Magazines

ఎల్‌‌నినోపై సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలి

1 గంట క్రితం

plan regarding El Niño.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 20, 2026 | 3 నిమిషాల చదవడం

రైతాంగంతో పాటు ప్రజానీకంపై ప్రభావం :ఎస్వీకే వెబినార్‌‌లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌

పంట నష్టపరిహారం, మద్దతు ధర చెల్లింపులపై రైతులకు భరోసా కల్పించాలి


నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌‌నినోపై సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌ ‌కన్నెగంటి రవి సూచించారు. లేదంటే రైతాంగంపైనే కాకుండా యావత్‌ ‌తెలంగాణ ప్రజానీకంపై తీవ్రప్రభావం చూపే ప్రమాదముందని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ ‌కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ అధ్యక్షతన ‘యాసంగి పంటకు ప్రత్యామ్నాయం ఏంటి?’ అనే అంశంపై వెబినార్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్‌, కన్నెగంటి రవి మాట్లాడుతూ... ఎల్‌‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌‌రెడ్డి ...గ్లోబల్‌ ‌సమ్మిట్‌, మూసీ సుందరీకరణ అంశాలను తాత్కాలికంగా పక్కనబెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రైతులను, రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలనీ, ఎల్‌‌నినో నష్టనివారణ చర్యలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని..కరెంటు కొందామన్నా దొరకట్లేదని సీఎం మాటలు చెప్పడం సరిగాదని హితవు పలికారు. వానాకాలం పంటలేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై స్పష్టతేది అని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులకు విత్తనాలు, ఎరువులు ఫ్రీగాగానీ, సబ్సిడీమీదగానీ ఇస్తారా? మద్దతు ధర హామీ ఇస్తారా? పంటలేయకుండా ఉండే రైతులకు ఏమైనా పరిహారం ఇస్తారా?


వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తారా? ఇలాంటి అంశాల్లో దేనిపైనా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని ఎత్తిచూపారు. ఫిబ్రవరి నుంచే కరువు రాబోతున్నదని వాతావరణ శాఖ హెచ్చరించినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా కరువు మండలాల గుర్తింపుపై ఎందుకు తాత్సరం చేస్తున్నదని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద వ్యవసాయ విధానంపై ఒక సమగ్ర పాలసీ లేకపోవడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయన్నారు. ఎల్‌‌నినో ప్రభావం రైతాంగం మీదనే కాకుండా యావత్‌ ‌తెలంగాణ ప్రజానీకం మొత్తంమీద పడబోతున్నదని హెచ్చరించారు. పంటలేయకుంటే ఉత్పత్తి, ఉపాధి లేకుండా పోయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే సూచనలున్నాయని తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణలో 30 శాతానికిపైగా ఉన్న కౌలు రైతులకు న్యాయం చేయాలనీ, ప్రభుత్వాలు ఇచ్చే పరిహారాలు, రునాలు వారికే దక్కేలా చూడాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వకుంటే రైతు ఆత్మహత్యలు పెరిగిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.

అదుపుతప్పిన తెలంగాణ వ్యవసాయ విధానం

ఏడెనిమిది ఏండ్లుగా తెలంగాణ వ్యవసాయ విధానం అదుపుతప్పిందని వారు విమర్శించారు. వ్యవసాయం అనేది రైతులు, ప్రభుత్వం చేతుల నుంచి జారిపోయిందని తెలిపారు. రాష్ట్ర అవసరాలేంటి? ఏయే పంటల సాగు చేపట్టాలి? కూరగాయల సాగు ఎంతుండాలి? అనే సమగ్ర వ్యవసాయ విధానం లేకుండా పోయిందని చెప్పారు. 2018లోనే తెలంగాణలో వరి, పత్తి పంటల సాగు విపరీతంగా పెరిగిపోతున్నదనీ, వాటిని తగ్గించి పప్పుధాన్యాలు, కూరగాయలు, చిరుధాన్యాలు పండించాలని నాబార్డు సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. అవసరాలకు మించి పత్తి, వరి పంటలను పండించడం, వాటి కోసం విపరీతంగా నీటిని వాడటం వల్ల భూగర్భజలాలు వేగంగా పడిపోయాయని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లోనూ రావాల్సిన వాటాను దక్కించుకోవడం లేదని చెప్పారు. ఉన్న నీళ్లను ఎలా వాడుకోవాలనే దానిపైనా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదని విమర్శించారు. నగరీకరణ పెరగటం, రియల్టర్ల చేతుల్లో భూములు బంధీ కావడం వల్ల కూరగాయ పంటల సాగు తగ్గిందని గుర్తుచేశారు. పర్రిశమలు, నగరాల అవసరాలకు నీళ్లను మళ్లించడంతో పలు జిల్లాలకు సాగు నీరు అందించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. తాగునీటి వ్యాపార విస్తరణకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ఒక్క బియ్యం మాత్రమే ఎగుమతి చేసి మన రాష్ట్రంలో ప్రజలకు అవసరమయ్యే అన్ని పంటలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్న దుస్థితి నెలకొందన్నారు.

ముందే మేల్కొన్న పక్కరాష్ర్టాలు

కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ముందే మేల్కొని సెప్టెంబర్‌ ‌నెలలోనే ఖరీఫ్‌‌ పంటనష్టాలను అంచనా వేసి, కరువు మండలాలను గుర్తించి సెప్టెంబర్‌‌లోనే కేంద్రానికి నివేదికలు పంపాయని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఒక్క లేఖ కూడా వెళ్లలేదని విమర్శించారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, నివేదికలు రూపొందించి పంపించే సరికి ఖరీఫ్‌ ‌సీజన్‌‌ కూడా అయిపోతుందని చెప్పారు. నవంబర్‌‌లో నివేదికలు పంపితే కేంద్ర అధికార బృందాలు ఎప్పుడొస్తాయి? పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తాయి? పరిహారంపై ఎలా సిఫారసు చేస్తాయి? అని ప్రశ్నించారు. కరువు నెలకొన్న పరిస్థితుల్లో కూడా డాటా సెంటర్లు, కూల్‌‌డ్రింక్స్‌, డ్రింకింగ్‌ వాటర్‌ ‌కంపెనీలకు, ఆల్కహాల్ తయారీ కంపెనీలకు 3 పైసలకు లీటరు చొప్పున నీళ్లు ఇవ్వడమేంటి? ఇథనాల్‌ ‌కంపెనీలకు మిషన్‌ ‌భగీరథ నీళ్లు ఇవ్వడమేంటి? అని నిలదీశారు. తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే పరిస్థితులున్న నేపథ్యంలో కొన్ని పరిశ్రమలకైనా నీళ్ల సరఫరాను నిలిపేయాలని డిమాండ్‌ ‌చేశారు. కరువు నివారణ చర్యల కోసం రాష్ట్ర బడ్జెట్‌‌లో రూ.5 వేల నుంచి రూ.10 వేల కోట్లను కేటాయించాలనీ, రైతులకు పంట నష్టపరిహారాలు ఇచ్చి ఆదుకోవాలనీ, కౌలు రైతులకు నేరుగా ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్