Magazines

సిరీస్‌‌పై కన్నేసి..!

5 గంటల క్రితం

series
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 3 నిమిషాల చదవడం

విజయమే లక్ష్యంగా టీమ్‌ ఇండియా

భారత్‌, న్యూజిలాండ్‌ ‌నాల్గో వన్డే నేడు

ఉదయం 7.30 నుంచి సోనీనెట్‌‌వర్క్‌‌లో


వరుణుడి రాకతో వన్డే సిరీస్‌‌లో తొలి మూడు మ్యాచ్‌‌లు పూర్తిగా సాగలేదు. అయినా, 2-0తో సిరీస్‌‌లో తిరుగులేని ఆధిక్యంలో నిలిచిన భారత్‌ ‌నేడు సిరీస్‌ ‌విజయంపై కన్నేసింది. మౌంట్‌ ‌మాంగనుయ్‌‌లో వర్షం సూచనలు లేకపోవటంతో విజయమే లక్ష్యంగా భారత్‌ ‌బరిలోకి దిగుతోంది. శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌టెస్టు సిరీస్‌‌కు సన్నద్ధం అవుతుండగా.. చివరి రెండు వన్డేలకు శ్రేయస్‌ అయ్యర్‌ ‌సారథ్యం వహిస్తాడు.


మౌంట్‌ ‌మాంగనుయ్‌

సొంతగడ్డపై న్యూజిలాండ్‌ ‌వన్డే సిరీస్‌‌ను చివరగా ఏడేండ్ల క్రితం భారత్‌కే కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌‌లను కివీస్‌ ‌గెల్చుకుంది. ఇన్నేండ్ల తర్వాత మళ్లీ భారతే ఆ జట్టు జైత్రయాత్రకు బ్రేక్‌ ‌వేసింది. అయితే, సిరీస్‌ ‌నెగ్గే అవకాశాలు లేకపోయినా కనీసం కోల్పోకుండా ఉండేందుకు ఆతిథ్య న్యూజిలాండ్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. చివరి రెండు వన్డేల్లో నెగ్గి సమం చేయాలనే న్యూజిలాండ్‌ ‌భావిస్తుండగా.. నేడు మౌంట్‌ ‌మాంగనుయ్‌‌లో విజయంతో సిరీస్‌‌ను సొంతం చేసుకోవాలని టీమ్‌ఇండియా ఎదురుచూస్తోంది. భారత్‌, న్యూజిలాండ్‌ ‌నాల్గో వన్డే నేడు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

​శ్రేయస్‌‌కు పరీక్ష!

ఐదో వన్డే, తొలి టెస్టుకు మూడు రోజుల విరామమే ఉంది. దీంతో టెస్టు కెప్టెన్‌ ‌శుభ్‌‌మన్‌ ‌గిల్‌, యువ పేసర్‌ అన్షుల్‌‌ కాంబోజ్‌ ‌సహా సహాయక సిబ్బంది టెస్టు క్యాంప్‌‌లో చేరారు. వైస్‌ ‌కెప్టెన్‌ ‌శ్రేయస్‌ అయ్యర్‌ ‌తొలిసారి వన్డేలో సారథ్య పగ్గాలు అందుకోనున్నాడు. తొలి రెండు వన్డేల్లో శ్రేయస్‌ అయ్యర్‌ ‌షార్ట్‌ ‌బాల్స్‌‌కు ఇబ్బంది పడటంతో.. కివీస్‌ ‌పేసర్లు మరోసారి అయ్యర్‌‌ను ఇరకాటంలో పడేసేందుకు ఆ అస్ర్తం సంధించేందుకు సిద్ధమవుతారు. మరి, ఈ సవాల్‌‌కు అయ్యర్‌ ఎలా సిద్ధమవుతాడో చూడాలి. ఓపెనర్‌‌గా గిల్‌ ‌స్థానంలో ఇషాన్‌ ‌కిషన్‌ ఆడనుండగా.. కెఎల్‌‌ రాహుల్‌ ‌స్థానంలో రుతురాజ్‌ ‌గైక్వాడ్‌ ‌తుది జట్టులోకి రానున్నాడు. పేసర్‌ ‌మహ్మద్‌ ‌సిరాజ్‌‌కు అవకాశం లభిస్తుందా? లేదా అనేది చూడాలి. నమన్‌ ‌ధీర్‌, అక్షర్‌ ‌పటేల్‌ ఆల్‌‌రౌండర్లుగా సత్తా చాటాలని భావిస్తున్నారు. అకిబ్‌ ‌నబి, అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌, గుర్నూర్‌ ‌బరార్‌‌లు పేస్‌ ‌బాధ్యతలు పంచుకోనున్నారు. రోహిత్‌ ‌శర్మ, విరాట్‌ ‌కోహ్లికి ఇక్కడ మంచి రికార్డు ఉంది. అభిమానులు ఈ జోడీ నుంచి భారీ ఇన్నింగ్స్‌‌లు ఆశిస్తున్నారు.

ప్రతిఘటిస్తారా?

వరుస సిరీస్‌ ‌విజయాలకు బ్రేక్‌ ‌పడినా, రికార్డును నిలుపుకునేందుకు కివీస్‌‌కు అవకాశం ఉంది. అయితే, టెస్టు సిరీస్‌ ‌నేపథ్యంలో టామ్‌ ‌లేథమ్‌, డార్లీ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్‌, నాథన్‌ ‌స్మిత్‌, హెన్రీ నికోల్స్‌ ‌జట్టును వీడారు. బ్లెయిర్‌ ‌టిక్‌‌నర్‌ ‌కంకషన్‌‌తో అందుబాటులో లేడు. దీంతో మిచెల్‌ ‌హే, డీన్‌ ‌ఫాక్స్‌‌క్రాఫ్ట్‌, నిక్‌ ‌కెల్లీ, బ్రెట్‌ ‌రాండెల్‌‌లు జట్టులోకి వచ్చారు. ఫిన్‌ అలెన్‌, టిమ్‌ ‌సీఫర్ట్‌, విల్‌ ‌యంగ్‌ ‌తొలి రెండు వన్డేల్లో నిరాశపరిచారు. రాణించిన గ్లెన్‌ ‌ఫిలిప్స్‌, డార్లీ మిచెల్‌ ‌టెస్టు సన్నద్ధతలో నిమగ్నమయ్యారు. దీంతో బ్యాటింగ్‌ ‌లైనప్‌ ‌బలహీనంగా కనిపిస్తోంది. పేసర్లు కైల్‌ ‌జెమీసన్‌, డాకబ్‌ ‌డఫ్ఫీ, మాట్‌ ‌ఫిషర్‌‌లతో కలిసి కెప్టెన్‌ ‌మిచెల్‌ ‌శాంట్నర్‌ ‌బౌలింగ్‌ ‌బాధ్యతలు పంచుకోనున్నాడు.

పిచ్‌, వాతావరణం

న్యూజిలాండ్‌ అంతటా గత వారం భారీ వర్షాలు కురిశాయి. మ్యాచ్‌‌కు ముందు మౌంట్‌ ‌మాంగనుయ్‌‌లోనూ నిలకడగా వర్షాలు పడ్డాయి. మ్యాచ్‌ ‌రోజు వర్షం సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. అభిమానులకు ఇది శుభవార్తే. కానీ మ్యాచ్‌‌కు ముందు వర్షంతో పిచ్‌‌ను సిద్ధం చేసేందుకు క్యూరేటర్‌‌కు సమయం చిక్కిందా? లేదా? అనేది అనుమానంగానే ఉంది. ఇక్కడ జరిగిన ఆఖరు నాలుగు డే నైట్‌ ‌వన్డేల్లో రెండో ఇన్నింగ్స్‌‌లో బ్యాటింగ్‌‌ చేసిన జట్టు గెలుపొందింది. టాస్‌ ‌నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ చేసేందుకు మొగ్గు చూపవచ్చు!.

తుది జట్లు (అంచనా)

భారత్‌ : రోహిత్‌ ‌శర్మ, ఇషాన్‌ ‌కిషన్‌ (‌వికెట్‌‌కీపర్‌), విరాట్‌ ‌కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ (‌కెప్టెన్‌), రుతురాజ్‌ ‌గైక్వాడ్‌, నమన్‌ ‌ధీర్‌, అక్షర్‌ ‌పటేల్‌, అకిబ్‌ ‌నబి, కుల్‌‌దీప్‌ ‌యాదవ్‌/‌మహ్మద్‌ ‌సిరాజ్‌, గుర్నూర్‌ ‌బరార్‌, అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌.

న్యూజిలాండ్‌ : ఫిన్‌ అలెన్‌, టిమ్‌ ‌సీఫర్ట్‌ (‌వికెట్‌ ‌కీపర్‌), విల్‌ ‌యంగ్‌, నిక్‌ ‌కెల్లీ, మిచెల్‌ ‌హే, మైకల్‌ ‌బ్రాస్‌‌వెల్‌, మిచెల్‌ ‌శాంట్నర్‌ (‌కెప్టెన్‌), డీన్‌ ‌ఫాక్స్‌‌క్రాఫ్ట్‌, కైల్‌ ‌జెమీసన్‌, మాట్‌ ‌ఫిషర్‌, జాకబ్‌ ‌డఫ్ఫీ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్