నవతెలంగాణ - హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో బహుదా నది వరద ఉధృతి కారణంగా హౌరా-చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వరద నీరు హైవేపైకి చేరడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో వాహనాలను నిలిపివేశారు. దీంతో రెండు రోజులుగా వేలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 48 గంటలుగా కనీసం తినడానికి తిండి, తాగడానికి మంచినీరు కూడా అందుబాటులో లేదని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపైనే చిక్కుకుపోవడంతో కనీస మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. తమ కష్టాలను పట్టించుకునే వారు కూడా కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, టోల్గేట్ సమీపంలో వాహనదారులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరద ఉధృతి తగ్గే వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయడం తప్పనిసరైనప్పటికీ, రోజుల తరబడి రహదారిపై చిక్కుకున్న డ్రైవర్లకు కనీసం ఆహారం, మంచినీరు అందించడంలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రాణ రక్షణ కోసం ట్రాఫిక్ నిలిపివేయడం ఎంత ముఖ్యమో, ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రయాణికులు, డ్రైవర్లకు కనీస సౌకర్యాలు కల్పించడం కూడా అంతే అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితులకు ఆహారం, మంచినీరు అందించడంతో పాటు వాహనాల రాకపోకల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







కామెంట్లు (0)