ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతుంటే జీడీపీ పెరిగిందని గొప్పలేంటి?
అణచివేసే కొద్దీ అందోళనలు తీవ్రతరం : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్
సర్ ముసుగులో ఆయా రాష్ర్టాల్లో అధికారంలోకి బీజేపీ
మోడీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం
సర్‌ను వెనక్కి తీసుకోవాలి..జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాల్సిందే
దేశసమైక్యతకు భంగం కలిగిస్తున్న కమలం : బీవీ రాఘవులు
తెలంగాణకు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని అధికార పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసి, ప్రజాపోరాటాలను ఉధృతం చేయాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామిక హక్కులను కాపాడటానికి, ప్రజల జీవనోపాధిని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు కదలాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతితో కలిసి విజయరాఘవన్ మీడియాతో మాట్లాడారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మైనార్టీలు, దళితులు, బీసీల మద్దతు లేక బీజేపీ తన సంపూర్ణ మెజార్టీని కోల్పోయిందని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తన రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి సర్ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది నిజమైన ఓటర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగించే కుట్రకు మోడీ సర్కారు ఒడిగట్టిందని విమర్శించారు. ఒక్క ఢిల్లీలోనే 35 శాతం ఓట్లు గల్లంతయ్యాయనీ, తొలగించిన పేర్లను తిరిగి నమోదు చేసుకోవడానికి పౌరులకు నాలుగైదేండ్లు పడుతుందనీ, ఇది ఓటర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు. ఓట్లు కోల్పోయిన వారు ప్రభుత్వ పథకాలకు కూడా దూరమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.
బెంగాల్‌లో ఓట్ల తొలగింపు వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఓవైపు దేశంలో నిత్యావసర ధరలు పెరిగి సామాన్య ప్రజలు అల్లాడుతుంటే జీడీపీ పెరిగిందని బీజేపీ సర్కారు గొప్పలకు పోవడం విడ్డూరంగా ఉందన్నారు. జీడీపీ పెరుగుదల ప్రయోజనం పెద్ద కార్పొరేట్ సంస్థలకే దక్కుతున్న తీరును వివరించారు. అదే సమయంలో సామాన్య ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకీ పడిపోతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. ఉపాధి హామీ పనులు కుదించడంతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత పడిపోయాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పోతున్నదనీ, వాటి పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నదని విమర్శించారు. ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ప్రహసనంగా మారుస్తోందని దుయ్యబట్టారు.కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో యువజన, విద్యార్థి సంఘాలు జరుపుతున్న శాంతియుత నిరసనలపై అధికారులు తీవ్రంగా దాడి చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ, కలకత్తా, ముంబై వంటి ప్రధాన నగరాల్లో విపక్షాల భాగస్వామ్యంతో పోరాట కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను తిప్పికొట్టే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
అణచివేసేకొద్దీ యువత పోరాటాలు తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు.
మోడీ వ్యాఖ్యలు విడ్డూరం: రాఘవులు
దేశ సమైక్యత కోసం కృషి చేయాలని దసరా సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందనీ, దేశ సమైక్యతకు భంగం కలిగిస్తున్నది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర పాలకులేనని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు విమర్శించారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ర్టాల రాజకీయాధికారం తగ్గించడం దేశ సమైక్యత ఎలా అవుతుంది? జనాభా నియంత్రణ పాటించడం ఆ రాష్ర్టాలు చేసిన తప్పా? రాజకీయ లబ్ది కోసం మణిపూర్‌లో మైథిలీ, కుకీల మధ్య గొడవల్ని పెంచిపోషిస్తున్నది బీజేపీ కాదా? 375 అధికరణ రద్దు చేసింది మీరే కదా? ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం పోయేలా చేస్తున్నది మోడీ సర్కారు కాదా? ఫామ్ 6 పేరుతో ఓటర్ల తొలగింపు కుట్ర చేస్తున్నది బీజేపీ నేతలు కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మన దేశ పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే బ్యాంకును విదేశీ శక్తులకు కట్టబెట్టడం దారుణమని విమర్శించారు. ప్రధాని మోడీ తన ప్రసంగాల్లో పేర్కొంటున్న అంశాలు, ఆచరణ విధానాలు దేశ సమైక్యతకు పెను ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై మిగతా ఇద్దరు కమిషనర్లు సైతం తీవ్ర అభ్యంతరాలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సుమారు 64 లక్షల మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించడం ప్రజాస్వామ్యంపై జరిగిన అత్యంత హేయమైన దాడిగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ‘ఫారం 6’ స్థానంలో ‘ఫారం 4’'ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మోడీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలతో ఎన్‌డీఏలోని భాగస్వామ్య పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
మోడీ సర్కారు అప్రజాస్వామిక విధానాలను ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీలన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమస్య తీవ్రత దృష్ట్యా ప్రాంతీయ పార్టీలైన బీఆర్‌ఎస్ వంటి పార్టీలకు కూడా బాధ్యత ఉందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఈసీ కుట్రలను తిప్పికొట్టడానికి సీపీఐ(ఎం) తరఫున ఉమ్మడి ఐక్య కార్యక్రమాలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
తమతో కలిసి రాకుంటే బీఆర్‌ఎస్ విడిగానైనా ఓటర్ల తొలగింపుపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గత స్థానిక ఎన్నికల్లో వైసీపీ చేసినట్టుగా ఇప్పడు టీడీపీ చేస్తున్నదని విమర్శించారు. రాయలసీమతో పాటు జిల్లాల్లో నామినేషన్లను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని విమర్శించారు. నామినేషన్ల అడ్డగింపుపై సీపీఐ(ఎం) శ్రేణులు క్షేత్రస్థాయిలో తీవ్రంగా ప్రతిఘటించాయనీ, భయభ్రాంతులకు గురిచేసిన వారి చేత క్షమాపణలు చెప్పించి మళ్లీ నామినేషన్లు దాఖలు చేయించిన ఉదంతాలను ప్రస్తావించారు.
కరువు నష్ట నివారణ చర్యలు చేపట్టాలి : జాన్‌వెస్లీ
ఎల్‌నినో వల్ల తెలంగాణలో తీవ్ర కరువు ఛాయలు ఏర్పడ్డాయనీ, నష్ట నివారణ చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపక్రమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరుతడి పంటలు సాగు చేసే రైతుల నుంచి పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని కోరారు.
ఇప్పటికే వేసిన పంటలను కాపాడేందుకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని సూచించారు. రేషన్‌కార్డుపై ఒక్కో వ్యక్తికి 12 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బియ్యం ధరల్ని నియంత్రించాలని రాష్ట్ర సర్కారుకు సూచించారు. కరువు నేపథ్యంలో ఉపాధి హామీ పనుల్ని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాను రెట్టింపు చేసి ఇవ్వాలనీ, రైతుల రుణాలను మాఫీ చేయాలని కోరారు. రాష్ట్రంలో భూ ఆక్రమణలను నివారించి సమగ్ర సర్వే చేయించాలనీ, ప్రభుత్వ భూములను వెలికి తీసి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలనీ, లేనిపక్షంలో యాజమాన్యాలతో పిల్లలకు సర్టిఫికెట్లు ఇచ్చేలానైనా చూడాలని విజ్ఞప్తి చేశారు. పేద పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేయొద్దని విన్నవించారు. దసరా ఉత్సవాల్లో కుల దురహంకార చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.







కామెంట్‌లు (0)