సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలి
రేపు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన : ప్రజా సంఘాల పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను రద్దు చేయాలనీ, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలనీ, ఆందోళనకారులపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మల దగ్దం, నిరసనలు తెలియజేయనున్నట్టు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యండి అబ్బాస్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఆశయ్య, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి మాట్లాడారు. అక్రమ సర్ ను రద్దు చేయాలనీ, ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు దాడి చేసి వేలాదిమందిపై అక్రమ కేసులు బనాయించారని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజా పోరాటాలకు మద్దతుగా శుక్రవారం దేశవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాలలో దిష్టిబొమ్మల దగ్దం, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.
‘‘సర్ ను తక్షణమే రద్దు చేయాలనీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను వెంటనే తొలగించి, ఆయనపై విచారణ జరపాలి. పారదర్శకత లేకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.41 కోట్ల మంది పౌరులందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలి. ఎంపిక ప్యానెల్లో క్యాబినెట్ మంత్రి స్థానంలో భారత ప్రధాన న్యాయమూర్తిని నియమించేలా ప్రధాన ఎన్నికల కమీషనర్, ఇతర ఎన్నికల కమీషనర్ల (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) చట్టం, 2023కు సవరణ చేయాలి. పదవీ విరమణ తర్వాత కూడా ప్రధాన ఎన్నికల కమీషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లకు (ఈసీలు) చట్టపరమైన రక్షణ కల్పించే సెక్షన్ 16ను రద్దు చేయాలి. ఈ సెక్షన్, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు లభించే రక్షణల కంటే కూడా విస్తృతమైనదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
యువ విద్యార్థినీలు, మహిళలతో సహా నిరసన కారులపై జరుగుతున్న క్రూరమైన దాడులు, హింసలను అరికట్టాలి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమంలో పాల్గొం టున్న విద్యార్థులు, యువత, ప్రగతిశీల వాదులను రక్షిం చడానికి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థి, యువజన, మహిళా, సామాజిక, గిరిజన, మైనారిటీ, వృత్తి, సంఘాలు, విద్యావంతులు, మేధావులు, భాగస్వాములు కావాలని కోరారు. బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల కింద రాష్ట్రాల్లో కార్యకర్తలను విచ్చలవిడిగా గృహ నిర్బంధం చేయడం చట్టవిరుద్ధమనీ, ఇది భారతదేశాన్ని ఒక పోలీసు రాజ్యంగా మారుస్తోంది. పౌరుల గోప్యతపై ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి మితిమీరిన జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని.....’’ ప్రజా సంఘాల నాయకులు ప్రజలకు సూచించారు. రాజధానిలో విస్తృతంగా జరుగు తున్న నేరాలను సుప్రీంకోర్టుతో సహా న్యాయవ్యవస్థ సుమో టోగా స్వీకరించనందుకు, శాంతిభద్రతలు కుప్ప కూలడానికి అనుమతించడాన్ని వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షిం చడానికి రైతులు, సాధారణ ప్రజలు క్రియాశీలకంగా భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, ఉపాధ్యక్షులు వి.ఎస్. రావు, కె. ఈశ్వర్రావు, రాష్ట్ర కార్యదర్శులు ఎం. పద్మశ్రీ, పాలడుగు సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.సునీత తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)