దళితులపై కోనాయిపల్లి సర్పంచ్, అనుచరుల దాడి
గ్రామాన్ని సందర్శించిన కేవీపీఎస్, సీఐటీయూ, డీబీఎఫ్, బ్లూ ఇండియా పార్టీల ప్రతినిధి బృందం
సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలి
అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.అడివయ్య డిమాండ్
నవతెలంగాణ-తూప్రాన్/మనోహరాబాద్
మెదక్ జిల్లా తుప్రాన్ మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి (పిటి) గ్రామంలో బతుకమ్మ ఉత్సవాల్లో దళితుల పట్ల ఆ గ్రామ సర్పంచ్ వివక్ష చూపించారు. ఇదేంటని ప్రశ్నించిన దళితులపై సర్పంచ్, ఆయన అనుచరులు మరణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.అడివయ్య, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి.శంకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి, బ్లూ ఇండియా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూంపల్లి మధు, హైకోర్టు అడ్వకేట్ దివాకర్ పూలే, బీసీ మేథావుల ఫోరమ్ నాయకులు పాపని నాగరాజు గౌడ్, అనంత్, జర్నలిస్ట్ నగేష్, బీఎస్పీ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు చంద్రంతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించింది. దాడికి గురైన బాధితులతో మాట్లాడింది. ఈ సందర్భంగా బాధితులు బతుకమ్మ ఉత్సవాల్లో జరిగిన దాడిపై తమ గోడును బృందానికి తెలిపారు. అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.అడివయ్య మాట్లాడుతూ .. గ్రామంలో బతుకమ్మ ఉత్సవాల్లో దళితులు డప్పు కొట్టడం తరాతరాల నుంచి ఆనవాయితీగా వస్తుందనీ, సంప్రదాయానికి విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించినందుకు గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్, ఆయన అనుచరులు దళితులను ఎలా కొడతారని ప్రశ్నించారు. కాపాడాల్సిన సర్పంచ్ దాడి చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అంతేకాక సర్పంచ్ వారిని కులం పేరుతో దుషించారని తెలిపారు. వారి పిల్లలను ఎందుకు కొడుతున్నారని బతిమిలాడిన మహిళలను కూడా సర్పంచ్ దుర్భషలాడారని అన్నారు. ఒక్కొక్క దళితునిపై 30 మంది పడి కొట్టారని, దాడిలో అనేక మందికి గాయాలయ్యాయని తెలిపారు. బాధితులు ఇచ్చిన పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేయాల్సిన పోలీసులు, నిందితులకు అనుకూలంగా మరో పిటిషన్ రాయించడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్మికులపై దాడి జరిగి 72 గంటలు అవుతున్నా పట్టించుకోని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా దాడికి పాల్పడ్డ సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు నర్సిరెడ్డి దళితుల పక్షమా, దళితులపై దాడి చేసిన వారి పక్షమో తేల్చుకోవాలన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోని పక్షంలో ఈనెల 22న జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ దళితులు నర్సిములు, ప్రవీణ్, నిరంజన్ దాసు, గురుదాసు, కళ్యాణ్ దాసు, అర్జున్, రేణుక, శ్రావణి, ప్రమీల, నాగమణి, సత్యం, లలిత, హేమలత, అంశమ్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)