Magazines

వ్యవసాయ రంగాన్ని రక్షించడమే లక్ష్యం

1 గంట క్రితం

agricultural sector
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 3 నిమిషాల చదవడం

​నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో ఏఐకేఎస్‌ 36వ జాతీయ మహాసభలు

లక్ష మందితో భారీ ప్రదర్శన.. 
300 స్టాళ్లతో వ్యవసాయ 
పరికరాల ప్రదర్శన
​ఆహ్వానసంఘం కార్యాలయం ప్రారంభం

బెలూన్ల ఆవిష్కరణ :
ఆహ్వానసంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి


నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

వ్యవసాయ రంగాన్ని రక్షించడం, రైతాంగ ప్రయోజనాలను కాపాడ‌టం, రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే ఈ మహాసభలో దేశవ్యాప్త రైతాంగ సమస్యలపై చర్చించి, వ్యవసాయ రంగ పరిరక్షణకు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించను‌న్నట్టు తెలిపారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయం దొడ్డి కొమురయ్య భవనంలో మహాసభల ప్రచార బెలూన్లను ఆవిష్కరించి, ఆహ్వాన సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జూలకంటి రంగారెడ్డి మహాసభల లక్ష్యాలు, నిర్వహణ ఏర్పాట్లు, రైతాంగ సమస్యలపై మాట్లాడారు.​


​రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం

​జాతీయ కిసాన్ మహాసభల విజయవంతానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జూలకంటి అన్నారు. నల్లగొండ జిల్లాలో గ్రామగ్రామాన, ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు మహాసభల లక్ష్యాలను వివరిస్తున్నట్టు చెప్పారు. రైతులు తమ ఇండ్లపై జెండాలు ఎగురవేస్తూ ప్రచారంలో భాగస్వాములవుతున్నారని తెలిపారు. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో బెలూన్ల ఆవిష్కరణలు, గ్రామాలు, మండల కేంద్రాల్లో జెండాలు, ఫ్లెక్సీల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్టున్నట్టు వివరించారు. మహాసభల నిర్వహణకు వాలంటీర్లను నియమిస్తూ ఏర్పాట్లు కొనసాగిస్తున్నామని అన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని 36వ జాతీయ కిసాన్ మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వీరపల్లి వెంకటేశ్వర్లు, రైతు మహిళా రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, రాష్ట్ర సీనియర్ నాయకులు, ఎలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారి ఐలయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, సీఐటీయూ జిల్లా నాయకులు ఎండీ సలీం, డబ్బికారు మల్లేష్, చినపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

​కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వ్యవసాయ రంగానికి నష్టం కలిగించేలా ఉన్నాయని జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. విద్యుత్ రంగ ప్రయివేటీకరణ ప్రయత్నాలు, విద్యుత్ సవరణ బిల్లు, పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ లేకపోవడం వంటి అంశాలు రైతాంగాన్ని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా విదేశీ వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో విస్తృత అవకాశాలు కల్పిస్తే దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడేందుకు రైతులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అవసరమైన విధానాలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్టు తెలిపారు. ​వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన సిఫార్సులు, ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని రైతాంగ సమస్యల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ రూపొందించడంపై మహాసభల్లో చర్చిస్తామని వెల్లడించారు.


లక్ష మందితో భారీ ప్రదర్శన

​మహాసభల ప్రారంభం సందర్భంగా నవంబర్ 15న నల్లగొండలో లక్ష మందితో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు జూలకంటి తెలిపారు. మహాసభలో భాగంగా సుమారు 300 స్టాళ్లతో వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, నూతన వ్యవసాయ పరికరాలు, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్