Magazines

అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటల గడువు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2 గంటల క్రితం

Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అరెస్టులు, నిర్బంధాలు, న్యాయస్థానం ముందు హాజరుపర్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని తేల్చిచెప్పింది. అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచి కాకుండా, అదుపులోకి తీసుకున్న సమయం నుంచే ఈ గడువును లెక్కించాలని స్పష్టం చేసింది.

అధికారిక అరెస్టుకు ముందు అదుపులో ఉంచిన సమయాన్ని మినహాయించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అదుపులోకి తీసుకోవడానికి, అరెస్టు చేయడానికి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ న్యాయపరమైన విచారణను ఆలస్యం చేయడం కుదరదని తెలిపింది. కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు నిందితుడిని అదుపులోకి తీసుకున్న తేదీ, సమయాన్ని మేజిస్ట్రేట్లు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది.

24 గంటల గడువు విషయంలో ఒడిశా, మద్రాస్‌, కేరళ హైకోర్టులు గతంలో వెలువరించిన అభిప్రాయాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అరెస్టు జరిగిన ప్రదేశం నుంచి కోర్టుకు ప్రయాణించే సమయాన్ని మాత్రమే మినహాయించాలని స్పష్టం చేసింది. సుజిత్‌ దాస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

కేసు నేపథ్యం ఇదీ..

త్రిపురలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నిందితుడు సుజిత్‌ దాస్‌ను గతేడాది సెప్టెంబర్‌ 29న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సెప్టెంబర్‌ 30 ఉదయం అధికారికంగా అరెస్టు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అరెస్టు సమయాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా చూపించారని నిందితుడి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటల గడువు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్