కూర చిదంబరం తెలుగు సీనియర్ కథకుల్లో ఒకరు. ఇదివరకు వీరు మూడు కథా సంపుటాలను, ఒక వచన కవిత్వ సంపుటిని, రెండు వ్యాస సంపుటాలను ప్రచురించారు. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరిని సన్మానించింది. వీరు చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తూ సమాజానికి తనకు చేతనైనంత సేవను చేస్తున్నారు. ఆర్థికరంగం, పరిశ్రమల రంగాలను గూర్చి వీరు పలు వ్యాసాలు రాశారు. కేంద్ర బడ్జెట్ వెలువరించినప్పుడు దాని గూర్చిన చర్చలో పాల్గొని ప్రజలకు ఆ బడ్జెట్లోని లోటుపాట్లను గూర్చి విశ్లేషించి చెప్పేవారు. నాటకరంగం మీద కూడా వీరికి ఆసక్తి ఉంది. వీరి శ్రవ్య నాటికలు కొన్ని ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యాయి. ప్రస్తుతం ఆయన రచించిన 25 కథలతో ఈ కొత్త కథా సంకలనాన్ని వెలువరించారు. ఇందులోని కథలన్నీ చాలా చిన్న కథలే. కొన్ని మరీ చిన్నగా ఉండి గల్పికల్లాగ రూపొందాయి అనిపిస్తుంది. ప్రతి కథలోనూ ఒక మంచి పాయింట్ ఉంది. కథలో మంచి పాయింట్ ఉండటం మంచి కథల లక్షణమని ప్రఖ్యాత విమర్శకుడు రా.రా. (రాచమల్లు రామచంద్రారెడ్డి) అంటుండేవాడు. ఆ రకంగా ఈ కథలన్నీ మంచి కథలే. కథ చెప్పిన విధానం కూడా బావుంది. అన్నీ కథల్లోనూ పఠనీయత బావుంది. భవిష్యత్తులో చిదంబరం ఇంకా మంచి కథలు రాస్తారని నమ్మకం నాకుంది.
అంపశయ్య నవీన్







కామెంట్‌లు (0)