ఆదిలాబాద్ మార్కెట్‌లో అత్యధిక ధర
రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు : మార్కెట్ కమిటీ చైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
తెలంగాణలోనే ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అత్యధిక పత్తి ధర అందుతోంది. వివిధ మార్కెట్‌లలో నమోదైన పత్తి ధరల వివరాలను శుక్రవారం మార్కెట్ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై పెట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా నాణ్యమైన పత్తిని నేరుగా మార్కెట్‌కు తీసుకొచ్చి, మెరుగైన ధరలు పొందాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రెండోరోజు పత్తి కొనుగోళ్లలో కూడా రాష్ట్రంలోని ఇతర ప్రధాన మార్కెట్లతో పోలిస్తే అత్యధిక ధర నమోదవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ మార్కెట్‌లో ప్రయివేట్ వ్యాపారులు క్వింటా పత్తికి గరిష్టంగా రూ.9,260 ధర చెల్లించగా, సీసీఐ కొనుగోలు ధర రూ.8,667గా ఉందని తెలిపారు. ఇతర మార్కెట్లలో వరంగల్‌లో ప్రయివేట్ రూ.9,010, జమ్మికుంటలో ప్రయివేట్ రూ.9,170, ఖమ్మంలో ప్రయివేట్ రూ.9,100 చొప్పున ధరలు నమోదయ్యాయని వివరించారు. రైతులు తమ పత్తిని నాణ్యమైన స్థితిలో మార్కెట్‌కు తీసుకొచ్చి, అందుబాటులో ఉన్న ధరలను పరిశీలించి విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోళ్లను జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ విఠల్, మార్కెట్ కమిటీ సూపర్‌వైజర్ స్వామితో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పరిశీలించారు.







కామెంట్‌లు (0)