Magazines

నేటి నుంచి అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు

56 నిమిషాల క్రితం

International Maize Conference begins today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 2 నిమిషాల చదవడం

500 మందికిపైగా ప్రతినిధుల హాజరు : 
ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎం.ఎల్‌.జాట్‌

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు శంషాబాద్‌‌లోని జేడీ కన్వెన్షన్‌‌ సెంటర్లో సోమ, మంగళ, బుధవారాల్లో జరుగనున్నదని కేంద్ర వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం కార్యదర్శి, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎం.ఎల్‌. జాట్‌ ప్రకటించారు. ‘మారుతున్న ప్రపంచంలో ఆహారం, పశుగ్రాసం, మేత, ఇంధనం, సుస్థిరతకు మొక్కజొన్న విప్లవం’ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు 500 మంది హాజరవుతారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌–నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌)లో కర్టనైజర్‌ ‌కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సదస్సు లక్ష్యాలు, ప్రాధాన్యతలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార, పోషకాహార భద్రతతోపాటు పశువుల దాణా, మేత, పారిశ్రామిక అవసరాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో మొక్కజొన్న కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాల అభివృద్ధి, ఆధునిక పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, కృత్రిమ మేధ (ఏఐ), యాంత్రీకరణ, స్మార్ట్‌ వ్యవసాయ విధానాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. మొక్కజొన్న సాంకేతిక నిపుణుల సంఘం (ఎంటీఏఐ), ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ), ఐసీఏఆర్‌, ట్రస్ట్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ (టీఏఏఎస్‌), అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమ అభివృద్ధి కేంద్రం (సిమిట్‌), ఐసీఏఆర్‌–భారత మొక్కజొన్న పరిశోధనా సంస్థ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తు న్నాయని తెలిపారు. సదస్సులో ప్లీనరీ ఉపన్యాసాలు, సాంకేతిక సమావేశాలు, చర్చాగోష్ఠులు, పోస్టర్‌ ప్రదర్శనలు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారని చెప్పారు. ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత డాక్టర్‌ ఎస్‌.కె. వాసల్‌ హాజరవుతారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్‌–భారత మొక్కజొన్న పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ నచికేత్‌ కోట్వాలివాలే, సదస్సు నిర్వహణ కమిటీ అధ్యక్షులు, ఐసీఏఆర్‌–సెంట్రల్‌ అరిడ్‌ జోన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హెచ్‌.ఎస్‌. జాట్‌, పీజేటీఏయూ పరిశోధన విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ బలరాం మరాఠీ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్