నవతెలంగాణ - హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి 8 నుంచి 9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరింది.
కూనవరం వద్ద 14.8 మీటర్లు, పోలవరం వద్ద 9.98 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ధవళేశ్వరం సర్ అర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. వరద గరిష్ఠ స్థాయికి చేరిన అనంతరం క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. వరద ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.






కామెంట్‌లు (0)