Magazines

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు

44 నిమిషాల క్రితం

MLC elections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 2 నిమిషాల చదవడం

కరువు సహాయక చర్యల్లో కేంద్ర సర్కారు నిర్లక్ష్యం

మోడీ సర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

వరికి రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేలివ్వాలి

ఈ నెల 10న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌, మహబూబాబ్‌‌నగర్‌-‌రంగారెడ్డి-హైదరాబాద్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులున్నా కరువు సహాయ చర్యలు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. నిధుల విడుదల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కరువు ప్రాంతాల్లో సీపీఐ నాయకులు తప్ప మరెవ్వరూ సందర్శించలేదని తెలిపారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఇప్పటికే 12.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయనీ, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రైతులు అసలు పంటలే వేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలను ఆదుకునే సమగ్ర సహాయక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

పంట నష్టపోయిన రైతులకు వరికి ఎకరాకు రూ.30 వేలు, పత్తి సహా ఇతర వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని రూ.25 వేల కోట్ల కరువు సహాయక నిధులను కోరినా స్పందించకపోవడం దారుణమన్నారు. పంటలు సాగు చేయని రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని కోరారు. కరువు ప్రభావంతో ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు ఐదు నుంచి ఆరు నెలల పాటు నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక భృతి అందించాలనీ, పశుగ్రాసం, ఆహార ధాన్యాలు, 14 రకాల నిత్యావసర సరుకులను చౌక దుకాణాల ద్వారా తక్షణమే పంపిణీ చేయాలని విన్నవించారు. పంటల బీమా పథకం లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.

కరువు, రైతాంగ సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలు, కరువు నివారణ చర్యలు, కేంద్రం నుంచి అందించే ఆర్థిక సహాయంపై ఆయన ఒక్క ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. బీజేపీ పాదయాత్ర రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన కార్యక్రమం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలగించిన ఓట్లకు సంబంధించిన పూర్తి జాబితాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

విధి నిర్వహణలో ప్రమాదానికి గురై ఆర్టీసీ మహిళా ఉద్యోగి ‌చనిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత మహిళకు సరైన వైద్యం అందించకపోవడం, మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆస్పత్రికి తరలించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆర్టీసీ అధికారులు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారుల బాధ్యతను నిర్ధారించి చర్యలు తీసుకోవాలని కోరారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్‌ ‌చేశారు. ఇందిరమ్మ ఇండ్లను పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు అందజేయాలని కోరారు. తెలంగాణలోని అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎంను కోరామన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో అనేక రాజకీయ, సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారు విద్యార్థి సంఘాల నుంచే ఎదిగారని గుర్తుచేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ.నరసింహా, కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్‌.బోస్‌, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్