Magazines

తిరస్కరణలే విజయానికి తొలి మెట్లు.. జే.కే. రౌలింగ్

4 గంటల క్రితం

Rejections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 4 నిమిషాల చదవడం

మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఓటమి నిజంగా ఓటమేనా? ప్రతి తిరస్కరణ మన ప్రయాణానికి ముగింపేనా? ప్రతి కన్నీటి చుక్క బలహీనతకు గుర్తేనా? కాదు! కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే అత్యంత చీకటి రోజులే మన భవిష్యత్తులో వెలిగే అద్భుతమైన విజయాలకు పునాదులు వేస్తాయి. మనల్ని కూల్చివేసిన పరిస్థితులే మనలో దాగి ఉన్న అసలైన శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. అలాంటి ఎన్నో కన్నీళ్లను దిగమింగి, ఒంటరితనంతో పోరాడి, పేదరికాన్ని ఎదుర్కొని, పదేపదే తిరస్కరణలు ఎదురైనా తన కలను వదులుకోకుండా ముందుకు సాగిన ఒక మహిళ కథ ఇది. ఒకప్పుడు చేతిలో డబ్బులేక, ఉద్యోగం లేక, తన బిడ్డను పెంచుకుంటూ జీవితాన్ని నెట్టుకురావడానికి కష్టపడిన ఒక సాధారణ మహిళ. తన ఊహాశక్తి, పట్టుదల, నిరంతర శ్రమతో నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న రచయిత్రిగా ఎదిగారు. ఆమె ఎవరో కాదు.. ప్రపంచ ప్రసిద్ధ హ్యారీ పాటర్ సిరీస్ సృష్టికర్త జే.కే. రౌలింగ్.


రౌలింగ్ జులై 31, 1965న ఇంగ్లాండు, గ్లూసెస్టర్‌షైర్ లోని యేట్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి పీటర్ జేమ్స్ రౌలింగ్, తల్లి యానీ. వీరిద్దరూ రాయల్ నేవీ ఉద్యోగస్తులు. మొదటి నుండి ఈమెకు సాహిత్యమంటే ఆసక్తి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె చిన్నతనంలో అనేక పుస్తకాలు చదివారు. ఆరేండ్ల వయసులోనే ‘రాబిన్‌’ అనే కథను రాశారు. యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ మోరే హౌస్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌‌ పూర్వ విద్యార్థి ఆమె. 1990లో ఒక పరిశోధకురాలిగా ఆమె ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో ద్విభాషా కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమెకు హ్యారీ పాటర్ ధారావాహిక గురించిన ఆలోచన వచ్చింది. తర్వాత ఏడేండ్లలో తల్లి మరణం, మొదటి బిడ్డ జననం, మొదటి భర్త నుంచి విడాకులు వంటి ఎన్నో కష్టాలు ఆమె జీవితాన్ని చుట్టుముట్టాయి. తీవ్రమైన పేదరికంలో జీవించాల్సి వచ్చింది. అయినప్పటికీ రచనలపై ఆసక్తిని మాత్రం చంపుకోలేదు.

ఏడు పుస్తకాలుగా...

1997లో ఆమె మొదటి నవల హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ విడుదలైంది. దీని తర్వాత ఆరు భాగాలు విడుదలయ్యాయి. ఆఖరి భాగం హ్యారీపాటరీ అండ్ ది డెత్లీ హాలోస్ 2007లో విడుదలైంది. 2008లో ఫోర్బ్స్ ఆమెను అత్యధిక పారితోషికం అందుకునే రచయిత్రిగా గుర్తించింది. నవలా రచయిత్రిగానే కాక సినిమా, టెలివిజన్ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు అనేక సామాజిక సేవకురాలు కూడా. అన్నింటికంటే ముఖ్యంగా ఈమె 1997 నుంచి 2007 వరకు ఏడు పుస్తకాలుగా ప్రచురితమైన హ్యారీ పోటర్ ఫాంటసీ సిరీస్ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ కాపీలు పైగా అమ్ముడయ్యాయి. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 84 భాషల్లోకి అనువాదం అయ్యాయి. దీని ఆధారంగా పలు చలనచిత్రాలు, వీడియో గేమ్స్ వచ్చాయి. 2012లో వచ్చిన ద క్యాజువల్ వేకన్సీ ఆమె పెద్దల కోసం రాసిన మొదటి రచన.

12 మంది తిరస్కరించినా...

రౌలింగ్‌ ‌జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. జీవితంలో మనం ఏదైనా సాధించాలని ప్రయత్నించినప్పుడు విజయం కంటే ముందుగా ఎదురయ్యేది తిరస్కరణే కావచ్చు. మన ఆలోచనలను ఎవరూ అంగీకరించకపోవచ్చు. మన ప్రతిభను గుర్తించకపోవచ్చు. మనం ఎంతో కష్టపడి చేసిన పనిని ఒక్క క్షణంలోనే తక్కువ చేసి మాట్లాడవచ్చు. అలాంటి సందర్భాల్లో మనసు విరిగిపోతుంది. మనపై మనకే నమ్మకం తగ్గిపోతుంది. అసలు ఈ ప్రయత్నం చేయడం అవసరమా? మనం అనుకున్నది నిజంగా సాధించగలమా? అనే సందేహాలు వెంటాడుతుంటాయి. రౌలింగ్ రాసిన హ్యారీ పాటర్ పుస్తకమే ఇందుకు గొప్ప ఉదాహరణ. ఆమె రాసిన పుస్తకాన్ని ప్రచురించడానికి మొదట్లో 12 మంది ప్రచురణకర్తలు తిరస్కరించారు. అయినప్పటికీ ఆమె తన కలను వదులుకోలేదు. తన రచనపై నమ్మకాన్ని కోల్పోలేదు. చివరకు ఆమె రచనకు ప్రచురణ అవకాశం లభించింది. అదే హ్యారీ పాటర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాఠకులను ఆకట్టుకుంది. ఒక్కసారి ఆలోచించండి.. ఆ 12 తిరస్కరణల తర్వాత ఆమె తన ప్రయత్నాన్ని ఆపేసి ఉంటే, ప్రపంచానికి హ్యారీ పాటర్ అనే అద్భుతమైన సాహిత్య ప్రపంచం పరిచయమయ్యేదా? అందుకే మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి తిరస్కరణను ఒక పాఠంగా తీసుకోండి. ప్రతి వైఫల్యం నుంచి ఏదో ఒకటి నేర్చుకోండి. మీ లోపాలను సరిదిద్దుకోండి. మరింత మెరుగ్గా ప్రయత్నించండి.

పరిస్థితులకు తలవంచక...

మనం అనుకున్నది సాధించాలంటే ప్రతిసారీ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు చేతిలో డబ్బు ఉండదు. మనసుకు ప్రశాంతత ఉండదు. కుటుంబ సమస్యలు వెంటాడుతుంటాయి. బాధ్యతలు భుజాలపై భారంగా మారుతాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనల్ని వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తాయి. ఒకవైపు జీవితాన్ని నెట్టుకురావడమే కష్టంగా ఉంటే, మరోవైపు మన కలలను నిజం చేసుకోవాలనే ఆశ మనసులో మిగిలి ఉంటుంది. అలాంటి సమయంలో చాలామంది తమ కలలను పక్కనపెట్టి, పరిస్థితులకు తలవంచేస్తారు. కానీ నిజమైన పట్టుదల ఉన్నవారు మాత్రం పరిస్థితులు మారిన తర్వాత కష్టపడదామని ఎదురుచూడరు. పరిస్థితులు ఎలా ఉన్నా తమ లక్ష్యం వైపు ఒక్కో అడుగు వేస్తూనే ఉంటారు. జే.కే. రౌలింగ్ జీవితం దీనికి గొప్ప ఉదాహరణ.

కోట్లాది పాఠకులను చేరుకుంది

అనునిత్యం హింసిస్తున్న భర్త నుంచి విడిపోయి, చిన్న పాపతో ఒంటరిగా జీవిస్తూ, ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న సమయంలో కూడా ఆమె తన రచనను ఆపలేదు. ఉద్యోగం లేక, చేతిలో సరిపడా డబ్బు లేక, ఎన్నో వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ హ్యారీ పాటర్ కథను రాయడం కొనసాగించారు. కేఫ్‌లలో కూర్చుని తన చిన్నారి నిద్రపోతుండగా పుస్తకాన్ని రాశారు. హ్యారీ పాటర్ రచనను ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే వరకు రౌలింగ్ ఎన్నో కష్టాలను, తిరస్కరణలను ఎదుర్కొన్నారు. కానీ ఆమె తన రచనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, తన లక్ష్యంపై దృష్టి నిలుపుకుంటూ ముందుకు సాగారు. చివరకు ఆమె కల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాఠకులను చేరుకుంది. అందుకే ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకోకండి. ఎవరో ముందుగా విజయం సాధించారని మీరు వెనుకబడిపోయారని అనుకోకండి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. ప్రతి ఒక్కరి విజయానికి పట్టే సమయం కూడా వేరు.

- కోట దామోదర్, 9391480475


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్