ఆకస్మిక వరదతో ఉప్పొంగిన మోఛూ నది
పశ్చిమ బెంగాల్, అసోం సరిహద్దుల్లో హై అలర్ట్
థింపు/ న్యూఢిల్లీ: నార్త్ వెస్ట్ భూటాన్లోని గసా జిల్లాలోని ‘షింటాఫు’ అనే మంచు సరస్సు శుక్రవారం ఒక్కసారిగా పొంగిపొర్లింది. భారీ ఎత్తున ఆకస్మిక వరద పోటెత్తడంతో మోఛూ నది ఉప్పొంగింది.దీంతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గసా షాచు హాట్ స్ప్రింగ్ కేంద్రం పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రమాద తీవత్రను పసిగట్టిన అధికారులు ముందుగానే స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే స్థానిక సోలార్ సాగునీటి ప్రాజెక్టు పాక్షికంగా దెబ్బతినగా, పునాఖా-గసా హైవేపై భారీగా బురద, రాళ్లు కొట్టుకొచ్చి రాకపోకలు నిలిచిపోయాయి. భూటాన్ నుంచి పోటెత్తిన ఈ వరద నీరు దిగువనున్న సంకోష్ నది ద్వారా భారత్లోకి ప్రవేశిస్తోంది. దీంతో పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల సరిహద్దు జిల్లాలకు కేంద్ర జల సంఘం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లోని అలిపుర్దువార్, జల్పాయిగురి, డార్జిలింగ్ కొండలు, కూచ్ బెహార్తో పాటు అసోంలోని ధుబ్రి జిల్లాలో నదీ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, మంచు సరస్సు కరిగిపోతున్నప్పుడు వాటి సహజసిద్ధమైన మంచు లేదా మట్టి కట్టల వెనుక భారీగా నీరు నిల్వ ఉండి సరస్సులా మారుతుంది. భూమి ఉష్ణోగ్రతల వల్ల లేదా కొండచరియలు విరిగిపడటం వల్ల ఆ కట్టలు ఒక్కసారిగా తెగిపోతే పెద్ద ఎత్తున నీరు వరదలా ముంచెత్తుతుంది. దీనినే 'గ్లేసియల్ లేక్ ఔట్బరస్ట్ ఫ్లడ్ (జిఎల్ఒఎఫ్)’ అంటారు.






కామెంట్లు (0)