ఓటర్ల జాబితాలపై ప్రశ్నిస్తే అడ్డంకులు
ప్రజాస్వామ్య నిరసనలపై ఉక్కుపాదం
ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలకు సమాధానం ఇదేనా?
ఇది మోడీ అధికార బలహీనతకు సంకేతం
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల తీరు ఆందోళనకరం:రాజకీయ పరిశీలకులు
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రక్షాళనపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు చర్చలు, సమాధానాలతో బదులివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం.. పోలీసు బలాన్ని ప్రయోగిస్తూ రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజాస్వామ్య నిరసనలను భద్రతాపరమైన ముప్పుగా చిత్రీకరిస్తూ ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం, ప్రభుత్వ రాజకీయ అధికారంపై విశ్వాస సంక్షోభాన్ని బయట పెడుతోందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ వైఖరి ప్రభుత్వ బలానికి సంకేతం కాకుండా, రాజకీయ సవాళ్లను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతోందనే భావనకు దారితీ స్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ప్రశ్నిస్తే అడ్డుకోవడమేనా?
‘
మోడీ భయపడినప్పుడల్లా పోలీసులను ముందుపెడతారు’ అనే నినాదం ఇటీవలి నెలల్లో దేశవ్యాప్తంగా నిరసనల్లో వినిపిస్తోంది. గత వారం జరిగిన పరిణామాలు ఈ విమర్శను మరోసారి చర్చలోకి తెచ్చాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామాను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు ఢిల్లీ పోలీసుల చర్యలను ఎదుర్కొన్నారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి, జంతర్ మంతర్‌కు వెళ్లకుండా వారిని అడ్డుకోవడం, తోపులాటకు దిగడం, నిర్బంధించడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయి.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీసులకు అదనంగా 23 వేల మందికి పైగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్) మోహరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ విద్యార్థి నేతలు, కార్యకర్తలు, రాజకీయ నాయకులను వారి ఇండ్ల నుంచి, రైళ్ల నుంచి అదుపులోకి తీసుకున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్ 10న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రకటించిన నిరసనల్లో ప్రజలు పాల్గొనకుండా ఢిల్లీ పోలీసులు విద్యార్థుల వసతిగృహాలు, మసీదులు, బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారనే కథనాలూ వెలువడ్డాయి. గత నిరసనల్లో పాల్గొన్నవారిని గుర్తించి, ముందస్తు నిర్బంధం చేస్తామంటూ హెచ్చరించడం ద్వారా ఎన్నికల జవాబుదారీతనం కోరుతున్న పౌరులను భయపెట్టే ప్రయత్నం జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎంపీలు దేశ భద్రతకు ముప్పు కాదు
ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి బలప్రయోగాన్ని ఆశ్రయించడం మోడీ–షా ద్వయం పాలనా సామర్థ్యం, రాజకీయ పరిణతి లోపానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యాని స్తున్నారు. రాజకీయంగా ఎదురవుతున్న సవాలును భద్రతా సమస్యగా చిత్రీకరించడం ద్వారా పోలీసులకు అనుకూలంగా పరిస్థితులను మార్చు కోవాలనేది ఈ వ్యూహమని అంటున్నారు. ప్రజాస్వామ్య నిరసనలను దేశ ఉనికికే ముప్పుగా చూపించి, కఠిన చర్యలకు దిగడం నిరంకుశ పాలనా విధానాల్లో సాధారణం. అయితే, ప్రభుత్వం ఒక నిరసనను భద్రతా ముప్పుగా పేర్కొన్నంత మాత్రాన అది నిజమైన ముప్పు కాదనీ, ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఎన్నికల నిర్వహణపై ప్రశ్నలను అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి రాదనీ, భద్రతా బలగాలపై నియంత్రణ ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష ఎంపీలను దేశ శత్రువులుగా చూడలేరని వారు వివరిస్తున్నారు.
బలప్రయోగం.. అధికార బలహీనతకు సూచనా?
రాజకీయ తత్వవేత్త హన్నా ఆరెండ్ తన ‘ఆన్ వయొలెన్స్’ పుస్తకంలో అధికారానికి, భౌతిక బలప్రయోగానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. ప్రజల సమ్మతి, సంస్థలపై విశ్వాసం, రాజకీయ చట్టబద్ధత నుంచి నిజమైన అధికారం వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. పాలకుడికి ప్రజల స్వచ్ఛంద మద్దతు తగ్గినప్పుడు, దాని స్థానంలో బలప్రయోగం పెరిగే ప్రమాదం ఉందని వివరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. పోలీసు బారికేడ్లు, నిర్బంధాలు, బలప్రయోగం ప్రభుత్వానికి తాత్కాలికంగా నిరసనలను అడ్డుకునే శక్తిని ఇవ్వవచ్చు. కానీ అవి ప్రజల విశ్వాసాన్ని, ప్రభుత్వంపై స్వచ్ఛంద సమ్మతిని దెబ్బతీస్తాయి. అందువల్ల బలప్రయోగం అధికార బలానికి సూచన కాకుండా, దాని బలహీనతకు సంకేతంగా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతిపక్షాలకే లాభం చేకూర్చే చర్యలు
ప్రతిపక్ష నేతలను బహిరంగంగా అడ్డుకోవడం ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించేందుకు వెళ్తున్న ఎంపీలను అడ్డుకోవడం ద్వారా, ఆ సంస్థకు దాచాల్సిన విషయాలున్నాయనే ప్రతిపక్ష వాదనకు మరింత ప్రచారం లభించే అవకాశం ఉందని వివరిస్తున్నారు. రాహుల్ గాంధీ తదితరులపై పోలీసు కేసులు నమోదు చేయడం వారి రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచి, వారిని ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న నేతలుగా ప్రతిపక్షాలు చూపించుకునే పరిస్థితిని కల్పిస్తోందని చెప్తున్నారు. అలాగే, వేర్వేరు రాజకీయ పార్టీలను ఒకే అంశంపై ఏకం చేసే అవకాశమూ ఉందని అంచనా వేస్తున్నారు.
బలమైన నేతగా కనిపించాలనే ఆరాటం
మోడీ రాజకీయ అభద్రత కేవలం యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయానికి పరిమితం కాలేదనీ, బలమైన నేతగా కనిపించాలనే ఆరాటం ఆయనకు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్షానికి కొంత మేర నిరసనకు అవకాశం ఇవ్వడమే బలహీనతగా భావించే రాజకీయ ధోరణి.. చిన్న సవాళ్లకూ అతిగా స్పందించే పరిస్థితిని సృష్టిస్తుందనీ, దీంతో బారికేడ్లు, నిర్బంధాలు వంటి చర్యల ద్వారా రాజకీయ సవాళ్లను పూర్తిగా అణచివేయాలని పాలకులు ప్రయత్నిస్తారనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
ప్రజాస్వామ్య ప్రతిష్ఠకు పరీక్ష
ఓటర్ల జాబితాల విశ్వసనీయతపై లేవనెత్తిన ప్రశ్నలకు రాజకీయ చర్చ ద్వారా సమాధానం చెప్పకుండా, వాటిని భద్రతా సమస్యగా మార్చడం మోడీ సర్కారుకు నైతిక, రాజకీయ సమస్యలను సృష్టిస్తోందని అంటున్నారు. ఎంపీలను అడ్డుకోవడం ద్వారా ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత ప్రాధాన్యం లభిస్తోందని వివరిస్తున్నారు. వేలాది మంది పోలీసు సిబ్బంది, బారికేడ్లు, హెచ్చరికలతో నిరసనలను అడ్డుకోవడం బలమైన ప్రభుత్వానికి నిదర్శనం కాదనీ, ఇది రాజకీయ ఆందోళనకు సంకేతంగా ప్రజలకు కనిపిస్తుందని అంటున్నారు. అంతర్జాతీయంగా ‘ప్రజాస్వామ్యానికి' పేరు గాంచిన భారత్ ప్రతిష్ఠకు ఇలాంటి చర్యలు సవాలుగా మారుతాయని హెచ్చరిస్తున్నారు.







కామెంట్‌లు (0)