ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం
కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపించాం
అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షం .. విపక్షాల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం : అఖిలపక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
సీపీఐ(ఎం) తరపున హాజరైన రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి
పాల్గొన్న బీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం, బీజేపీ, ఇతర పార్టీల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్‌నినో నేపథ్యంలో రాష్ర్టంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులను కలిసికట్టుగా ఎదుర్కొందామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అఖిల పక్ష నేతలకు విజ్క్షప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడ్డ కరువు నివారణకు రాష్ర్ట ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలను తీసుకుంటోందని తెలిపారు. కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించామనీ, అవసరమైతే అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రానికి రావాల్సిన సహాయంపై విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కునే సమయంలో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
నేతలు ప్రస్తావించిన అంశాలను నమోదు చేసుకున్నామనీ, సాధ్యమైన మేరకు వాటిని ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంపై గతంలోనూ శాసనసభలో చర్చించామనీ, వివిధ సమావేశాలు, సదస్సులు నిర్వహించడంతోపాటు శాస్త్రవేత్తలు, నిపుణులతో సంప్రదింపులు జరిపామని వివరించారు. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైన సన్నద్ధతతో ఉన్నామని పేర్కొన్నారు.
వర్షపాతం లోటు దేశ వ్యాప్తంగా ఉండటం, ఎగువ రాష్ర్టాల్లో కూడా వర్షాలు కురియక పోవడంతో ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడం ఆందోళన కలిగించే అంశమన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. వర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు శాఖలవారీగా సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తామనీ, పశువులకు తాగునీరు, మేత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, పశువులకు అవసరమైన నీటి వసతులు కల్పించేందుకు అవసరమైన బడ్జెట్, ఇతర ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. గతంలో కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కున్న సమయంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేశాయని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత పరిస్థితుల్లోనూ రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనలో రాజకీయాలకు తావులేకుండా అందరూ బాధ్య తాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నోడల్ అధికారి రామకృష్ణారావు హాజరయ్యారు.
అఖిల పక్షం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎల్. రమణ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీపీఐ(ఎం) తరపున రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ప్రొఫెసర్ సింహాద్రి, వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నాయకురాలు శోభా యాదవ్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్ కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హేమ సుదర్శన్, తెలుగుదేశం తరఫున కాట్రగడ్డ ప్రసన్నకుమార్ తదితరులు హజరై కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.


![We are not against restoration; we are against the plunder being carried out in the name of the Musi [project].](https://nvtg-prd.sgp1.digitaloceanspaces.com/Brs-1793216322963-0e75c4bf-e4c1-4722-876f-c497295fdc0d-360x240.webp)




కామెంట్లు (0)