యధిక పాలనా కాలంగల నేతగా చెబుతున్నారు.
నెహ్రూపై దాడి
జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగష్టు 15 నుంచి 6130 రోజులు నిరాఘాటంగా పాలించారు. 1964లో పదవిలో వుండగానే కన్ను మూశారు. ఇందిరా గాంధీ ఒక విరామంతో 5831 రోజులు పాలించారు. సిక్కు ఉగ్రవాది హత్య చేయడం వల్ల ఆమె పదవీ కాలం ముగిసింది. కాకపోతే ఎమర్జన్సీ తర్వాత 1977-80 మధ్య ఇందిరా గాంధీ ఓడిపోయారు. అయినా మొత్తం రోజులు లెక్క వేస్తే మోడీకి చెబుతున్న దానికంటే ఎక్కవ. ఎ.పి. లో చంద్రబాబు నాయుడు 20024, 2009, 2019 మూడు సార్లు ఓడిపోయారు. అయినా స్కోరు మాత్రం అత్యధిక కాలం అని చెబుతూనే వున్నారు కదా. మరి నెహ్రూ ఇందిరలకు అది వర్తించదా? నెహ్రూ1947లో ఎన్నికైన ప్రధాని కాదనేది మరింత తప్పు వాదన. వాస్తవం దేశానికి స్వాతంత్య్రంపై చర్చలు మొదలైనాక బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ కింద 1946 జులై-ఆగష్టులో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 296 స్థానాలకు రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. ఇందులో 208 కాంగ్రెస్ పార్టీనే గెల్చుకుంది. ముస్లిం లీగ్ 73 స్థానాలను తెచ్చుకుంది. మరో 93 స్వదేశీ సంస్థానాధీశులకు కేటాయించారు. దేశ విభజన, స్వాతంత్య్రం అనంతరం నెహ్రూను ప్రధానిని చేయడం ఈ బలాన్ని బట్టి తప్ప ఏదో నియామకం కాదు. పైగా 1949లో రాజ్యాంగ పరిషత్తును తాత్కాలిక పార్లమెంటుగా నిర్ణయించారు. 1952 ఎన్నికలకు కూడా ఆ రాజ్యాంగమే పునాది. నెహ్రూ స్వాతంత్రోద్యమ అత్యున్నత నేతలలో ఒకరుగా వున్నారు. అయితేనేం... మోడీ గొప్ప కోసం ఆ అయిదేళ్లు తుడిచేసి ఆయనే గొప్ప అని టముకు వేసుకుంటున్నారు. బండి సంజయ్ అయితే నెహ్రూ ‘సీట్ చోరీ ప్రధాని’ అని నోరు పారేసుకున్నారు. అంటే జిడిపి లెక్కలలో గోల్ మాల్ లాగే చరిత్ర లెక్కలు కూడా మా ఇష్టమేనంటే ఓకె.
ఓటమి నుంచి ఓట్ చోరీకి
వాస్తవానికి 2024 ఎన్నికల్లోనే మోడీ స్వయంగా మెజార్టీ కోల్పోయారు. 400 స్థానాలు వచ్చేస్తాయని కోతలు కోసి 240 దగ్గరే ఆగిపోవడం శృంగభంగమైంది. టిడిపి, జెడియు వంటి పార్టీల మద్దతుపైనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి కొత్త కవరప్ థియరీలు పెరిగాయి. ఆ అవిన్యాసం ఎన్నికల ఫలితాలు రాకముందే మొదలైంది. రాబోయే వంద రోజులలో ఏం చేయాలనేది ముందే గత ప్రభుత్వమే చర్చకు పెట్టడం అంతకు ముందు ఎన్నడూ జరగలేదు. రెండు కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణం, యువతకు సహాయ పడేందుకు రెండు లక్షల కోట్ల సహాయం, గ్రామాలకు రోడ్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, కొత్త పెన్షన్ పథకం, 11 లక్షల మంది మహిళలను లక్షాధికారి దీదీలను చేయడం, రైతులకు సహాయం ఇలా చాలా జాబితా చదివారు. నిరుద్యోగం ప్రపంచంలో ఎక్కడా లేనంత రికార్డు స్థాయిలో వుంటే వారి పేరిట కార్పొరేట్లకు నెల జీతం జమ చేస్తామన్నారు. పాలక వర్గాల ఒత్తిడికి లొంగి గ్రామీణ ఉపాధి పథకం రద్దు చేసి వి.బి. గ్రామ్‌జీ తెచ్చారు. ఇవన్నీ చేసినా గెలిచే అవకాశం లేదు గనకే ‘సర్’ తతంగంతో రాష్ట్రాలలో కృత్రిమంగా గెలిచే ప్రయత్నాలు అవసరమై నాయి. జమిలి ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన వంటివన్నీ ఆ కోనసాగింపే. ఈ నీతిమాలిన చర్యలతో బిజెపి రాష్ట్రాలలో గెలిచామని పించుకున్నా దేశ ఆర్థిక దురవస్థ వెక్కిరిస్తోంది. ట్రంప్, నెతన్యాహూ దురాక్రమణ దాడులతో ప్రపంచ పరిస్థితి తలకిందులైంది. మోడీ విశ్వగురు గొప్పలు కుప్పకూలాయి.
సంకల్పాలు, వికల్పాలు
మూడోసారి ఎన్నికల తర్వాత బిజెపి నేతలు ఇష్టానుసారం మాట్లాడటం, కంగనా రనౌత్, బ్రిజ్ భూషణ్ సింగ్‌తో సహా పలువురు ఆంక్షలకు గురి కావడంలో అసహనం ప్రతిబింబించింది. రాహుల్ గాంధీని దేశంలోనే మొదటి టెర్రరిస్టు అని కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ దూషించారు. ఇలాగే మాట్లాడితే మీ నానమ్మ గతే మీకు పడుతుందని మరో నేత బెదిరించారు. మోడీ ప్రభ తగ్గిందని తేలిపోవడంతో తమ సంస్థకు ఎవరూ దేవుడు కాదనీ, ఎప్పుడూ ఒకరినే తాము నెత్తిన పెట్టుకోమని కూడా మోహన్ భగవత్ వంటి వారు సంకేతాలు పంపారు. ఆర్‌ఎస్‌ఎస్ వారికి ప్రాథమికంగా అధికారం చలాయించడం, మతతత్వ ఎజెండా చలామణి చేయడం ముఖ్యం. ఏదో విధంగా తమ అసంతృప్తినీ కొరతనూ బయటపెట్టడానికి అదే సమయంలో తమ మధ్య ఏదో తేడా వుందనే భ్రమ కలిగించడానికి చాలా మాట్లాడుతుంటారు. ఒకవైపున సేవా సంకల్ప్ జరుగుతుంటే మరోవైపున మోహన్ భగవత్ నిత్య సూక్తులు వినిపిస్తూనే వస్తున్నారు. నిజానికి సేవా సంకల్ప్ తతంగం మొదటిసారి జెన్ జీ ఉద్యమ నేపథ్యంలోనే తలపెట్టారు. ఆ హడావుడితో తప్పులు కప్పిపుచ్చు కోవాలనుకుంటే నేరుగా ఎన్నికల సంఘం నిర్వాకాలతో ఓట్ చోరీనే సవాలుగా తయారైంది. ఇందులోనూ జెన్ జీ కీలక పాత్ర వహించడమే గాక ప్రతిపక్ష ఎంపీలపై నిర్బంధం అంతర్జాతీయ చర్చగా మారుతున్నది. కాకపోతే ఎ.పి లో చంద్రబాబు వంటి వారు నేరుగా వారణాసి వెళ్లి మరీ మోడీ కోసం యాగం చేయడం. టిడిపి నేతలు సైకిల్ యాత్రలు నిర్వహించడం హాస్యాస్పదంగా తయారైంది. ఓట్ చోరీపై విమర్శలు, సిఇసి నియామకంపై అభ్యంతరాలు చెబుతూనే వైసిపి అధినేత జగన్ కూడా మోడీకి అభినందన సందేశం పంపించడం గమనించదగ్గది. బిఆర్‌ఎస్ కూడా ఆ విషయాలపై విమర్శలు చేస్తూనే తెలంగాణ పరిస్థితిని మోడీ ఏకపక్ష నిరంకుశత్వాన్ని ఒకటిగా చిత్రించడంలో తలమునకలవుతున్నది. పాలక పార్టీలు ఎవరు ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు ప్రజాస్వామ్య ప్రియులు కళ్ల ముందు కనిపించే నిజాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు కదా? అందుకే ఈ సంకల్పాలు, వికల్పాలు నవ్వు తెప్పించక మానవు.
తెలకపల్లి రవి






కామెంట్‌లు (0)