జిమ్‌లో దుండగుడి దాడి
ఒకరి మృతి, మరో నలుగురికి గాయాలు
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో వైట్‌హౌస్‌కు కూతవేటు దూరంలో దుండగుడి కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఓ జిమ్‌లో కాల్పులు జరిపిన నిందితుడు సమీపంలోనే ఓ భవనంలో దాక్కున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ కాల్పుల ఘటనకు కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. గురువారం ఉదయం సుమారు 8 గంటలకు, వైట్‌హౌస్‌కు సుమారు ఒక మైలు దూరంలోని లోగన్ సర్కిల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అమెరికా మీడియా కథనాల ప్రకారం, 15వ వీధిలోని ‘వీడా ఫిట్‌నెస్’ జిమ్‌లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరిపి బయటకు పరుగులు తీశాడు. ఆ తర్వాత వీధిలోనూ కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో జనం బెంబేలెత్తిపోయారు. నేషనల్ పార్క్ సర్వీస్, సీక్రెట్ సర్వీస్ సహా పలు ఫెడరల్ సంస్థల సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాము పెద్ద శబ్దం విన్నామని, ఆ తర్వాత అందరూ బయటకు పరుగులు తీశారని, పోలీసులు లోపలికి వచ్చాక కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు చుట్టుముట్టి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. సమీప వీధులను మూసివేశారు. దగ్గరలోని పాఠశాలలకు లాక్‌డౌన్ విధించారు.






కామెంట్‌లు (0)