కొల్లి సత్యనారాయణకు భారీ మెజార్టీ ఇవ్వాలి
ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రజాసంఘాలు, మేధావులు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపు నిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్ పేరిట అట్టడుగు వర్గాల ఓట్లు తొలగింపే లక్ష్యంగా పని చేస్తోందని ఆయన విమర్శించారు. సర్కు వ్యతిరేకంగా జరుగుతున్న దేశవ్యాప్త ఉద్యమంలో గ్రామీణ ప్రాంత పేదలను భాగస్వాములను చేయాలని వ్యవసాయ కార్మిక సంఘానికి సూచించారు. అందుకోసం ప్రణాళిక రూపొందిం చాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి శిక్షణా తరగతుల్లో జాన్ వెస్లీ ప్రారంభోపన్యాసం చేశారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సామ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం , రిజర్వేషన్లు వంటి అంశాలను తొలగిస్తామంటూ బీజేపీ బాహాటంగా ప్రకటించడం ఆందోళనకర మన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలను డబ్బు, మద్యం, కులతత్వం, వ్యాపారం వంటి అంశాల్లో ముంచి తేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం తనకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను సర్ ద్వారా తొలగిస్తోందని తెలిపారు. ఈ విధంగా ఓట్లను కోల్పోతున్న వారిలో వలస కూలీలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన పేదలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. గవర్నర్ వ్యవస్థ, ఈడీ, సీబీఐ వంటి వాటిని ఉపయోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఆ పార్టీ బ్లాక్ మెయిల్ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులపై అది దాడి
చేస్తోందని దుయ్యబట్టారు. అందులో భాగంగానే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్తగా వీబీ జీ గ్రామ్జీని తీసుకొచ్చిందని విమర్శించారు. ఉపాధి చట్టానికి భారీగా నిధుల కోత విధించిందన్నారు.
కేంద్రం 60శాతం ఇస్తుంది, మిగతా 40 శాతం నిధులను రాష్ర్టాలే భరించాలంటూ నిబంధనలు విధించిందని గుర్తు చేశారు. తద్వారా రాజ్యాంగబద్ధంగా పని కల్పించే బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోందని విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మోడీ సర్కార్ పూర్తిగా నీరు గార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నెలకొన్న కరువు దృష్టిలో పెట్టుకుని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల సరుకులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. రోజుకూలి రూ. 800 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపాల్టీల్లో విలీనం చేసిన గ్రామాలతోపాటు పట్టణాల్లోని పేదలకు ఉపాధి కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీని అమలు చేయాలన్నారు. భూమి లేని వ్యవసాయ కార్మికులకు రూ. 12 వేలివ్వాలని, కౌలు రైతులకు రూ. 15వేలు, మహిళలకు రూ. 2500, ఇంటి స్థలం లేని వారికి 250 గజాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. పింఛన్లు రూ. 4వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వీటిని ప్రభుత్వాలు నెరవేర్చకపోతే పోరాటాలకు సిద్ధం కావాలని జాన్వెస్లీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకటరాములు, ఉపాధ్యక్షులు బి. ప్రసాద్. బి పద్మ తదితరులు పాల్గొన్నారు


![We are not against restoration; we are against the plunder being carried out in the name of the Musi [project].](https://nvtg-prd.sgp1.digitaloceanspaces.com/Brs-1793216322963-0e75c4bf-e4c1-4722-876f-c497295fdc0d-360x240.webp)




కామెంట్లు (0)