క్లోరోఫామ్ గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి
ఆరుగురికి అస్వస్థత..ఒకరు డిశ్చార్జ్
ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జీఎంఆర్
మృతుల కుటుంబాలకు రూ.70 లక్షల నష్టపరిహారం
నవతెలంగాణ-జిన్నారం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో ని సరాక పరిశ్రమ బ్లాక్లో క్లోరోఫామ్ గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా ఒకరి ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో డిశ్చార్జ్ చేశారు. ప్రమాద ఘటన తెలుసుకున్న మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీర య్యారు. ఘటనా స్థలాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 70 లక్షల చొప్పున పరిహారం అందేలా పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డపోతారం పారిశ్రామిక
వాడలోని సరాక ల్యాబరెటరీ పరిశ్రమలో గురువారం అర్ధరాత్రి గ్యాస్ లీకైంది. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు సుదర్శన్ రావు, బాలాజీ తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరాడక మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురు కార్మికులు గోక రాంప్రసాద్ (ఆపరేటర్), అసిరెడ్డి కృష్ణారెడ్డి (సూపర్వైజర్), నిమ్న గణేష్ (సూపర్వైజర్), రవి తున్ (హెల్పర్), వెన్న అన్వేష్ రెడ్డి (సేఫ్టీ జూనియర్ (ట్రైనింగ్), పోచ్చిరెడ్డి యుగంధర్ రెడ్డి (హెల్పర్) అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సూరారంలో ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరిని డిశ్చార్చ్ చేశారు. మృతదేహాలను పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు జిన్నారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కంపెనీ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. సరాక పరిశ్రమ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకొని తమ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ, ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ నెహ్రూ, గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ తాన్య, స్థానిక నాయకులు సందర్శించారు.
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే జీఎంఆర్ పరామర్శ
సరాక పరిశ్రమలో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి రూ.70 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇచ్చేందుకు ఒప్పించారు. అలాగే మృతుల అంత్యక్రియలకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున అందజేయాలని సూచించారు.







కామెంట్లు (0)