రిజర్వేషన్లకు, నియోజకవర్గాల పునర్విభజనకు మెలిక
బీజేపీ కుట్రలపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
న్యూఢిల్లీ : పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్లు నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి మహిళలను వంచిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఆ సాకుతో లోక్సభ స్థానాల పెంపునకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కుయుక్తులకు తెర లేపుతోంది. ఈ క్రమంలోనే సుదీర్ఘకాలంగా ప్రోరోగ్ కాకుండా పార్లమెంటును కొనసాగించడమే కాకుండా ఇప్పుడు ప్రత్యేక సమావేశాలకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ బిల్లును 15 నుంచి 18 ఓట్ల మెజారిటీతో నెగ్గించుకునేందుకు ఇప్పటికే మోడీ-షా బృందం వ్యూహాలు రచించినట్టు తెలుస్తోంది.
రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించాలంటే
రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. లోక్సభలో 361 ఓట్లు అవసరం. ప్రస్తుతం 543 స్థానాలున్న లోక్సభలో మూడు ఖాళీలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాలని తాజా సవరణలో ప్రతిపాదించారు. తద్వారా పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమం కానుందన్నది కేంద్రంలోని బీజేపీ వాదన. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 17న బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన ప్రత్యేక భేటీలో ఇలాంటి రాజ్యాంగ సవరణ బిల్లుకు తగినన్ని ఓట్లు రాకపోవడం వల్ల అది వీగిపోయిన సంగతి తెలిసిందే. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత చట్టంతోనే మహిళలకు రిజర్వేషన్లు అమల్జేయవచ్చు అని, తక్షణమే అమల్జేయాలని మహిళా సంఘాలు నిలదీస్తున్నా మోడీ సర్కార్ మాత్రం రిజర్వేషన్లకు, నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెట్టి మీనమేషాలు లెక్కిస్తూ మహిళాలోకాన్ని వంచిస్తుండటం గమనార్హం.
ప్రొరోగ్ కాకుండా కొనసాగుతుండటం ఇదే తొలిసారి
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, కానీ ఇప్పటివరకు అధికారికంగా ముగియలేదు (ప్రొరోగ్ చేయలేదు). ఇలా సమావేశాలు ప్రొరోగ్ కాకుండా 91 రోజుల పాటు కొనసాగుతుండటం ఇదే తొలిసారి. దీనివల్ల పార్లమెంటును మళ్లీ సమావేశపరిచే అవకాశం ఉంది. 2008లో ఉన్న 87 రోజుల రికార్డును ఇది అధిగమించింది. ఒకవేళ కొత్త సెషన్ ప్రారంభించాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. అదే కొనసాగుతున్న సెషన్లోనే అదనపు సిట్టింగ్ ఏర్పాటు చేయాలంటే రెండు రోజుల నోటీసు ఇస్తే సరిపోతుంది. అందుకే రాజ్యాంగ సవరణ బిల్లు కోసం వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా ముగించలేదనే వాదన వినిపిస్తోంది. వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించకుండా కొనసాగించడం, ప్రతిపాదిత సవరణను పరిశీలించేందుకు అదనపు లేదా ప్రత్యేక సమావేశాలను నిర్వహించవచ్చనే ఊహాగానాలకు దారితీసింది.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
డీలిమిటేషన్ వల్ల తమ ప్రాతినిధ్యం తగ్గుతుందన్న దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్సభ స్థానాలను 50 శాతం మేర పెంచాలని తాజా ముసాయిదాలో ప్రతిపాదించామని అందువల్ల ఎవ్వరికీ నష్టం రాదన్నది బిజెపి, దాని భాగస్వామ్య పక్షాల వాదన. వాస్తవంలో ఇప్పటికే అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు ఇంకా పెరిగిపోయి..అస్సలు ప్రజాస్వామ్య స్ఫూర్తినే నీరుగార్చే ప్రమాదమున్నదని రాజకీయ నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీరుపై వివిధ రూపాల్లో నిరసనలు కూడా కొనసాగుతున్నాయి.
ఆ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు!
గతంలో ఆమోదించిన బిల్లుకు కొనసాగింపుగా, 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల వారి సీట్ల నిష్పత్తులను యథాతథంగా ఉంచాలని కొత్త ముసాయిదా ప్రతిపాదించినట్లు తెలిస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ముసాయిదాల్లో ఇది ఒకటి మాత్రమేనని, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు. ఒక సభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత, దానిని తిరిగి వాయిదా వేయడానికి రాజ్యాంగం ఎటువంటి నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించలేదని, అలాగే, సభను అధికారికంగా వాయిదా వేయకుండా, సుదీర్ఘ కాలం పాటు సమావేశాలు కొనసాగించడం అనేది, ఎలాంటి రాజ్యాంగపరమైన లేదా విధానపరమైన ఉల్లంఘన కాదని చెబుతున్నారు.






కామెంట్లు (0)