మెట్రో, రైలు సేవలు యథావిధిగా నడపాలి
ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించొద్దు
ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతించాలి
ప్రజాశాంతిని కాపాడే పేరుతో ప్రజల ప్రాథమిక హక్కులను పూర్తిగా నిరోధించలేం
ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనల నేపథ్యంలో నిరసనకారులను అక్రమంగా నిర్బంధించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతిం చాలని, మెట్రో రైలు, రైల్వే సేవలను సాధారణంగా కొనసాగిం చాలని, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగిం చరాదని ఆదేశించింది. ప్రజా శాంతికి భంగం కలిగే పరిస్థితులు తలెత్తిన ప్పుడు చట్ట ప్రకారం అవసరమైన పరిమి తులు విధించవచ్చని పేర్కొంది. ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మొహనాలతో కూడిన ధర్మాసనం ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు పరిసరాల్లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్ 163 అమలులో ఉందని తెలిపే బోర్డును తొలగించాలని, ఇప్పటికే తొలగించకపోతే వెంటనే తొలగించాలని అధి కారులను ఆదేశించింది. న్యాయస్థానాలకు చేరుకోవడంలో ప్రజలకు ఎలాంటి భయాందోళనలు ఉండకూడదని స్పష్టం చేసింది.
నిరసనల అణచివేతపై పిటిషన్లు
అక్టోబర్ 10న ఢిల్లీలో జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా నిర్బంధాలకు పాల్పడ్డారని, నిరసనకారులపై అధిక బలప్రయోగం చేశారని పేర్కొంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రజా రవాణా సేవలకు ఆంక్షలు విధించడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, రాజకీయ నాయకులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులను నిర్బంధించడం వంటి అంశాలు కూడా విచారణకు వచ్చాయి. ఆర్‌జెడి రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో సెక్షన్ 163 అమలులో ఉన్న ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల పరిధి వెలుపల ఉన్నవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రైళ్లలో ప్రయాణిస్తున్నవారిని సైతం పోలీసులు ఎత్తుకెళ్తున్నారని, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగిం చారని, శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ 45 మెట్రో స్టేషన్లు మూసివేశారని తెలిపారు. సీనియర్ న్యాయవాది షదన్ ఫరాసత్ కూడా నిరసన సందర్భంగా తాను పోలీసుల దాడికి గురయ్యానని కోర్టుకు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును రాజధానిలో దెబ్బతీశారని, పౌరుల శాంతియుత నిరసన హక్కును పునరుద్ధరించాలని కోరారు.
బారికేడ్లను సమీక్షించాలి
ఢిల్లీలో ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న బారికేడ్లను వెంటనే సమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ట్రాఫిక్ నిబంధనలకు లోబడి నగరంలో ప్రజలు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించాలని పేర్కొంది.
మెట్రో సేవలపై గత ఆదేశాల ప్రస్తావన
అక్టోబర్ 9న కూడా సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రాకపోకలపై ఆంక్షలకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, రైల్వే సేవలను పూర్తిగా నిలిపివేయకుండా అవసరాన్ని బట్టి నియంత్రించాలని తెలిపింది.న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తించకుండా ఎవరూ అడ్డుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.







కామెంట్‌లు (0)