Magazines

జిబూటీలో పడవ ప్రమాదం

2 గంటల క్రితం

Boat accident in Djibouti
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 2 నిమిషాల చదవడం

139 మంది మృతి..మరో 116 మంది గల్లంతు

జిబూటీ సిటీ : తూర్పు ఆఫ్రికా దేశమైన జిబూటీ తీరంలో దారుణం జరిగింది. పడవ బోల్తా పడి 139 మంది మృతి చెందారు. మరో 116 మంది గల్లంతయ్యారు. ఐరాసకు చెందిన ఇంటర్నెషనల్‌ ఆర్గనైజేషన్‌ ‌ఫర్‌ ‌మైగ్రేషన్‌ (ఐఒఎం) ఈ వివరాలను ఆదివారం వెల్లడించింది. ఈ నెల 8 రాత్రి జిబూటీ నుంచి సుమారు 350 మంది ప్రయాణీకులతో యెమెన్‌కు బయలు దేరిన నౌక ఒబాక్ పట్టణానికి ఉత్తరాన ఉన్న గుహెరా సమీపంలో బోల్తా పడిందని ఐఒఎం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సహాయక కార్యక్రమాల్లో జీబూటియన్ అధికారులతో పాటు ఐఓఎం బృందాలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ వెలికితీసిన 109 మృతదేహాలలో 52 మంది పురుషులు, 42 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారుల్లో తొమ్మిది మంది బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఐఒఎం ప్రకటన తెలిపింది. మరో 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, బాధితులంతా ఇథియోపియా జాతీయులే. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలను నిర్వహిస్తున్నారు.

లభ్యమైన మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, ప్రాణాలతో బయటపడిన వారికి వలసదారుల ప్రతిస్పందన కేంద్రంలో తగిన ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నారు. వీరికి తాత్కాలిక ఆశ్రయం కల్పించడంతో పాటు, వారి కుటుంబాలను తిరిగి కలుసుకోవడానికి సహాయం చేస్తున్నట్లు ఐఒఎం తెలిపింది. కాగా, ఈ విషాద ప్రమాదాన్ని ‘ఆర్థిక అవకాశాల కోసం ఈ వలస మార్గంలో ప్రయాణించే వలసదారులు ఎదుర్కొనే కష్టాలకు ఒక స్పష్టమైన గుర్తు’ గా జిబూటిలోని ఐఓఎం చీఫ్ ఆఫ్ మిషన్ అలెగ్జాండర్ కోయిసాక్ అభివర్ణించారు. తూర్పు ఆఫ్రికాకు చెందిన ప్రజలు గల్ఫ్‌ ‌దేశాలకు వలస వెళ్లడానికి ఈ మార్గాన్నే ఆశ్రయిస్తుంటారు. హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా (ఆఫ్రికా కొమ్ము)గా పేర్కొనే ప్రాంతంలో ఉన్న జిబూటీ గుండా ప్రయాణించి, బాబ్‌ ఎల్‌ ‌మండేబ్‌ ‌జలసంధి దాటి యెమెన్‌‌లోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి అంతింగా భద్రత, స్థిరత్వం కోసం గల్ఫ్‌ ‌దేశాలకు చేరుకుంటారు. ఏడాదికి కనీసం పదివేల మంది ఈ మార్గం గుండా ప్రయాణిస్తారని ఒక అంచనా. ఒఓఎం డిస్‌‌ప్లేస్‌‌మెంట్‌ ‌ట్రాకింగ్‌ ‌మ్యాట్రిక్స్‌ ‌ప్రకారం గత నెల సెప్టెంబర్‌ ‌10 నుంచి ఇప్పటి వరకూ కేవలం ఇథియోపియా నుంచి జిబూటీకి 20 వేల మంది వలసదారులు చేరుకున్నారు. వీరిలో కొంత మంది ఈ జలసంధి కూడా ప్రయాణం చేశారు. గతేడాది బాబ్‌ ఎల్‌ ‌మండేబ్‌ ‌జలసంధి మార్గంలో జరిగిన ప్రమాదాల్లో 900 మందికి పైగా మరణించడం లేదా గల్లంతవ్వడం జరిగింది. గల్ప్‌ ‌దేశాల్లోనూ అస్థిరత, యుద్ద పరిస్థితులు పెరుగుతున్నప్పటికీ... పేదరికం, అభద్రత, వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న ప్రభావాలు నుంచి తప్పించుకోవడానికి ఆఫ్రికా దేశాలకు చెందిన అనేక మందిని ఈ వలసకు పురిగొల్పుతున్నాయని ఐఒఎం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్