- పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
- అశ్వారావుపేట ఎస్హెచ్ఓ బొగ్గుల సాయి కిశోర్ రెడ్డి
నవతెలంగాణ - అశ్వారావుపేట
ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని అశ్వారావుపేట ఎస్హెచ్ఓ బొగ్గుల సాయి కిశోర్ రెడ్డి అన్నారు. సైబర్ మోసాలు, మహిళలపై వేధింపులు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ‘నవతెలంగాణ’తో ఆయన ముఖాముఖీ గా మాట్లాడారు.
నవతెలంగాణ: పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి?
ఎస్హెచ్ఓ: రోడ్డు ప్రమాదాలు, కుటుంబ కలహాలు, భూవివాదాలు, దొంగతనాలు, మహిళల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు, సైబర్ నేరాలు మా దృష్టికి వస్తుంటాయి. ఫిర్యాదుల స్వభావాన్ని బట్టి విచారణ చేపట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం.
నవతెలంగాణ: నేరాల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
ఎస్హెచ్ఓ: నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నాం. ఘటనలు జరిగినప్పుడు ఆధారాలను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించేందుకు కృషి చేస్తున్నాం. సీసీటీవీ కెమెరాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
నవతెలంగాణ: మహిళలు, బాలికల భద్రతకు తీసుకుంటున్న చర్యలేమిటి?
ఎస్హెచ్ఓ:మహిళలపై వేధింపులు, గృహహింస, వెంటపడటం, ఆన్లైన్ వేధింపులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. బాధితుల ఫిర్యాదులను గోప్యత తో స్వీకరించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాలికలకు వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించడం కూడా ముఖ్యం. అత్యవసర పరిస్థితుల్లో 112 కు ఫోన్ చేయవచ్చు.
నవతెలంగాణ: సైబర్ మోసాల నుంచి ప్రజలు ఎలా రక్షణ పొందాలి?
ఎస్హెచ్ఓ: కేవైసీ అప్డేట్, పెట్టుబడులు, ఉద్యోగాలు, ట్రేడింగ్ పేర్లతో మోసాలు జరుగుతున్నాయి. పోలీసులమని చెప్పి అరెస్టు చేస్తామంటూ డబ్బులు వసూలు చేసే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీ లను ఎవరికీ చెప్పకూడదు. తెలియని లింకులను తెరవకూడదు. మోసానికి గురైతే వెంటనే 1930 కు ఫోన్ చేసి, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.
నవతెలంగాణ: గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను ఎలా అరికడుతున్నారు?
ఎస్హెచ్ఓ:విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిఘా, తనిఖీలు, దర్యాప్తు చేపడుతున్నాం. అవసరమైనప్పుడు సంబంధిత ప్రత్యేక విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నాం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేందుకు విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లల సమస్యలను గుర్తించి, అవసరమైతే వైద్య సహాయం అందేలా చూడాలి.
నవతెలంగాణ: రోడ్డు ప్రమాదాల నివారణ, రాత్రి గస్తీ ఎలా సాగుతోంది?
ఎస్హెచ్ఓ:ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అవసరమైన చర్యల కోసం సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం. మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం, హెల్మెట్, సీటుబెల్ట్ నిబంధనల ఉల్లంఘనల పై చర్యలు తీసుకుంటున్నాం. రాత్రివేళల్లో ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాల వద్ద గస్తీ నిర్వహిస్తున్నాం.
నవతెలంగాణ: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి విధానం అనుసరిస్తున్నారు?
ఎస్హెచ్ఓ:ప్రతి ఫిర్యాదును పరిశీలించి, నేర స్వభావాన్ని బట్టి కేసు నమోదు, దర్యాప్తు వంటి చర్యలు చేపడతాం. కుటుంబ వివాదాల్లో చట్టం అనుమతించే పరిధిలో పరిష్కార మార్గాలను సూచిస్తాం. తీవ్రమైన నేరాల్లో చట్టపరమైన చర్యలకు ప్రాధాన్యత ఇస్తాం. బాధితులకు న్యాయం అందించడం మా బాధ్యత.
నవతెలంగాణ: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు ఎలాంటి బాధ్యత వహించాలి?
ఎస్హెచ్ఓ: పండుగలు, జాతరలు, మతపరమైన కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల సమయంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తాం. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకుండా, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలి.
నవతెలంగాణ: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు మీ సందేశం ఏమిటి?
ఎస్హెచ్ఓ:దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం. వారి త్యాగాలకు నిజమైన నివాళి అర్పించాలంటే చట్టాలను గౌరవిస్తూ, సమాజంలో ఐక్యతను కాపాడాలి. మహిళలను గౌరవించడం, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం, రహదారి భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందిస్తూ, శాంతియుత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. పోలీస్ అమరవీరులందరికీ నా హృదయపూర్వక నివాళులు.







కామెంట్లు (0)