- రైతాంగ సమస్యల పరిష్కారం ఐక్య పోరాటాలతోనే సాధ్యం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి పిలుపు
- మహాసభల విజయవంతం కోరుతూ సత్తుపల్లిలో మోటారు సైకిల్ ర్యాలీ
నవతెలంగాణ-సత్తుపల్లి
ఈ నెల 15, నుంచి 18వ తేదీ వరకు నల్లగొండ పట్టణంలో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి కోరారు. మహాసభల విజయవంతం కోరుతూ గురువారం సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ మోటారు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల భవనం) నుంచి ప్రధాన రహదారి మీదుగా పాత సెంటర్ వరకు, అక్కడి నుంచి బస్టాండ్ రింగ్ సెంటర్ వరకు సాగింది. అనంతరం జరిగిన సభలో భారతి మాట్లాడారు. రైతాంగ సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం రైతులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతుల సంపూర్ణ రుణ విమోచన వంటి కీలక డిమాండ్ల సాధనకు పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. నల్లగొండలో జరగబోయే 36వ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగ సమస్యలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్ పోరాటాలకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ మహాసభలకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ మోటారు సైకిలు ర్యాలీలో సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, రూరల్ మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, రైతు సంఘం మండల అధ్యక్షులు మోరంపూడి వెంకటరావు, నాయకులు చావా రమేష్, బాషా, భాస్కర్, కువ్వారపు లక్ష్మణరావు, తడికమళ్ల రామకృష్ణ, బండి వేలాద్రి, పంతంగి నాగరాజు, కొప్పుల స్వామి, చెరుకూరి శ్రీనివాస్, శివాజీ, బలగాని శ్రీను, సీతయ్య, బాణావత్ రవి, కుమార్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)