Magazines

ఈఎస్‌ఐలో క్లీనింగ్‌ కుంభకోణం

1 గంట క్రితం

ESI
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 3 నిమిషాల చదవడం

గురుభక్తి ప్రకటించుకున్న ఓ ఐఏఎస్‌ అధికారి

క్లీనింగ్‌ టెండర్‌ ధరను రూ.10 నుంచి రూ.49.50 పైసలకు పెంచిన వైనం

ఉపాధికల్పనా కమిటీ తిరస్కరించినా నామినేషన్‌‌పై పనుల అప్పగింత

రోగుల మందుల కొనుగోళ్లకు మాత్రం రకరకాల కొర్రీలు

సమగ్ర విచారణకు పెరుగుతున్న డిమాండ్లు


‘ఆమె ఓ ఐఏఎస్‌ అధికారి. హైదరాబాద్‌ అశోక్‌‌నగర్‌‌లోని ఓ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఐఏఎస్‌ ‌కాగానే తాను శిక్షణ పొందిన అకాడమీ యాజమాని భర్త పేరుతో ఉన్న ఓ ఔట్‌‌సోర్సింగ్‌ సర్వీస్‌ ‌ఏజెన్సీకి ఆయాచిత లబ్ది చేకూర్చారు. రాష్ర్టంలో ఉన్న నాలుగు ప్రధాన ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో క్లీనింగ్‌ ‌కాంట్రాక్ట్‌‌ ధరను ఏకపక్షంగా రూ.10 నుంచి రూ.49.50 పైసలకు పెంచి నామినేషన్‌‌ 
పద్ధతిలో అదే ఔట్‌సోర్సింగ్‌ ‌సర్వీస్‌ ‌ఏజెన్సీకి అప్పగించారు. అక్కడితో ఆగని సదరు 
ఐఏఎస్‌ అధికారి విదేశాలకు వెళ్లి, అక్కడి నుంచే...శుక్రవారం (23వ తేదీ) 
సాయంత్రం 4 గంటల లోపు పెండింగ్‌‌ 
బిల్లులన్నీ చెల్లించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవంటూ కిందిస్థాయి 
అధికారులకు రాతపూర్వక ఉత్తర్వులు పంపారు. ఇప్పుడీ ‘గురుభక్తి’ ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో చర్చనీయాంశంగా మారింది.


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని సుమారు కోటి మంది కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యానికి భరోసాగా నిలవాల్సిన ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు వివాదాలకు కేంద్రమవుతున్నాయి. గతంలో ఇదే ఈఎస్‌ఐ మందుల కొనుగోల్‌‌మాల్‌ ‌కేసులో అప్పటి డైరెక్టర్‌ ‌దేవికారాణి సహా పలువురు ఉద్యోగులు, ఫార్మాకంపెనీల ప్రతినిధులు జైలుపాలైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా మళ్లీ ఈఎస్‌ఐ క్లీనింగ్‌ ‌టెండర్ల వ్యవహారం బయటకు పొక్కింది. దీనికి ఓ తాజా ఐఏఎస్‌ అధికారి సూత్రధారిగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఔట్‌‌సోర్సింగ్‌ ఏజెన్సీ తరఫున క్లీనింగ్‌ బాధ్యతలు చేపడుతున్న ఆ సంస్థ యజమాని తనకు ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.10 చొప్పున చెల్లిస్తున్నారనీ, అది తనకు గిట్టుబాటు కావట్లేదంటూ సదరు ఐఏఎస్‌ అధికారికి కాంట్రాక్టర్‌ ‌మొరపెట్టుకున్నారు. దీనిపై ఆ అధికారి ‌కార్మిక శాఖ జాయింట్‌ ‌కమిషనర్‌కు లేఖ రాసారు. దాన్ని పరిశీలించిన కార్మికశాఖ జాయింట్‌ ‌కమిషనర్‌ ‌తన నేతృత్వంలోనే ఆరుగురు కార్మికశాఖ ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, పూర్తి నివేదికను ఆ ఐఏఎస్‌‌కు పంపారు. ఆ నివేదికలో తాము మార్కెట్‌ ‌ధరలను పరిశీలించామనీ, ఏజెన్సీకి ఇస్తున్న ధరను రూ.13.65 పైసలకు పెంచవచ్చని సిఫార్సు చేశారు.

దీనిపై జిల్లా ఉపాధి కల్పనాధికారి (డీఈఓ) ఈఎస్‌ఐ మెడికల్‌ ‌సూపరింటెండెంట్‌‌కు లేఖ రాస్తూ ఇప్పుడున్న రేటులో ఒక్క రూపాయి పెంచాలన్నా ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ముగ్గురు మెడికల్‌ ‌సూపరింటెండెంట్లతో మరోకమిటీ వేసి, నివేదిక కోరారు. దీనిపై అధ్యయనం చేసి వారు ధరను రూ.19.50 పైసలకు పెంచవచ్చని సూచించారు. అయితే ఈ సూచనలను తుంగలో తొక్కిన అప్పటి ఈఎస్‌ఐ మెడికల్‌ ‌సూపరింటెండెంట్‌ ఔట్‌‌సోర్సింగ్‌ ఏజెన్సీ ధరను రూ.10 నుంచి రూ.25కు పెంచాలని ప్రతిపాదించారు. ఇక్కడితో కథ ఆగిపోలేదు. ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలించిన సదరు ఐఏఎస్‌ అధికారి ఆ ఏజెన్సీ ధరను రూ.10 నుంచి ఏకంగా రూ.49.50 పైసలకు పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. (మెమో నెంబర్‌- ఇ.24/SHAKTI(OP-IMS&VIG)/A2/2026, Dated 15.10.2026) దీన్ని తక్షణం అమల్లోకి తేవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. పై నుంచి కింది వరకు అంతమంది అధికారులు చేసిన సిఫార్సులన్నీ కాదని, ఏకంగా ధర రూ.49.50 పైసలకు ఎందుకు పెంచారనే దానిపై ఈఎస్‌ఐ ఉద్యోగుల్లో చర్చ ప్రారంభమైంది. దీనిపై కూపీ లాగితే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తాను విద్యార్థిగా ఉన్నప్పుడు సదరు ఐఎఎస్‌ అధికారి అశోక్‌‌నగర్‌‌లోని ఓ అకాడమీలో ఐఎఎస్‌ ‌కోచింగ్‌ ‌తీసుకున్నారు. ఆ సంస్థ యాజమానురాలి భర్తకు ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు ఉన్నాయి. అప్పటికే ఆయన ఈఎస్‌ఐ ఆస్పత్రుల కాంట్రాక్ట్‌ ‌చేస్తున్నారు. తమ అకాడమీలో శిక్షణ పొందిన విదార్థే ఐఏఎస్‌‌ హోదాలో అదే విభాగాధిపతిగా రావడంతో అక్కడ ‘చక్రం’ తిరిగింది. ఈ ఏకపక్ష పెంపు ఎటుతిరిగి ఎటు వెళ్తుందో అని ఈఎస్‌ఐ ఆస్పత్రుల ఉన్నతాధికారులు బిల్లులు పెండింగ్‌‌లో పెట్టారు. అయితే విదేశాలకు వెళ్లిన సదరు ఐఏఎస్‌ అధికారి తాజాగా శుక్రవారం (23వతేదీ) ఇఎస్‌ఐ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు సాయంత్రం 4 గంటలలోపు పెండింగ్‌ ‌బిల్లులన్నీ చెల్లించాలనీ, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఇప్పుడు మరింత చర్చ జరుగుతున్నది. సహజంగా ఐఏఎస్‌‌లు విదేశీ పర్యటనలకు వెళ్తే, వారి బాధ్యతలను మరో అధికారికి అప్పగించి వెళ్తారు. ఇంచార్జి హోదాలో కిందిస్థాయి అధికారులు విధులు నిర్వహిస్తారు. అయితే పాలనాపరమైన నిర్ణయాలు తీసుకొనే అధికారం ఇంఛార్జులకు ఉండదు. అలాంటప్పుడు విదేశాల నుంచి సదరు ఐఏఎస్‌ ఉత్తర్వులు ఎలా ఇచ్చారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సదరు ఐఏఎస్‌ ‌నిర్ణయం వల్ల సదరు ఔట్‌‌సోర్సింగ్‌ ఏజెన్సీకి ఒకేసారి 260 శాతం అధిక బిల్లులు చెల్లించడం వల్ల అదనంగా రూ.30 కోట్లు చెల్లించాల్సి వస్తున్నదనే చర్చ జరుగుతున్నది. ఈఎస్‌ఐకి చెందిన నాచారం, రామచంద్రాపురం, వరంగల్‌, జీడిమెట్ల ఆస్పత్రుల ‌క్లీనింగ్‌ కాంట్రాక్ట్‌లు అన్నీ ఒకే ఏజెన్సీకి నామినేషన్‌ ‌పద్ధతిలో ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు ఆస్పత్రుల్లో అధికారిక లెక్కల ప్రకారం 6.17 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. నెలకు ఖర్చు గతంలో రూ. 61.71 లక్షలు కాగా, ఇప్పుడు రూ. 3.05 కోట్లకు చేరింది. నెలకు అదనంగా దాదాపు రూ. 2.44 కోట్లు భారం పడుతుంది. పాత రేటు ప్రకారం ఏడాదికి రూ. 7.40 కోట్లు కాగా, ప్రస్తుత పెంపుతో ఏటా రూ. 36.66 కోట్లు చెల్లించాలి. అంటే కేవలం నాలుగు ఆస్పత్రుల పరిధిలోనే ఏటా దాదాపు రూ. 29.25 కోట్ల కార్మికుల సొమ్మును ‘క్లీనింగ్‌’ పేరుతో కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ ఈఎస్‌ఐ ఉద్యోగుల్లో జరుగుతుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్