Magazines

రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు

1 గంట క్రితం

Legal land rights
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 2 నిమిషాల చదవడం

రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం

భూవివాదాల శాశ్వత 
పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

భూభారతితో ఏండ్లనాటి సమస్యలకు పరిష్కారం

34 నెలల్లో 12.40 లక్షల పాస్‌‌బుక్కుల జారీ : సమీక్షలో మంత్రి పొంగులేటి


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

ప్రజలకు మెరుగైన, పార‌ద‌ర్శ‌క రెవెన్యూ సేవలు, రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్ , సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. భూవివాదాలకు శాశ్వత పరిష్కారమే ల‌క్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామ‌ని వివరించారు. గ‌త ప్రభుత్వంలోని పెద్ద‌ల నిర్ల‌క్ష్యం, నిర్వాకం, స్వార్ధపూరిత నిర్ణ‌యాల‌ వ‌ల్ల ప‌దేండ్లలో రెవెన్యూ వ్యవ‌స్ధ పూర్తిగా అస్థవ్యస్తమైందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌లు, స‌ల‌హాల‌ మేర‌కు రెవెన్యూ వ్యవస్ధను బ‌లోపేతం చేస్తూ ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. సోమవారం డాక్ట‌ర్ బిఆర్‌ అంబేద్క‌ర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.


భూభారతి చట్టం అమలు, రైతులకు పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారం, ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాల అమలు తీరును సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో మ‌రింత బాగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు కోరిన భూవివాదాలు లేని తెలంగాణ ఉండాల‌న్న సంకల్పంతో చారిత్రాత్మక‌మైన భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకొచ్చామ‌ని ఈ చట్టం అమ‌ల్లోకి వ‌చ్చిన గతేడాది ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వ‌ర‌కు 5,68,858 పాస్‌ బుక్కులు జారీ చేశామ‌ని వివరించారు. ఈ చట్టానికి ముందు 6,71,508 ఇచ్చామని తెలిపారు. మొత్తం ఈ 34 నెలల్లో 12,40,366 పాస్ బుక్కులను రైతుల‌కు అందజేశామని పేర్కొన్నారు.

​రీసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు భూభారతి చ‌ట్టంలో పేర్కొన్న‌ విధంగా రీ-సర్వే ద్వారా పరిష్కారం చూపుతున్నామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. కొన్ని ద‌శాబ్దాలుగా భూమిని సాగు చేస్తున్నా రికార్డుల్లో హక్కులు లేక ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థకాల‌కు దూర‌మై ఇబ్బందులు పడుతున్న రైతులకు త‌మ ప్ర‌భుత్వం అండ‌గా నిలిచి స‌మ‌గ్ర సర్వే నిర్వ‌హించి వాస్త‌వ సాగుదారుల‌ను గుర్తించి వారికి చ‌ట్ట‌బ‌ద్ద‌మైన హ‌క్కులు క‌ల్పిస్తున్నదని వివరించారు.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, నారాయణపురం రెవెన్యూ గ్రామంలో రీ-సర్వే నిర్వ‌హించి గిరిజ‌నులు, గిరిజనేత‌రుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి 906 మంది రైతులకు 1,600 ఎకరాలకుపైగా హక్కులు కల్పించామ‌ని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలాల్లో 15 గ్రామాల్లో రీ-సర్వే ద్వారా 2,400 మంది రైతులకు 3,450 ఎకరాలకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. దీంతో పట్టాదారు పాస్‌బుక్కులతో రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ములుగు జిల్లా ముల్కాప‌ల్లి మండ‌లం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వ‌రావుపేట‌, ద‌మ్మ‌పేట‌, ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి మండ‌లాల్లో ఈ రీసర్వే ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి త్వ‌ర‌లోనే హ‌క్కుదారుల‌కు పాస్‌బుక్కులు అందిస్తామ‌ని తెలిపారు.

​ప్రజలకు హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి

ఇత‌ర ప్రాంతాల్లో కూడా స‌ర్వే నిర్వ‌హించి ద‌శాబ్దాలుగా భూమిపై హ‌క్కుల కోసం ఎదురు చూస్తున్న ప్ర‌జ‌ల‌కు హ‌క్కులు క‌ల్పించే విధంగా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్ర‌జాకోణంలో రెవెన్యూ శాఖలో ప్ర‌భుత్వం తీసుకుంటున్న విధాన ప‌ర‌మైన నిర్ణయాలు, ఉత్త‌ర్వులు క్షేత్రస్థాయిలో ప‌కడ్బందీగా అమ‌లు జ‌రిగిన‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప‌నిచేయాల‌ని పేర్కొన్నారు. జ‌న‌గామ జిల్లాలో ఫుడ్ పార్క్ ఏర్పాటుపై ఆ జిల్లా క‌లెక్ట‌ర్‌తో చ‌ర్చించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్‌ లోకేశ్‌ కుమార్‌, స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేష‌న్ ఐజి రాజీ‌వ్‌గాంధీ హ‌నుమంతు, జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా త‌దిత‌రులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్