ఇరిగేషన్ కార్యాలయం, హైదరాబాద్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
సోదాలపై స్పష్టత ఇవ్వని దర్యాప్తు అధికారులు
నవతెలంగాణ - నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( డీఈఈ ) సత్యనారాయణ గౌడ్ కార్యాలయం, ఆయన ఇంటివద్ద గురువారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని డిఈఈ కి సంబంధించిన అన్ని రకాల ఫైళ్ళు, రికార్డులు, బిల్లులు, టెండర్లకు సంబంధించిన పత్రాలను క్షుణంగా పరిశీలించారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని విడివిడిగా విచారించి వివరాలు సేకరించారు. అదే సమయంలో హైదరాబాదులోని సత్యనారాయణ గౌడ్ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏసీబీ సోదాల నేపథ్యంలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోదాల వివరాలను అధికారులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. తనిఖీలు పూర్తి అయిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. సోదాలకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.






కామెంట్లు (0)