Magazines

మురసు తుపాను ప్రయాణికులకు 
దక్షిణ మధ్య రైల్వే సహాయం

32 నిమిషాల క్రితం

South Central Railway
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 2 నిమిషాల చదవడం

కాజీపేటలో1,226 మందికి ప్రత్యేక ఏర్పాట్లు 

నిరంతర పర్యవేక్షణ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపిన మురసు తుఫాను కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా వివిధ రైలు సర్వీసులను రద్దు చేయడం, దారి మళ్లించడం సమయవేళల్లో మార్పులు చేయడం వంటి చర్యలను దక్షిణ మధ్య రైల్వే తీసుకుంది. ఈ పరిస్థితికి తక్షణమే స్పందిస్తూ రైలు దారి మళ్లింపులు, ఎక్కువసేపు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడానికి, సకాలంలో సహాయం అందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైలు నంబర్లు 16602 జోగ్‌బనీ – ఈరోడ్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, 22645 ఇండోర్ – కొచువేలి అహిల్యానగరి ఎక్స్‌ప్రెస్, 12612 హజ్రత్ నిజాముద్దీన్ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, 20626 భగత్ కీ కోఠి – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌లను వాటి నిర్ణీత మార్గమైన విజయవాడ మీదుగా కాకుండా కాజీపేట మీదుగా మళ్లించారు.

ఆయా రైళ్లలో ప్రయాణిస్తున్న 1,226 మంది ప్రయాణికులు కాజీపేటలో దిగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ అధికారులు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా 278 మంది ప్రయాణికులను ప్రత్యామ్నాయ రైలు అయిన రైలు నంబర్ 17202 సికింద్రాబాద్ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో సర్దుబాటు చేశారు. మిగిలిన 948 మంది ప్రయాణికుల కోసం కాజీపేట నుంచి విజయవాడ వరకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఆలస్యంగా నడుస్తున్న ,దారి మళ్లించిన రైళ్లు ఎక్కువ సమయం నిలిచిపోయిన సందర్భాల్లో ప్రయాణికులకు ఆహార, పానీయాలు అందుబాటులో ఉండేలా వివిధ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక క్యాటరింగ్ ఏర్పాట్లు చేశారు. వరంగల్, రామగుండం , జమ్మికుంట స్టేషన్లలో రైళ్లకు క్యాటరింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. దారి మళ్లించిన రైలు నెం. 06073 (తిరువనంతపురం–హజ్రత్ నిజాముద్దీన్) కోసం కర్నూలు సిటీ స్టేషన్‌లో ప్రత్యేకంగా అదనపు హాల్టింగ్ సదుపాయం కల్పించడంతో పాటు, ప్రయాణికులకు ఆహారం అందించారు. టికెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణికుల సందేహాలకు సమాధానమిస్తూ, అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ, వారి తదుపరి ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తూ చురుగ్గా స్పందించారు. అంతేకాకుండా డివిజనల్ అధికారులు సైతం డివిజనల్ కంట్రోల్ ఆఫీస్ నుంచి రైలు కార్యకలాపాలను , ప్రయాణీకులకు సంబంధించిన ఏర్పాట్లను ఇరవై నాలుగు గంటల పాటు నిశితంగా పర్యవేక్షించారు. తద్వారా సత్వర నిర్ణయాలు తీసుకోవడం, నిరంతర సమన్వయం, ప్రయాణీకులకు సకాలంలో సహాయం అందేలా చూశారు.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్పందించారు. ఈ పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు సకాలంలో సహాయం అందించిన అధికారులు, సిబ్బంది కృషిని అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్