Magazines

తెలంగాణ ఫార్మా హబ్‌.. ప్రొఫెసర్లు ఏరి?

46 నిమిషాల క్రితం

Where are the professors?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

429 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల్లో కెమిస్ట్రీ 8, ఫార్మసీకి రెండే..

ఔషధ పరిశ్రమలో కీలక విభాగాలకు నామమాత్రపు కేటాయింపులు

పరిశ్రమల అవసరాలు, ఉన్నత విద్యా ప్రాధాన్యానికి పొంతన లేని వైనం

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ

​ఔషధ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా వెలుగొందు తున్న తెలంగాణలో కీలక అధ్యాపక విభాగాల్లో నామ మాత్రంగా పోస్టుల భర్తీ అవుతున్నాయి. కెమిస్ట్రీ, ఫార్మసీ వంటి కీలక విద్యా విభాగాలకు ప్రభుత్వ విశ్వ విద్యాల యాల అధ్యాపక నియామకాల్లో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం లభించడం లేదు. దేశీయ, అంతర్జాతీయ ఔషధ సంస్థలు, పరిశోధన కేంద్రాలు, ఔషధ తయారీ పరిశ్రమలకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉంది. ఆయా రంగాలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టుల కేటాయింపు మాత్రం పరిమితంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 18న విడుదల చేసిన జీవో నంబర్‌ 142 ద్వారా రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో 429 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అనుమతించింది. కెమిస్ట్రీకి 8, ఫార్మసీకి రెండు పోస్టులు మాత్రమే కేటాయిం చడం గమనార్హం. ఔషధ పరిశ్రమకు అత్యంత కీలకమైన ఈ రెండు విభాగాలకు ఇంత తక్కువ సంఖ్యలో పోస్టులు కేటాయించడం ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో చర్చకు దారితీస్తోంది.

​ఓయూ ప్రధాన క్యాంపస్‌లో పోస్టులు నిల్‌

ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్‌లో కెమిస్ట్రీ, ఫార్మసీ విభాగాలకు ఒక్క అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు కూడా కేటాయించలేదు. ఉస్మానియా అనుబంధ పీజీ కళాశాలల్లో కెమిస్ట్రీకి మూడు పోస్టులు కేటాయించగా, కాకతీయ విశ్వవిద్యాలయంలో రెండు, శాతవాహన విశ్వవిద్యాలయంలో రెండు, పాలమూరు విశ్వవిద్యాలయంలో ఒక పోస్టు మాత్రమే ఉంది. ఫార్మసీ విభాగానికి శాతవాహన విశ్వవిద్యాలయంలో రెండు పోస్టులు మాత్రమే కేటాయించారు.

​రసాయన శాస్త్రమే పునాది

కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేయాలంటే రసాయన శాస్త్రవేత్తల కృషి అత్యంత కీలకం. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, అనలిటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ వంటి విభాగాలు ఔషధ పరిశోధన, అభివృద్ధికి మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి. రసాయన శాస్త్రం, ఫార్మసీ విభాగాలు పరస్పర అనుసంధానంతో పనిచేస్తేనే ఔషధ పరిశోధన నుంచి సురక్షితమైన మందుల తయారీ వరకు సమర్థమైన వ్యవస్థ ఏర్పడుతుంది.

​విస్తరిస్తున్న పరిశ్రమలు

హైదరాబాద్‌ కేంద్రంగా ఔషధ తయారీ, పరిశోధన, బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలు విస్తరిస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులను తయారు చేయడంలో విశ్వవిద్యాలయాల పాత్ర కీలకం. కెమిస్ట్రీ, ఫార్మసీ విభాగాల్లో ఎమ్మెస్సీ, ఎం.ఫార్మసీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను పూర్తి చేసి, ఏండ్ల తరబడి పరిశోధన, బోధనలో అనుభవం సంపాదించిన అభ్యర్థులకు ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. ​

విద్యారంగం బలోపేతం కావాలి

తెలంగాణను అంతర్జాతీయ ఔషధ, లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే పరిశ్రమల్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన బోధన, పరిశోధనకు సమాన ప్రాధాన్యం అవసరం. కెమిస్ట్రీ, ఫార్మసీ విభాగాల్లో అధ్యాపకుల సంఖ్య, ప్రయోగశాల సౌకర్యాలు, పరిశోధన అవకాశాలను బలోపేతం చేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్