Magazines

మతమౌఢ్యాన్ని తిప్పికొట్టాలి

1 గంట క్రితం

Religious fanaticism must be reversed.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 3 నిమిషాల చదవడం

మూఢ న‌మ్మ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలి

జేవీవీ రాష్ట్ర మహాసభలో ఎంపీ మల్లు రవి పిలుపు

బలమైన పీపుల్స్ సైన్స్ ఉద్య‌మం రావాలి : మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌


​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మధ్యయుగాల నాటి మత మౌఢ్యాన్ని సజీవంగా ఉంచేందుకు మూఢనమ్మకాలు, సంస్కృతీ, సాంప్రదా యాల పేరిట జరుగుతున్న కుట్రలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పార్లమెంట్‌ ‌సభ్యులు మల్లు రవి పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌‌ హైటెక్‌‌సిటీలోని సెంటర్‌ ‌ఫర్‌ ‌కల్చరల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ‌ట్రైనింగ్‌(‌సీసీఆర్‌‌టీ)లో శనివా రం ప్రారంభమైన జ‌న విజ్ఞాన వేదిక (జేవీవీ) తెలంగాణ 6వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలోని కొన్ని వర్గాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు లేని భయాలను సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికీ తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో నీటి వాడకం, దేవాలయాలు, బడుల్లో ప్రవేశాలపై వివక్ష కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు తాకారని... ఆ నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేస్తున్న వైనాన్ని అన్ని వర్గాలు ప్రశ్నించాలన్నారు. ఈ చర్యలు నేరమైనప్పటికీ అధికారులు, రాజకీయ నాయకులు తమ పరిధులకు లోబడి కట్టడి చేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అసాంఘీక చర్యలను జేవీవీ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పెండ్లి, చావులు అట్టడుగు వర్గాల ప్రజలకు భారంగా మారితే కొన్ని వర్గాలకు ఉపాధిగా మారిందని ఎద్దేవా చేశారు. సాంప్రదాయం, వారసత్వం పేరిట జరుగుతున్న ఈ తంతుకు ఫుల్‌స్టాఫ్‌ ‌పెట్టాల్సిన అవసరముందన్నారు. అనాధిగా వస్తున్న ఈ ఆచారాల నుండి ప్రజలను ఒక్క సారే దూరం చేయడం సాధ్యం కాదనీ, పెండ్లి, చావులకు ప్రత్యామ్నాయ తంతును చూపాలని కోరారు. సైన్స్‌‌ను ప్రచారం చేస్తున్న మనం నిజ జీవితంలో దాన్ని పాటించాలని సూచించారు.

ప్రజలందరికీ శాస్త్ర, సాంకేతిక రంగాల ఫలాలు అందాలి : 
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌ ‌

అన్ని వర్గాల ప్రజలకు శాస్ర్త, సాంకేతిక రంగాల ఫలాలు అందాలంటే బలమైన పీపుల్స్‌ ‌సైన్స్‌ ఉద్యమం రావాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌ అన్నారు. శంషాబాద్‌‌కు కూతవేటు దూరంలో ఉన్న కేశంపేట గ్రామంలోని చెరువును దయ్యం ఆవహించిందని ఊరు ఊరంతా ఆ నీటిని తాగేందుకు భయపడ్డారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు తెలంగాణలో ఇంకా పునరావృతం కావడం సైన్స్‌ ‌ప్రచారాన్ని మరింతంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తోందన్నారు. సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకుంటూనే, సంస్కృతీ, సాంప్రదాయాలు, మతం, కులం పేరిట జరుగుతున్న వివక్షపై పోరాడాలని సూచించారు. గుజరాత్‌‌లో కృత్రిమ సూర్యున్ని సృష్టిస్తున్న ఇండియా, మధ్యప్రదేశ్‌‌లో కుల హత్యలకు వేదికంగా మారుతోందన్నారు. ఈ వ్యత్యాసం ఎందుకు పెరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి గొప్ప పేరుతెచ్చిన పీవీ.సింధూ ఆటతీరు, సాధించిన మెడల్స్‌‌ను కాకుండా ఆమె కులమేంటని గూగుల్‌‌లో వెతకడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇలాంటి భావజాలం నుంచి ప్రజలను బయటకు తీసుకు రావాలన్నారు.

సైన్స్‌‌కు వ్యతిరేకంగా విష ప్రచారం : గ్రంథాలయాల చైర్మెన్‌ ‌మహ్మద్‌ ‌రియాజ్‌

దేశంలో గత నాలుగు దశాబ్దాలుగా సైన్స్‌‌కు వ్యతిరేకంగా విష ప్రచారం జరుగుతోందని తెలంగాణ గ్రంథాలయాల చైర్మెన్‌ మహ్మద్‌ ‌రియాజ్‌ ‌ఆందోళన వ్యక్తం చేశారు. క్రీస్తుకు పూర్వమే మతం పేరిట జరిగిన ఆకృత్యాలను నిలదీసిన బుద్దుని వారసత్వాన్ని బతికించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో సైన్స్‌ ‌గొప్పతనం, ఆవశ్యకతపై విస్తృతంగా రచనలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిమ్స్‌ ‌మాజీ డైరెక్టర్‌ ‌దాసరి ప్రసాదరావు, ప్రముఖ శాస్ర్తవేత్త, నిన్‌ ‌డైరెక్టర్‌ ‌మహతాబ్‌ ఎస్‌ ‌బామ్జీ, సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ ‌సీహెచ్‌.మోహన్‌‌రావు, హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్మిటీ స్టూడెంట్‌ ‌యూనియన్‌ అధ్యక్షురాలు దిల్షాద తదితరులు తమ సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు చెలిమెల రాజెశ్వర్‌, ప్రొఫెసర్‌ ‌రామచంద్రయ్య, జేవీవీ ఉపాధ్యక్షులు బీఎన్‌.రెడ్డి, కట్ట సత్యప్రసాద్‌, జితేందర్‌, రాష్ర్ట కార్యదర్శులు ఎం.శ్రీనివాస్‌, ఎస్‌‌పీ.లింగస్వామి, ఆర్‌.వరప్రసాద్‌, ప్రొఫెసర్‌ ‌లక్ష్మారెడ్డి ఇతర ఆఫీస్‌ ‌బేరర్లు పాల్గొన్నారు. కాగా ఆదివారం కూడా ఈ మహాసభ కొనసాగనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్