పోలీసుల దాష్టీకం
మోడీ, షా చర్యలతో ఉలిక్కిపడ్డ దేశ రాజధాని..
ఎమర్జెన్సీని తలపించిన నిర్బంధం
వేలాది మంది నిరసనకారుల అరెస్టు..
నిర్బంధ కేంద్రాలకు తరలింపు..వేలాది పోలీసులు...బారికేడ్లు, రోడ్లపై మేకులు..
అయినా జంతర్ మంతర్ వద్దకు ఆందోళనకారులు..ఎర్ర కోట వద్ద విద్యార్థి, యువత ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, సర్‌ను రద్దు చేయాలని, 2023లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ, విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చిన జంతర్ మంతర్ 2.0 ఆందోళన విజయవంతమైంది. ఆందోళనకారులను అడ్డుకునేం దుకు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేపట్టిన చర్యలతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఢిల్లీ నగరం దిగ్బంధాన్ని చవిచూసింది. ఆందోళనకారులపై పోలీసులు, భద్రతా బలగాల క్రూరమైన చర్యలతో దేశ రాజధాని రణరంగంగా మారింది. మోడీ ప్రభుత్వం జంతర్ మంతర్‌ను మూసివేసి, ఢిల్లీని ఒక పోలీస్ క్యాంపు కమ్ పారామిలిటరీ కంటోన్మెంట్‌గా మార్చి, ప్రజలపై వాస్తవంగా ఢిల్లీ బంద్‌ను రుద్దింది. ఆందోళనకారులను నిరోధించే పేరుతో సామాన్య జనజీవనానికి ఆటంకం కలిగించేలా మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు, ఓలా, ఉబర్ వంటి రవాణ సౌకర్యాలపై నిషేధం వంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇంటర్నెట్ ను నిషేధించింది. మార్కెట్లన్నీ బంద్ చేసింది. హోటళ్లను మూసివేసింది. జుమాటో, స్విగ్గీ వంటి ప్రయివేట్ సేవలను నిలిపివేసింది. దాదాపు 10 వేల మంది విద్యార్థి, యువజన నేతలు, కార్యకర్తలు, రాజకీయ, సామాజిక నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసిన చాలా మంది పోలీసులకు నేమ్ బోర్డులు లేవు. వారు పోలీసులా? లేక ప్రయివేట్ గూండాలా? అని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ నగరంలో ఎక్కడికక్కడే బారికేడ్లను పెట్టి ప్రజల దైనందిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం ఆటంకం కలిగించింది. దీంతో నగరంలో కర్ఫ్యూ పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులు నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు కేవలం బారికేడ్లే కాకుండా, అత్యంత కఠినమైన భద్రతా చర్యగా స్పైక్ స్ట్రిప్స్‌ను రంగంలోకి దించారు. సౌత్-ఈస్ట్ ఢిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్లపై మేకులు ఉండే స్పైక్ స్ట్రిప్స్‌ను అమర్చారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రపూరిత అణచివేత చర్యలకు పూనుకున్నా, వాటినన్నింటినీ ఛేదించి కొంత మంది నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ విజిల్స్ హోరుతో ప్రజాస్వామ్య గళాన్ని అణచివేసే ప్రయత్నాలు జరిగాయి. జర్నలిస్టుల మైకుల దగ్గరే పోలీసులు విజిల్స్ ఊదారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు కనిపించగానే, ఏదో ఉగ్రవాది సరిహద్దు దాటి ఢిల్లీలోకి చొరబడినట్లుగా పోలీసులు వారిని వెంబడించారు. పోలీసుల భద్రతా వలయాన్ని ఛేదించి వందలాది మంది విద్యార్థులు, యువత రెడ్ పోర్టు (ఎర్రకోట) వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వారిని నిర్బంధించడానికి వచ్చిన అవే బస్సులపైకి నిరసనకారులు ఎక్కి సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జెండాలు ఊపి, నినాదాల హోరెత్తించారు.
నిరసనకారులను లోపలికి రానివ్వకుండా, తమ విధి నిర్వహణకు సహకరించాలని పోలీసులు గురుద్వారా ప్రతినిధులను కోరారు. అయితే ప్రతినిధులు అందుకు నిరాకరించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ‘‘మేము పోలీసులను ఆవరణలోకి రానివ్వం. నిరసనకారులు నిరాయుధులు’’ అని ప్రతినిధులు తెలిపారు. గోల్ మార్కెట్, కన్నాట్ ప్లేస్, కేరళ హౌస్, హరికిషన్ సింగ్ భవన్, ఎన్ఐఎ మార్కెట్, మింటో రోడ్డు, లోథీ గార్డెన్, సౌత్ అవెన్యూ, రెడ్ పోర్టు, జంతర్ మంతర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులను పోలీ సులు, భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాలకు తరలించారు. మింటో రోడ్డు వద్ద త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, త్రిపుర ప్రతిపక్షనేత జితేంద్ర చౌదరితో పాటు వందలాది మంది సీపీఐ(ఎం), సీపీఐ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు. వీరిని బవానాలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నిర్బంధించారు. అక్కడ ‘అప్రకటిత అత్యవసర పరిస్థితిలో భారతదేశం’ అనే అంశంపై ప్రొఫెసర్ ఆర్. గోపీనాథ్‌తో సెమినార్ నిర్వహించారు. జంతర్‌మంతర్ వద్ద కేరళం మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత పినరయి విజయన్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీపీఐ(ఎం) సీనియర్ నేత బృందా కరత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో గంట సేపు తిప్పి చివరికి ఛత్రసాల్ స్టేడియంకు తరలించారు. చివరికి పినరయి విజయన్, కేరళం మాజీ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాలన్, ఎంపీ జాన్ బ్రిట్టాస్‌లను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ వద్ద విడిచిపెట్టారు. గోల్ మార్కెట్ వద్ద సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు ఎఎ రహీం, డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హిమఘ్నరాజ్ భట్టాచార్య, ఎస్ఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యాక్షురాలు ఐషీఘోష్‌తో పాటు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నాంగ్లోయ్ స్టేడియానికి తరలించారు. ఎన్ఐఎ మార్కెట్ వద్ద దీపాంకర్ భట్టాచార్య, నేహాబోరా, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను అరెస్టు చేసి, మైదాన్ గఢి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సౌత్ అవెన్యూలోని బస్ స్టాండ్ వద్ద బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీకి చెందిన ఎంపీలు డెరెక్ ఓబ్రియెన్, ప్రతిమా మండల్, డోలాసేన్ వంటి నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన.. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌తోపాటు ఆ పార్టీ కీలక నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్ సహా పలువురిని లోథీ మార్గ్‌లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
జంతర్ మంతర్ దగ్గర పరంజయ్ గుహా ఠాకుర్తాను, ప్రముఖ యూట్యూ బర్ ధృవ్‌రాఠీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని గుర్గావ్‌లో సెక్టార్ 56లో ఉన్న తన నివాసం నుంచి ఆయనను ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం 8.00 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది పోలీసులు ఉదయం 7.48 గంటల సమయంలో ధృవ్ రాఠీ ఇంట్లోకి పోలీసులు చొరబడి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్న సింగ్‌ను కూడా నిరసనలో పాల్గొనకుండా నిరోధించేందుకు ఆమె ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. కన్నాట్ ప్లేస్ నుండి ఎస్ఎఫ్ఐ నిరసనకారులను ఢిల్లీ పోలీసులు ఈడ్చివేసి నిర్బంధించారు. బాబా ఖరక్ సింగ్ వద్ద నిరసనకారులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు.
సీజేపీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరగాల్సి ఉన్న ముంబయిలోని క్రాంతి మైదాన్ వద్ద నటుడు ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటుడు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘నాకు ఎలాంటి డిమాండ్లు లేవు. ఒక పౌరుడిగా, ఈ నగరంలో నివసించే వ్యక్తిగా నేను ఇక్కడ ఉన్నాను. స్వేచ్ఛగా సంచరించే హక్కుపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారో, ప్రజల గొంతుకను ఎందుకు అణచివేస్తున్నారో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఎవరిపైనా డిమాండ్లు చేసే స్థితిలో నేను లేను. అలాగే, నేను ఏ సంస్థలోనూ సభ్యుడిని కాదు. కేవలం ఒక ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ఉన్నాను’’ అని అన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ మునిమనువడు తుషార్ గాంధీనీ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి పోలీసులు ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టనున్న నిరసనకు మద్దతుగా ముంబయిలోని ‘క్రాంతి మైదాన్’ కు వెళ్తుండగా గాంధీని అరెస్ట్ చేశారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఆచూకీ గురించి అతని కుటుంబ సభ్యులకు గానీ, సీజేపీ న్యాయవాదులకు గానీ ఎవరికీ సమాచారం అందించలేదని సీజేపీ తెలిపింది. ముగ్గురు సీజేపీ నాయకుల భద్రత గురించి తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, ఇలాంటి సమాచారాన్ని పత్రికలకు లీక్ చేయడానికి బదులుగా, ఢిల్లీ పోలీసులు అభిజీత్ కుటుంబ సభ్యులను, న్యాయవాదులను ఆయనతో మాట్లాడటానికి అనుమతించి, ఆయనను తక్షణమే విడుదల చేయాలని సీజేపీ కోరింది.






కామెంట్‌లు (0)