మహాముత్తారం మండలంలో పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు తగిలి ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం. అయితే, ఉదయం వెళ్లి చూడగా మృతదేహం కనిపించకపోవడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం అజంనగర్కు చెందిన ఎనిమిది మంది శుక్రవారం రాత్రి ట్రాక్టర్లతో చెట్లు తొలగించి పోడు చేసేందుకు నిమ్మగూడెం-అజంనగర్ మధ్య ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు. యామన్పల్లి వైపు నుంచి అడవిలోకి వస్తున్న ట్రాక్టర్లు దారి తప్పిపోయాయి.వాటిని పోడు చేసే ప్రాంతానికి తీసుకువచ్చేందుకు నలుగురు వ్యక్తులు ఎదురుగా వెళ్లారు.
ఈ క్రమంలో అజంనగర్ గ్రామానికి చెందిన జడల అశోక్ (30) అప్పటికే వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఆయన వెంట ఉన్న మరో ముగ్గురు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.శనివారం ఉదయం మృతదేహం వద్దకు వెళ్లి చూడగా అది కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.కాటారం సీఐ నాగార్జునరావు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.మృతుడితో పాటు వెళ్లిన ముగ్గురిని విచారించారు.మృతదేహం కనిపించకుండా పోవడానికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.







కామెంట్‌లు (0)