విద్యార్థులు, యువజనులపై విచక్షణారహిత దాడులు
సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్‌పై దాడి..సొమ్మసిల్లిన తరువాత రోడ్డు పక్కనే పడేసిన పోలీసులు
అనంతరం ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలింపు..పరామర్శించిన సీపీఐ(ఎం) నేతలు, ఎంపీలు
నిరసనలతో హోరెత్తిన ఢిల్లీ
విరిగిన లాఠీలు, మూకుమ్మడి దాడులు, ఒక్కర్ని చేసి చుట్టుముట్టి ఒళ్లు హూనమయ్యేలా చావబాదిన దృశ్యాలు, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసేలా కేంద్ర భద్రతా బలగాల కవాతులు, ఎక్కడికక్కడ విద్యార్థి, యువజనుల అరెస్టులు, రాజకీయ నాయకులపైనా విచక్షణారహిత దాడులు, మూకుమ్మడి అరెస్టులతో దేశ రాజధాని ఢిల్లీ భీతిల్లింది. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షాల ఆదేశాలతో ఢిల్లీలోని బీజేపీ రాష్ర్ట ప్రభుత్వ డైరెక్షన్‌లో జరిగిన ఈ దమనకాండకు ఢిల్లీ పోలీసులకు కేంద్ర భద్రతా బలగాలు తోడయ్యాయి. నిరాయుధులైన నిరసనకారులపై దాడులతో రెచ్చిపోయారు. ఒంటిపై లాఠీదెబ్బలు పడుతున్నా, వీపులు చీరిపోతున్నా విద్యార్థులు, యువతరం వెన్ను చూపలేదు. ఎంత కొడతారో కొట్టండి...వెనక్కి తగ్గేది లేదంటూ లాఠీలకు ఒళ్లు అప్పగించి ధైర్యాన్ని ప్రదర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. అప్పటి వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపైకి శత్రుమూకలపై దాడులు చేసినట్టే పోలీసులు, భద్రతాబలగాలు వ్యవహరించాయి. సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్‌ను ఒంటరిగా చుట్టుముట్టి లాఠీలతో కుళ్లబొడిచి, ఆయన సృహ తప్పాక రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారంటే ‘ఖాకీ క్రౌర్యం’ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో వెల్లువెత్తిన ప్రజాందోళనలు, నిరసనలను అణచివేసేందు కు కేంద్ర బలగాలు, పోలీసులు తీవ్ర నిర్బంధా నికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. ఆందోళనకారులను అరెస్టు చేసి వాహనాల్లో కుక్కిన తరువాత కూడా వారిపై దాడులు కొనసాగించారు. ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ మీడియాతో మాట్లాడుతుండగా ఆయనపై పోలీసులు దాడి చేశారు. అనంతరం రోడ్డుపక్కనే ఆగి ఉన్న వాహనం మెట్లపైనే పడేశారు. సొమ్మసిల్లిపోయిన ఆయ నను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చూసి ఆటోలో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయనను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, కేరళం ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్, ఎంపీలు వి.శివదాసన్, ఎఎ రహీంలు పరామర్శించా రు. వైద్యులతో చర్చించిన నేతలు, జాన్ బ్రిట్టా స్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆదివారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఆందోళనలకు ప్రధాన కేంద్రంగా మారింది. విద్యార్థులు, యువకుల ను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాల్లో పడేయడంతో పాటు, వాహనాల్లోనూ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పలువు రు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు.
విద్యార్థులపై మూకుమ్మడి దాడులు
సీజేపీ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కన్నాట్ ప్లేస్‌లో నిరసన జరిగింది. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ రెండో గేటు సమీపం నుంచి జంతర్ మంతర్ వైపు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. పాలికా బజార్ ప్రాంతానికి చేరుకోగానే కేంద్ర బలగాలు, పోలీసులు ఒక్కసారిగా ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. నాయకులను, కార్యకర్తలను చుట్టుముట్టి కొట్టుకుంటూ పోలీసు వాహనాల్లోకి ఈడ్చుకెళ్లారు. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజి, డీవైఎఫ్‌ఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు జైక్ సి. థామస్‌పై తీవ్రంగా దాడి చేశారు. ఆదర్శ్ కంటికి గాయమై రక్తం కారింది. జైక్ సి. థామస్, డీవైఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యుడు బాలేందర్ షాలను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సూరజ్ ఇళమణ్, కేంద్ర కమిటీ సభ్యుడు అభిజిత్ మణిలాల్, ఢిల్లీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిమ్రాన్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు శరణ్య కూడా దాడుల్లో గాయపడ్డారు. ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి దినేశ్ సీరంగరాజ్ దుస్తులను సైతం చించివేశారు. సీజేపీ నాయకుడు సుధీర్ సాంగ్వాన్, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషీఘోష్‌ను కూడా అరెస్టు చేశారు.
రోడ్లపై బలగాల కవాతు
కన్నాట్ ప్లేస్, పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్), ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ బలగాలను భారీగా మోహరించారు. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ గేట్ల సమీపంలో భద్రతా సిబ్బంది కవాతు నిర్వహించారు. అయినప్పటికీ నిరసనకారులు భద్రతా ఏర్పాట్లను దాటుకుని జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టుల కోసం సాధారణ ప్రయాణికుల రవాణాకు ఉపయోగించే బస్సుల్ని పోలీసు వాహనాలుగా మార్చారు. అయినప్పటికీ వాహనాలు సరిపోకపోవడంతో ఉత్తరప్రదేశ్ నుంచి మరిన్ని వాహనాలు రప్పించారు. పాలికా బజార్ రోడ్డు నుంచి అరెస్టయిన వారితో బయలుదేరిన బస్సును కొంతదూరం వెళ్లాక మళ్లీ కన్నాట్ ప్లేస్‌లోనే నిలిపివేశారు. ఆ సమయంలో బస్సు తలుపులు మూసివేసి కేంద్ర బలగాలు ఆందోళనకారులపై దాడికి పాల్పడ్డాయి.
ఎంపీ జాన్ బ్రిట్టాస్‌పై దాడి
విద్యార్థులు, యువజనులపై దాడుల విషయం తెలుసుకుని కన్నాట్ ప్లేస్‌కు చేరుకున్నసీపీఐ(ఎం) రాజ్యసభా పక్ష నాయకుడు జాన్ బ్రిట్టాస్‌పైనా పోలీసులు దాడికి పాల్పడ్డారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయనను బలవంతంగా ఈడ్చుకెళ్లి బస్సులోకి ఎక్కించారు. బస్సులోనూ ఆయనపై దాడి చేసి, అనంతరం కన్నాట్ ప్లేస్‌లో వదిలివేశారు. మహిళా సంఘం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు ఆధ్వర్యంలో నిరసనలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యురాలు ఆనీ రాజాను కూడా అరెస్టు చేశారు. దిశ, రివల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, క్రాంతికారి యువ సంఘటన్ తదితర సంస్థలు కూడా నిరసనల్లో పాల్గొన్నాయి. అరెస్టయిన కార్యకర్తలను పోలీసు వాహనాల్లోకి ఎక్కించి దాడులు చేశారు. అనంతరం వారిని ఢిల్లీ సరిహద్దుల్లోని పోలీస్ స్టేషన్లు, మైదానాలకు తరలించారు.
సాయంత్రం వరకూ కొనసాగిన ఆందోళనలు
మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తరువాత ఆర్‌కె ఆశ్రమ్ మెట్రో స్టేషన్ సమీపం నుంచి ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్ఎ కార్యకర్తలు మరోసారి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఏ అఖిల భారత అధ్యక్షురాలు నేహా బోరాతో పాటు పలువురిని అరెస్టు చేశారు. సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత ఎస్‌ఎఫ్‌ఐ మహిళా కార్యకర్తలు జాతీయ పతాకాలతో కన్నాట్ ప్లేస్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్, ఢిల్లీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెహినా ఫాతిమా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు సఖి బంధు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని చీకటి పడిన తరువాత లైట్లు లేని వాహనాల్లో విద్యార్థినీలను తరలించారు. అందులో మగ పోలీసులను విద్యార్థినీలపై దాడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.







కామెంట్‌లు (0)