Magazines

స్థానాలు మూడు..ఆశావ‌హులెంద‌రో...

1 గంట క్రితం

Three seats..
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 2 నిమిషాల చదవడం

గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల‌పై అధికార పార్టీలో హ‌డావుడి

సీఎం, పీసీసీ చీఫ్‌ల చుట్టూ ఆశావ‌హుల ప్ర‌ద‌క్షిణ‌లు

ప‌ద్మ‌శాలీల‌కు ఒక స్థానం కేటాయిస్తామంటూ సిరిసిల్ల 
స‌భ‌లో ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న

దీంతో ఆ సామాజిక‌వ‌ర్గ 
నేత‌ల్లో గంపెడాశ‌లు

ఎస్సీల నుంచి పోటాపోటీ

రేసులో దొమ్మాటి, చార‌కొండ‌, 
సంప‌త్ కుమార్‌, మాన‌వ‌తారాయ్


న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్
అక్క‌డ ఉన్న‌ది మూడే మూడు స్థానాలు.. కానీ ఎమ్‌సెట్‌, నీట్ ప‌రీక్ష‌ల కంటే ఎక్కువ పోటీ నెల‌కొంది. రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ కోటా కింద ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో మూడు సీట్లు ఖాళీ కాబోతున్న సంగ‌తి విదిత‌మే. బీఆర్ ఎస్ నుంచి ఆ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఉన్నగోర‌టి వెంక‌న్న‌, బొగ్గార‌పు ద‌యానంద్‌, బ‌స్వ‌రాజు సార‌య్య ప‌ద‌వీకాలం న‌వంబ‌రు 14న ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆ మూడూ అధికార కాంగ్రెస్‌కే ద‌క్క‌నున్నాయి. దీంతో ఆశావ‌హుల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ నేత‌లంద‌రూ త‌మ‌కు ఒక్క‌సారి ఛాన్స్ ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఇంటి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. కాగా ఇటీవ‌ల సిరిసిల్లలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ సంద‌ర్భంగా ప‌ద్మ‌శాలీల‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీంతో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు విప‌రీత‌మైన ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే, మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మెన్ ఈరావ‌త్రి అనిల్ పేరు ప్ర‌ముఖంగా వినబ‌డుతోంది. ఇదే స‌మ‌యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్ట‌ర్ పవిత్ర వాణి పేరు తెర పైకి వ‌చ్చింది. ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో సీఎం ఉన్న‌ట్టు అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. హ్యాండ్లూమ్ కార్పొరేష‌న్ చైర్మెన్‌, టీపీసీసీ అధికార ప్ర‌తినిధి దూడం వెంక‌ట‌ర‌మ‌ణ కూడా రేసులో ఉన్న‌ట్టు తెలిసింది. ఆయ‌న ఇప్ప‌టికే పీసీసీ చీఫ్‌ను, సీఎంను క‌లిసి త‌న‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇవ్వాలంటూ కోరారు. వీరితోపాటు సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కూడా త‌న వంతు ప్రయత్నాలను ప్రారంభించారు.

కొద్ది రోజుల క్రితం సిరిసిల్ల‌లో సీఎం నిర్వ‌హించిన స‌భ స‌క్సెస్ కావ‌టంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించార‌ని గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాలు వివ‌రించాయి. అందువ‌ల్ల సీఎం దృష్టిలో ఆయ‌న పేరు కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. మిగతా రెండు స్థానాలలో ఒకటి ఎస్సీ సామాజిక త‌ర‌గ‌తికి, మరొకటి ఓసీ సామాజిక త‌ర‌గ‌తికి కేటాయించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఓసీ సామాజిక త‌ర‌గ‌తి నుంచి అభ్యర్థి పేరు దాదాపు ఖ‌రారైనట్టు వినికిడి. ప్రభుత్వ సలహాదారుడు హ‌ర్క‌ర వేణుగోపాల్ ను మండ‌లికి పంపేందుకు సీఎం యోచిస్తున్నారు. ఇక ఎస్సీల నుంచి వరంగల్ జిల్లాకు చెందిన దొమ్మాటి సాంబయ్య, ఉమ్మడి మహబూబ్‌న‌గ‌ర్ జిల్లా నేత‌, ప్ర‌స్తుత విద్యా క‌మిష‌న్ స‌భ్యుడు చారకొండ వెంకటేష్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. కాగా దొమ్మాటి, చారుకొండ‌ల పేర్లే ఏఐసీసీ ప‌రిశీన‌లో ఉన్నాయ‌ని అధికార పార్టీకి చెందిన ఒక నేత వెల్ల‌డించారు. వీరిద్ద‌రిలో కూడా మొద‌టి నుంచి సీఎంను అంటిపెట్టుకుని ఉన్న చార‌కొండ‌కే ఎక్కువ ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. విద్యా కమిషన్ సభ్యునిగా ఆయ‌న ప‌ద‌వీకాలం ఈనెల 29తో ముగియ‌నుంది. గ‌తంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ ను కూడా ఆశించిన వెంకటేశ్‌...ఈసారి సీఎం ఎలాగైనా ఎమ్మెల్సీగా త‌న‌కు అవ‌కాశం క‌ల్పిస్తార‌నే ధీమాతో ఉన్నారు. కాగా టీపీసీసీ అధికార ప్ర‌తినిధులు కోటూరి మాన‌వ‌తారాయ్‌, లింగం యాద‌వ్‌లు కూడా ఎమ్మెల్సీ స్థానంపై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ఉన్న‌త విద్యావంతుల‌మైన త‌మ‌ను మేధావి వ‌ర్గం, సామాజిక త‌ర‌గతుల వారీగా ప‌రిగ‌ణించి శాస‌న‌మండ‌లికి పంపిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాన్ని వారు వ్య‌క్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్