Magazines

బతుక‘అమ్మ’ను గౌరవిద్దాం

5 గంటల క్రితం

Let us honor Bathuk‘amma’.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 4 నిమిషాల చదవడం

ఐక్యతకు కవచమై నిలిచే పూల సంబురం బతుకమ్మ. ఆడబిడ్డ గొంతు విప్పితే జానపదం ఊపిరి పోసుకుంటుంది. ఆమె అడుగేస్తే తెలంగాణ నేల పరవశిస్తుంది. తంగేడు, గునుగు, చామంతి, జిల్లేడు పూల సౌరభాల మధ్య ఆడపడుచుల సందడి. చప్పట్ల చప్పుడు తెలంగాణ మట్టి గుండెచప్పుడుగా మారే వర్ణరంజిత దృశ్యకావ్యమే బతుకమ్మ. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఖండాంతరాలు దాటిన ఈ వేడుక కేవలం పూల పూజ కాదు.. మహిళల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీక. అనేక రంగాల్లో మహిళలు విజయాలు సాధిస్తున్నా ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఏదో ఒక రూపంలో మహిళలు హింసకు గురవుతూనే ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మహిళల బతుకును కోరుతూ జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బతుకమ్మ రానే వచ్చింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ వేడుకలు పల్లెపల్లెనా.. పట్టణాల్లోనే కాదు.. ఇతర దేశాల్లోనూ అంబరాన్నంటనున్నాయి. కులమతాలకతీతంగా సబ్బండ వర్గాలు ఒక్కటై సంబురాలు చేసుకోనున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలంతా ఒకచోట చేరి ఆనందాన్ని పంచుకోనున్నారు. ప్రకృతి పూలు విరబూసి.. ఆడబిడ్డల వేడుక వచ్చిందంటూ మురిసిపోతున్నాయి. రంగురూపులెన్నయినా తన ఒడిలో చేర్చుకునే బతుకమ్మ.. ప్రతి ఇంటి బిడ్డగా, ప్రతి తల్లికి ఆశగా మారింది. అమ్మ ఎదురుచూస్తోంది.. తన బిడ్డలు వస్తారని.

ప్రకృతిని కొలిచే వేడుక

సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ నిలయమైతే.. అందుకు అద్దం పట్టేది బతుకమ్మ. ప్రకృతిని ఆరాధిస్తూ.. తన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అరుదైన పూల వేడుక ఇది. పేదా ధనికా తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఆడుతూ.. పాడుతూ.. ఆనందంగా జరుపుకోవడం దీని ప్రత్యేకత. వర్షాకాలం చివర.. శీతాకాలం తొలిరోజుల్లో ఈ సంబురం వస్తుంది. అప్పటికే వాగులు, చెరువులు జలకళ సంతరించుకుంటాయి. పచ్చదనంతో ప్రకృతి పరవశిస్తుంది. తంగేడు నుంచి గునుగు వరకు.. చామంతి నుంచి బంతి వరకు రంగురంగుల పూలు విరబూస్తాయి.

పూలతో పేర్చే పల్లె సంప్రదాయం

ఈ కాలంలో గునుగు, తంగేడు, బంతి, చామంతి, నూకలి, జిల్లేడు, పట్టుకుచ్చు, మందార, టేకు, బటాని వంటి పూలు విరబూస్తాయి. సీతాఫలాలు సైతం చేతికందివస్తాయి. వెనకటి రోజుల్లో మగవాళ్లు తోటలు, పుట్టలు, గుట్టలు తిరిగి పూలు సేకరించుకొచ్చేవారు. గునుగు, నూకలి పువ్వులకు రంగులు అద్ది ఆరబెట్టేవారు. ఇత్తడి లేదా స్టీల్‌ ప్లేటుపై వెడల్పాటి ఆకును పరిచి.. వివిధ రకాల పూలను వరుసలుగా పేర్చేవారు. అవి విడిపోకుండా మధ్యమధ్యలో అదిమిపెడుతూ.. పూల మధ్య ఆకు పొత్తులను అమర్చేవారు. అలా ఒక్కో పువ్వును పేర్చి.. ఒక్కో మెట్టుగా అందమైన బతుకమ్మను తీర్చిదిద్దేవారు.

పూల మధ్య.. గౌరమ్మ కొలువు

పూలను పేర్చిన తర్వాత పైన తమలపాకు పెట్టి.. దానిపై పసుపుతో చేసిన గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. ఎంగిలిపూలు, సద్దుల బతుకమ్మ రోజుల్లో ఈ సంప్రదాయం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రసాదాలు తయారు చేసుకుంటారు. ఆడపడుచులు కొత్తబట్టలు ధరించి.. ఇంటి ముందు ముగ్గులు వేసి.. బతుకమ్మను ఇంటి నుంచి తీసుకొచ్చి నీళ్లు ఆరపోసి సాగనంపుతారు. వీధుల్లోనూ.. గుడి వద్దనూ.. ఖాళీ ప్రదేశాల్లోనూ మహిళలంతా ఒక్కచోట చేరతారు. బతుకమ్మలను పేర్చి.. పాటలు పాడుతూ.. చప్పట్లు కొడుతూ.. ఆటలతో సందడి చేస్తారు.

తొమ్మిది రోజులు.. తొమ్మిది తీరులు

అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు తొమ్మిది రోజులపాటు ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానుబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ గా ఈ బతుకమ్మ వేడుకలు కొనసాగుతాయి. చివరిరోజు సద్దుల బతుకమ్మతో గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి. ప్రకృతిలో లభించే పూలను ఏరికోరి తెచ్చి.. రంగురంగులుగా పేర్చి.. పాటలతో, ఆటలతో కొలుస్తారు.

తెలంగాణ గడప దాటి.. ఖండాంతరాలకు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ ఇప్పుడు దేశ సరిహద్దులను దాటి విదేశాలకూ చేరింది. ఎక్కడ ఉన్నా తెలంగాణ ఆడబిడ్డలు ఈ పండుగను మరిచిపోరు. ఎందుకంటే అది వారి జీవితాల్లో అంతగా మమేకమైంది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డ. అందుకే ప్రతి ఇంటి బిడ్డగా భావిస్తారు. తమ పిల్లలను కాపాడమంటూ వేడుకుంటారు. పాటల్లో పూజ మాత్రమే కాదు.. తమ బాధలు, సంతోషాలు, ఆశలు, ఆకాంక్షలను కూడా వ్యక్తం చేస్తారు. తరతరాలుగా వస్తున్న జానపద గీతాల్లో ఆడబిడ్డల జీవితాల ప్రతిబింబం కనిపిస్తుంది.

ప్రకృతికి కృతజ్ఞత..

వర్షాలతో చెరువులు నిండిపోయి జలకళను సంతరించుకుంటాయి. ఆడబిడ్డలు ఆడి పాడిన బతుకమ్మను.. గౌరమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. పూలను, పసుపుతో చేసిన గౌరమ్మను నీటిలో కలిపే సంప్రదాయం పూర్వకాలం నుంచీ కొనసాగుతోంది. ప్రకృతికి కృతజ్ఞత చెప్పే ఆచారంగా ఇది నిలిచింది. నీటిలో కలిసే పూలు, పసుపు ప్రకృతితో మనిషి అనుబంధాన్ని చాటుతాయి. ఒకప్పుడు బతుకమ్మ కోసం ముందుగానే పూల సేకరణ మొదలయ్యేది. పట్టణాల నుంచి పల్లెలవైపు ప్రకృతి బాట పట్టేవారు. చేనుల వెంట.. గుట్టల వెంట తిరుగుతూ పూలు ఏరుకొచ్చేవారు. ఆ ప్రయాణంలో ప్రకృతిని ఆస్వాదించేవారు. ఇప్పుడు మార్కెట్లలోనే కావాల్సిన పూలన్నీ సిద్ధంగా దొరుకుతున్నాయి. కాలం మారడం సహజమే అయినా.. పూలను స్వయంగా ఏరుకునే ఆ ఆనందం, ప్రకృతితో మమేకమయ్యే ఆ అనుబంధం మాత్రం దూరమవుతోంది. పూల సేకరణతో ముడిపడిన ఈ పల్లె సంస్కృతి కనుమరుగుకాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.


బంధాలను కలిపే బంధం

పండుగల పరమార్థం మానవ సంబంధాలను బలోపేతం చేయడమే. అందులో బతుకమ్మది ప్రత్యేక స్థానం. చదువు, ఉపాధి, ఉద్యోగం, వివాహం, వలసల కారణంగా సొంత ఊళ్లకు దూరమైనవారు సైతం ఈ వేళకు స్వస్థలానికి చేరుకుంటారు. బంధువులు ఒక్కచోటికి చేరతారు. నాలుగు మాటలు కలుస్తాయి. అనుబంధాలు బలపడతాయి. ఊరికి దూరమైన బిడ్డను మళ్లీ ఇంటి గడపకు చేర్చే పండుగగా.. బంధాలను మళ్లీ ముడివేసే వేడుకగా ఇది నిలుస్తోంది.

అమ్మాయి స్వేచ్ఛగా బతికినప్పుడే...

పూలను దైవంగా కొలిచే మన సమాజం.. ఆడపిల్ల బతుకుకు రక్షణగా నిలుస్తోందా? అన్న ప్రశ్నను మనల్ని మనం వేసుకోవాల్సిన సమయం ఇది. దేశంలో ప్రతి నిమిషానికి ఓ మహిళ ఏదో ఒక రూపంలో వేధింపులకు గురవుతుంది. ఇప్పటికీ ఆడపిల్ల పుడితే భారంగా భావించే కుటుంబాలు ఉన్నాయి. అనేక రకాలుగా వివక్షకు గురిచేస్తున్నారు. బతుకమ్మను భుజాన ఎత్తుకునే చేతులు.. ఇంట్లో ఆడపిల్ల పుడితే ఎందుకు ముడుచుకుపోవాలి? మహిళ భద్రతను, స్వేచ్ఛను, సమాన హక్కులను విస్మరిస్తే ఈ సంబరానికి పరిపూర్ణత లేనట్టే. ఇంట్లోనైనా.. బయటైనా.. ఆడబిడ్డకు భయం లేకుండా బతికే స్వేచ్ఛ ఉండాలి. సమాన హక్కులు దక్కాలి. అప్పుడే నిజమైన బతుకమ్మ. బతుకమ్మ చుట్టూ తిరిగే ప్రతి అడుగు.. ఆడపిల్ల హక్కుల వైపు పడే అడుగుగా మారాలి. పూలను పేర్చే చేతులే.. ఆమె బతుకును కాపాడే అభయహస్తాలుగా మారాలి. అప్పుడే ఈ మట్టికి.. ఈ సంబరానికి నిజమైన సార్థకత.

మహిళను గౌరవిస్తేనే...

మహిళలు లేకుంటే మానవ పుట్టుకే లేదు. ‘బతుకమ్మా’ అని కొలుస్తూనే.. మహిళలపై హింస కొనసాగుతున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఈ వైరుధ్యం తొలగాలి. మహిళ స్వేచ్ఛగా, గౌరవంగా, భద్రంగా జీవించే సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. లింగ వివక్షకు తావులేని సమాజం కోసం అడుగు ముందుకు వేయాలి. మహిళలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బతుకమ్మ సాక్షిగా గొంతెత్తాలి. ఆడబిడ్డకు అండగా నిలవాలి. ఆడపిల్లను పుట్టనిద్దాం.. బతకనిద్దాం.. ఎదగనిద్దాం.. ఈ సమాజంలో సగభాగమని గుర్తిద్దాం. పూలను పూజిద్దాం.. ప్రకృతిని ప్రేమిద్దాం.. బతుకమ్మను గౌరవిద్దాం.. ఆడబిడ్డ బతుకుకు అభయమిద్దాం.

గడగోజు రవీంద్రాచారి, 9848772232


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్