గ్రామసభలను, సర్పంచ్‌లను పక్కనపెట్టి కాంగ్రెస్ నేతల ఏకపక్ష నిర్ణయాలు
పేదలను భయభ్రాంతులకు గురిచేస్తే న్యాయపోరాటం తప్పదు
లాటరీ పద్ధతి లేదా గ్రామసభల ద్వారానే ఇండ్ల ఎంపిక చేపట్టాలి
ఇందిరమ్మ ఇండ్ల అక్రమాలపై 22న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా
ఐదు వామపక్ష, బీఆర్ఎస్ పార్టీల ఐక్య పోరుకు నిర్ణయం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో దారుణమైన అక్రమాలు, తీవ్రమైన రాజకీయ వివక్ష జరుగుతున్నాయని, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లు కేటాయించాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బండారి ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలు, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఏకపక్ష వైఖరికి నిరసనగా ఈ నెల 22న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించబోతున్నట్టు వారు ప్రకటించారు. ఈ ధర్నాలో సర్పంచ్‌లు, వార్డ్ సభ్యులు, పేదలు, ప్రజలు వేలాదిగా పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వ దమన, దుర్మార్గ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మంలోని సుందరయ్య భవన్లో సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చేముందు కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ ఒక్క హామీని పకడ్బందీగా అమలు చేయడం లేదన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారి పత్రాలనే అధికారులు గుడ్డిగా ఆమోదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా పంచాయతీల పరిధిలో కమిటీలు, నిబంధనలు ఉన్నప్పటికీ, అధికారులు ఎంపీడీవోలు, హౌసింగ్ సిబ్బంది ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన జాబితాలనే ఫైనల్ చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన సర్పంచ్‌లను అగౌరవపరుస్తూ వాళ్లు తీర్మానం చేసి ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల లిస్టులను బుట్టదాఖల చేస్తున్నారని విమర్శించారు. క్యాంప్ కార్యాలయాల్లో కూర్చుని, లిస్టులను ఫైనల్ చేస్తుండటంతో అధికారులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని తెలిపారు. ఈ చర్యలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు అన్ని వామపక్ష, బీఆర్ఎస్ పార్టీలతో కలిసి ఐక్య ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో రాజ్యాంగబద్ధమైన గ్రామసభల ప్రాధాన్యతను ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధత లేని ఇందిరమ్మ కమిటీల పేరిట కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సూత్రాలను నిలువునా ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు పార్లమెంటుతో సమానమైన ప్రాధాన్యత ఉందని, కానీ ఈ ప్రభుత్వం సర్పంచ్‌లను, వార్డు మెంబర్లను కనీసం లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరి స్తోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి పేదవానికి ఎలాంటి వివక్ష లేకుండా పథకాలు ఇచ్చామని గుర్తుచేశారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులతో సంతోషించిన ప్రజలకు ఇందిరమ్మ కమిటీల రూపంలో నిరాశే మిగిలిందని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బండి రమేష్, మాదినేని రమేష్, సీపీఐ జిల్లా నాయకులు యర్రా బాబు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బండారి ఐలయ్య, లక్ష్మీ నారాయణ, మాస్‌లైన్ నాయకులు అశోక్, శ్రీనివాస్, సర్పంచ్‌లు ఆవుల నర్సింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)