డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
ఆత్మనిర్భరత లక్ష్యాలకు విరుద్ధంగా ఆర్థిక విధానాలు
తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై ఆందోళన : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
విజయదశమి రోజున ప్రధానమంత్రి జాతీయ సమైక్యత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ప్రస్తుతం దేశంలో జాతీయ సమైక్యతకు బీజేపీ ప్రభుత్వమే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తోందని విమర్శించారు. నల్లగొండ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయం దొడ్డి కొమరయ్య భవన్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ సమైక్యత గురించి మాట్లాడుతూనే, దేశ ఐక్యతను దెబ్బతీసే విధానాలను బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. ఢిల్లీలో విజయదశమి సందర్భంగా రావణాసురుడి బొమ్మతో పాటు బొద్దింక బొమ్మను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని రాఘవులు ప్రస్తావించారు. ప్రతిపక్షాలను బలహీనపరచాలని, రాజకీయంగా విడగొట్టాలని కేంద్రం చూస్తోందని బీవీ రాఘవులు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజాస్వామిక, లౌకిక శక్తులు ఐక్యంగా పనిచేయాలని కోరారు. పార్ల మెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమి టేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగు తుందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో స్థానాలు ఎక్కువగా పెరిగి, దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గితే అది దేశ సమైక్యతకు ఏ విధంగా తోడ్పడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించే విధంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని స్పష్టం చేశారు. పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పంటల సాగు కోసం పెట్టిన ప్రతి పైసా కోల్పోయి, సర్వస్వం కోల్పోయే పరిస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలో ధాన్యం కంటే తాలు మాత్రమే మిగిలిందన్నారు. పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయం సరిపోదని బీవీ రాఘవులు అన్నారు.
ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించాలి
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు అత్యవసరమని రాఘవులు స్పష్టం చేశారు. గత చట్టం వల్ల గ్రామీణ ప్రజలకు పనులు లభించేవని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పంట నష్టాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధి హామీ పనులు చేపట్టాలని కోరారు. తెలంగాణలో 93 లక్షల మంది ఓట్లను తొలగించారని రాఘవులు తెలిపారు. ఓటర్ల జాబితాల రూపకల్పనలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, తదితరులు ఉన్నారు.





కామెంట్లు (0)