Magazines

వైభవ్‌ వస్తున్నాడు!

2 గంటల క్రితం

Vaibhav
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 3 నిమిషాల చదవడం

భారత్‌, న్యూజిలాండ్‌ మరో పరుగుల పండుగకు సిద్ధమయ్యాయి. క్రైస్ట్‌చర్చ్‌లో తొలి టీ20లో భారీ స్కోర్లు నమోదు కాగా, నేడు అదే పిచ్‌పై రెండో టీ20కి రంగం సిద్ధమైంది. భారత టాప్ ఆర్డర్‌లో ఇషాన్‌ కిషన్‌కు గాయం కాగా.. నేడు అతడి స్థానంలో యువ కెరటం, చిచ్చరపిడుగు వైభవ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు. టీమ్‌ ఇండియా సిరీస్‌లో ఆధిక్యంపై కన్నేసి బరిలోకి దిగతుండగా.. నేడు క్రైస్ట్‌చర్చ్‌లో ఫోకస్‌ మొత్తం వైభవ్‌ సూర్యవంశీపైనే నెలకొంది. భారత్‌, న్యూజిలాండ్‌ రెండో టీ20 నేడు


గాయపడిన ఇషాన్‌ స్థానంలో సూర్యవంశీ

ఆధిక్యంపై కన్నేసిన టీమ్‌ ఇండియా

కివీస్‌తో భారత్‌ రెండో టీ20 నేడు

మధ్యాహ్నం 12.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో...


క్రైస్ట్‌చర్చ్‌ (న్యూజిలాండ్‌)

భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌ ఊహించినట్టుగానే బ్యాంగ్‌బ్యాంగ్‌తో మొదలైంది. ఇరు జట్ల బ్యాటింగ్‌ లైనప్‌లు చెలరేగాయి. మెరుగైన పవర్‌హిట్టర్లతో కూడిన టీమ్‌ ఇండియా అంతిమంగా పైచేయి సాధించింది. టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఒకే వేదికపై షెడ్యూల్‌ చేయగా.. క్రైస్ట్‌చర్చ్‌లో వరుసగా రెండో విజయంపై భారత్‌ కన్నేసింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓడినా.. ఆతిథ్య జట్టు ఆఖరు వరకు రేసులో నిలిచింది. దీంతో నేడు రెండో టీ20 సైతం రసవత్తరంగా సాగనుంది.

సూర్యవంశీకి చోటు

తొలి మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్‌ కిషన్‌ నేడు రెండో టీ20కి దూరమయ్యాడు. అతడి స్థానంలో సిరీస్‌కు కుమార్‌ కుశాగ్ర జట్టులోకి వచ్చినా.. నేడు టాప్‌ ఆర్డర్‌లో అతడి బెర్త్‌ను యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ దక్కించుకోనున్నాడు. అభిషేక్‌ శర్మతో కలిసి వైభవ్‌ సూర్యవంశీ ఓపెనర్‌గా రానుండగా.. సంజు శాంసన్‌ నం.3 స్థానంలో బ్యాట్‌ పట్టనున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లకు వైభవ్‌ పెట్టింది పేరు. న్యూజిలాండ్‌ చిన్న బౌండరీల స్టేడియంలో సూర్యవంశీ విన్యాసాల కోసం అభిమానులతో పాటు అటు కివీస్‌, ఇటు భారత డ్రెస్సింగ్‌రూమ్‌లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటివరకు 8 టీ20ల్లో వైభవ్‌ సూర్యవంశీ స్ర్టయిక్‌రేట్‌ 186.36 కాగా, సగటు 30.75. దీంతో బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై సూర్యవంశీ ఏం చేస్తాడో అనే అంచనాల అందరిలోనూ ఉన్నాయి. భారత టాప్‌ ఆర్డర్‌ టాప్‌ గేర్‌లో దూసుకెళ్తుండగా.. మిడిల్‌ ఆర్డర్‌ ఇంకా కుదురుకోవాల్సి ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మ రాణిస్తున్నా.. భారీ లక్ష్యాల ఛేదనలో నిలకడ చూపించాలి. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ నమన్‌ ధీర్‌ వరుసగా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో నమన్‌ ధీర్‌ బ్యాటింగ్‌ నైపుణ్యం భారత్‌కు గొప్ప ఊరట. భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ మయాంక్‌ యాదవ్‌ త్రయం పేస్‌ బాధ్యతలు చూసుకోనుండగా.. అక్షర్‌ పటేల్‌, నమన్‌ ధిర్‌లు స్పిన్‌ బాధ్యతలు చూసుకోనున్నారు.

దీటుగా కివీస్‌

తొలి టీ20లో ఓడినా, న్యూజిలాండ్‌ గొప్పగానే రాణించింది. పవర్‌ప్లేలోనే సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ మ్యాచ్‌ను ఏకపక్షం చేసినా... మ్యాచ్‌ను ఆఖరు ఓవర్‌కు తీసుకొచ్చింది. బలమైన భారత బ్యాటింగ్‌ లైనప్‌, మంచు ప్రభావం ప్రతికూలతలను కివీస్‌ బౌలర్లు అధిగమించే ప్రయత్నం చేశారు. అయితే, ఆ జట్టులో ఫిన్ అలెన్‌ మినహా మిగతా క్రికెటర్లు విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలం అవుతున్నారు. భారత్‌పై వన్డేల్లో నిలకడగా రాణించే డార్లీ మిచెల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానంలో రావటం ఆ జట్టుకు ప్రతికూలమే. ఈ స్థానంలో డార్లీ మిచెల్‌ అటు ధనాధన్‌ వేగంతో ఆడటంలో విఫలమవటంతో పాటు యాంకర్‌ పాత్ర పోషించటంలో తేలిపోతున్నాడు. నిలకడగా బౌండరీలు బాదటంలో మిచెల్‌ వెనుకంజ వేస్తున్నాడు. గ్లెన్ ఫిలిప్స్‌, ఫిన్‌ అలెన్‌లు మెరిస్తే న్యూజిలాండ్‌ మరోసారి భారీ స్కోరు చేయగలదు. టిమ్‌ సీఫర్ట్‌, బెవాన్‌ జాకబ్స్‌, మైకల్‌ బ్రాస్‌వెల్‌లు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. మిచెల్‌ శాంట్నర్‌, నాథన్‌ స్మిత్‌, మాట్‌ హెన్రీ, ఆడం మిల్నె, లాకీ ఫెర్గుసన్‌లతో కూడిన బౌలింగ్‌ లైనప్‌ ఉత్సాహంగా కనిపిస్తోంది. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఇక్కడే సిరీస్‌ సమం చేయటం కివీస్‌కు పెద్ద విషయం కాదు!.

కిషన్‌కు గాయం, కుశాగ్రకు పిలుపు

వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ ఇషాన్ కిషన్‌ గాయం బారిన పడ్డాడు. తొలి టీ20లో కిషన్‌ లో గ్రేడ్‌ రైట్‌ అబ్డక్టర్‌ గాయానికి గురి కాగా.. అతడి స్థానంలో మరో వికెట్‌కీపర్‌ కుమార్‌ కుశాగ్రకు సెలక్షన్‌ కమిటీ జట్టులోకి తీసుకుంది. ఇషాన్‌ కిషన్‌కు గాయం కాగా.. రెండో టీ20లో సంజు శాంసన్‌ ఒక్కడే వికెట్‌ కీపర్‌ కానున్నాడు. బ్యాటర్‌తో ఇషాన్ స్థానం సూర్యవంశీ తీసుకున్నా, బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా కుమార్‌ కుశాగ్ర కొనసాగనున్నాడు. భారత్‌-ఏ తరఫున న్యూజిలాండ్‌ పర్యటనకు వచ్చిన కుమార్‌ కుశాగ్ర రెండో టీ20కి జట్టుతో ఉండనున్నాడు. ఇషాన్ కిషన్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించనున్న బీసీసీఐ వైద్య బృందం తదుపర నిర్ణయం జట్టు మేనేజ్‌మెంట్‌కు నివేదించనుంది.

పిచ్‌, వాతావరణం

క్రైస్ట్‌చర్చ్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ పగలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ఆరంభం అవుతుంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌ ఆలస్యంగా ముగుస్తుండగా, మంచు ఎక్కువగా కురుస్తోంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోనుంది. తొలి టీ20 మ్యాచ్‌ ఆడిన పిచ్‌పైనే నేటి మ్యాచ్‌ జరుగనుంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌ : అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్), తిలక్‌ వర్మ, నమన్‌ ధీర్‌, నితీశ్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మయాంక్‌ యాదవ్‌.

న్యూజిలాండ్‌ : ఫిన్‌ అలెన్‌, టిమ్‌ సీఫర్ట్‌ (వికెట్‌ కీపర్‌), డార్లీ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్‌, బెవాన్‌ జాకబ్స్‌, మైకల్‌ బ్రాస్‌వెల్‌, మిచెల్‌ శాంట్నర్ (కెప్టెన్‌), నాథన్‌ స్మిత్‌, మాట్‌ హెన్రీ, ఆడం మిల్నె, లాకీ ఫెర్గుసన్‌.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్