Magazines

సీఎం రేవంత్ రెడ్డితో మధుయాష్కీగౌడ్ భేటీ

1 గంట క్రితం

Madhu Yashki Goud meet
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయాలపై చర్చ

ఏఐపీసీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్న ముఖ్యమంత్రి


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మెన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీసీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్స్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వంలో చేసిన సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పులపై వడ్డీ భారం తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.

​ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి త్వరలో మూడేండ్లు పూర్తి కానున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరంపై చర్చ జరిగింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు, గృహ వినియోగదారులకు ఉచిత కరెంటు, దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీ ధరకే గ్యాస్ సిలిండర్, రైతులకు రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఉపాధి కల్పన పై వారు చర్చించారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో నూతన కంపెనీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పన తదితర సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వం సాధించిన పురోగతిని ప్రజలకు వివరించాలన్న దానిపై చర్చ జరిగింది. సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షలు నిర్వహిస్తూ తదనుగుణంగా ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఇతర సంస్థలు, కార్యక్రమాల పనితీరును సమీక్షించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ప్రోగ్రెస్ రిపోర్టులు తీసుకుంటున్న తరహాలోనే, ప్రభుత్వ శాఖలు, పథకాల అమలుపైనా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి నివేదికలు తీసుకోవాలనే అంశం చర్చకు వచ్చింది.


​ఏఐపీసీ బలోపేతానికి సహకరిస్తా : 
సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ను రాష్ట్రంలో బలోపేతం చేయడంపై కూడా సమావేశంలో చర్చించారు. ఏఐపీసీ బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రొఫెషనల్స్‌ను భాగస్వాములను చేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సమర్థవంతమైన చర్చలకు వేదికగా ఏఐపీసీని తీర్చిదిద్దే అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. వివిధ రంగాల్లో నిపుణులను ఏఐపీసీ ద్వారా ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై వారు సమగ్రమైన నివేదికలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని సీఎం సూచించారు. ఇటు ప్రభుత్వం గానీ, అటు పార్టీ గాని ప్రొఫెషనల్స్ సేవలను సద్వినియోగం చేసుకొని నూతన పాలసీలు, విధానాలు రూపకల్పనలో భాగస్వామ్యం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ లు అభిప్రాయపడ్డారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్