ఓటర్లను వేడుకుంటున్న ట్రంప్.. జనం లేక వెలవెలబోతున్న ప్రచార సభలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్యంతర ఎన్నికల ప్రచారాన్ని దాదాపుగా ముగించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయన పర్యటనలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఏ ర్యాలీలో ప్రసంగించినా ఆయనది ఒకే మాట...బ్యాలెట్లో ఉన్న అభ్యర్థి ఎవరనేది చూడకండి...నన్నే అభ్యర్థిగా భావించి ఓటేయండి...ఇదీ ఆయన సందేశం. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను ఆయన ప్రస్తావించలేదు. పెరుగుతున్న జీవనవ్యయం, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలకు ఆయన ప్రసంగాల్లో చోటే లేదు. దేశంలో తన రేటింగ్ దారుణంగా పడిపోతోందన్న విషయం తెలిసి కూడా ఆయన తననే అభ్యర్థిగా భావించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. రిపబ్లికన్లకు ఎదురే లేదని అనుకున్న రాష్ట్రాలను సైతం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో చుట్టివస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. అక్టోబరులో ఆయన 20 ర్యాలీలలో ప్రసంగించడాన్ని గమనిస్తే రిపబ్లికన్ల గెలుపు కోసం ఆయన ఎంతగా చెమటోడుస్తున్నారో అర్థమవుతోంది. అయితే ట్రంప్ ప్రచార సభలన్నీ దాదాపుగా జనం లేక వెలవెలపోతున్నాయి.
మోసగాడివి...దేశద్రోహివి
గతంలో ట్రంప్ వస్తున్నారంటే చాలు...ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యే వారు. ఇప్పుడు ఆ కోలాహలమే కన్పించడం లేదు. కాన్సాస్, టెక్సాస్, నార్త్ కరోలినా, అయోవా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, మిసిసిపీ, టెక్సాస్, ఒహాయో రాష్ట్రాల్లో ట్రంప్ సుడిగాలి పర్యటనలు జరిపారు. ఒకప్పుడు కాన్సాస్ రాష్ట్రం రిపబ్లికన్లకు కంచుకోట. 2024 అధ్యక్ష ఎన్నికల్లో అక్కడ ట్రంప్‌కు 16 పాయింట్ల ఆధిక్యత లభించింది. 1932 నుంచి ఆ రాష్ట్రం సెనెట్‌కు ఒక్క డెమొక్రాట్‌ను కూడా ఎన్నుకోలేదు. అయితే ఇప్పుడు అక్కడ ఓటర్ల అభిప్రాయంలో మార్పు కన్పిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై వారు భయాందోళనలు వ్యక్తం చేశారు. క్లెమ్సన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ట్రంప్ ఎన్నికల ప్రచార సభ జరిగింది. ట్రంప్ వేదిక పైకి వచ్చిన కొద్ది సేపటికే హేళన ధ్వనులు విన్పించాయి. 'నువ్వు మోసగాడివి', 'నిన్ను తిడుతున్నాను' అంటూ కొందరు అరిచారు. 'నువ్వు దేశద్రోహివి' అని మరి కొందరు నిందించారు. అయితే ఈ నిరసనలను ట్రంప్ ఏ మాత్రం పట్టించుకోలేదు.
వెలవెల పోయిన సభలు
గతంలో వేలాది మందితో భారీ స్టేడియంలలో సభలు నిర్వహించిన ట్రంప్ ఈసారి చాలా చిన్న చిన్న వేదికలను ఎంచుకున్నారు. ఒహియోలోని చిల్లికోథి ర్యాలీలో కేవలం వెయ్యి మంది మాత్రమే పట్టే అరేనాను, వాండలియాలో నాలుగు వేల మంది పట్టే హైస్కూలు జిమ్మాసియంను ఎంచుకోవడాన్ని చూస్తుంటే ఆయన సభలకు డిమాండ్ తగ్గిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒహియోలోని యంగ్స్టౌన్ ర్యాలీతో పాటు టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో సభలో సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. జనం రాకపోవడంతో కాన్సాస్, అయోవా రాష్ట్రాల్లో జరగాల్సిన కొన్ని ర్యాలీలను ట్రంప్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కొందరు పాత్రికేయులు ఆయన వద్ద ప్రస్తావించగా వారిని బాడీ షేమింగ్ చేశారు.
నిరసన ధ్వనులు
మధ్యంతర ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్ పెద్ద ఎత్తున నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇరాన్ యుద్ధం, పెరిగిన గ్యాస్ ధరలను గురించి మాట్లాడడానికి ట్రంప్ పెద్దగా సమయాన్ని కేటాయించలేదు. మధ్యంతర ఎన్నికలను ఆయన విధేయతకు పరీక్షగా అభివర్ణించారు. ప్రజలు పెట్రోల్ ధరల భారాన్ని మోస్తుంటే ఆయన మాత్రం చమురు ద్వారా వందల, వేల కోట్ల డాలర్లను సంపాదిస్తున్నామని చెప్పారు. ప్రచార సభల్లో ట్రంప్ ఎక్కువగా తన పునరుద్ధరణ ప్రాజెక్టులను ఏకరువు పెట్టారు. వైట్‌హౌస్‌కు వేల మైళ్ల దూరంలో ఉన్న, తాము ఎన్నడూ చూడని ఆ ప్రాజెక్టులను గురించి చెప్పి ఏం ప్రయోజనమని కొందరు పెదవి విరిచారు. సలహాదారులు వద్దని చెబుతున్నప్పటికీ ఆయన వాటి ప్రస్తావన తీసుకురావడం మరచిపోలేదు.







కామెంట్లు (0)