నవతెలంగాణ - హైదరాబాద్ :అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలాయి. శుక్రవారం సాయంత్రం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు బోయింగ్ 737 విమానాల రెక్కలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
డల్లాస్ వెళ్లాల్సిన ఫ్లైట్ 638, చికాగో వెళ్లాల్సిన ఫ్లైట్ 2152 రన్‌వే వద్ద టేకాఫ్ కోసం వేచి ఉండగా, ట్యాక్సీయింగ్ సమయంలో రెక్కల చివరలు తగిలాయి. దీంతో ఓ విమానం రెక్కకు చెందిన వింగ్‌లెట్ భాగం విరిగి నేలపై పడింది. పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు.
అప్రమత్తమైన అధికారులు రెండు విమానాలను గేట్ల వద్దకు వెనక్కి పంపించి తనిఖీలు నిర్వహించారు. అనంతరం మరమ్మతుల కోసం విమానాలను సర్వీసు నుంచి తొలగించినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ప్రయాణికులను ఇతర విమానాల్లో గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేసింది. థ్యాంక్స్‌గివింగ్ రద్దీ సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు చేపట్టింది.







కామెంట్‌లు (0)