Magazines

వర్షం సాక్షిగా

1 గంట క్రితం

As a witness to the rain
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 3 నిమిషాల చదవడం

నగరానికి దూరంగా ఉన్న ఆ కొనుగోలు కేంద్రం దగ్గరికి చేరేసరికి ఉదయం ఇంకా పూర్తిగా మేలుకోలేదు. ట్రాక్టర్లు వరుసగా నిలబడి ఉన్నాయి. తడిసిన బస్తాలు. చిరిగిన టార్పాలిన్లు. చెట్ల కింద ప్లాస్టిక్ కప్పుకుని రాత్రిని గడిపిన రైతులు. తెల్లవారేసరికి కొందరు లేచి బస్తాల దగ్గర నిలబడ్డారు. వాళ్ల కళ్లలో ఒక విచిత్రమైన నిరీక్షణ. ఆశ చనిపోలేదు. కానీ బతకడం కూడా సులభంగా లేదు. నేను నోట్‌బుక్ చేతిలో పట్టుకుని రైతుల మధ్య తిరుగుతున్నాను. “ఎన్ని రోజులైంది?” “నాలుగు రోజులు సార్…” “కొనట్లేదా?” “తేమ ఎక్కువ అంటున్నారు.” అతను నవ్వడానికి ప్రయత్నించాడు. కానీ ఆ నవ్వు పెదవుల దగ్గరే విరిగిపోయింది. కొద్దిదూరంలో ఓ వృద్ధ రైతు తడిసిన బస్తాల మీద ప్లాస్టిక్ సరిచేస్తున్నాడు. చేతులు వణుకుతున్నాయి. పక్కనే ఓ చిన్నపిల్లాడు ధాన్యం బస్తాపైనే నిద్రపోతున్నాడు. ఆ దృశ్యం చూసి నేను రాయడం ఆపేశాను. కొన్ని విషయాలు జర్నలిస్టుగా నమోదు చేయడానికి ముందు…

మనిషిగా భరించాలి. అప్పుడే వెనుక నుంచి ఆమె గొంతు వినిపించింది. “రామ్…” తిరిగి చూసాను. తెల్లటి కాటన్ దుస్తులు. ప్రయాణపు అలసట. “నువ్వెందుకు వచ్చావు?” ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. రైతుల వరుస వైపు చూసింది. తడిసిన ధాన్యం వైపు చూసింది. చెట్టు కింద కూర్చున్న మహిళల వైపు చూసింది. తర్వాత మెల్లగా అంది— “నిన్న రాత్రి నీ ఫోన్ తర్వాత… నిద్రపట్టలేదు.” ఇంతలో ఒక రైతు భార్య మా దగ్గరకు వచ్చింది. చీర అంచు తడిసిపోయింది. “సార్… రాసినా ఉపయోగం ఉంటుందా?” ఆ ప్రశ్నలో కోపం లేదు. ఆశ కూడా లేదు. కేవలం చాలా కాలంగా ఎదురుచూసి అలసిపోయిన మనిషి నిస్సహాయత.
నేను సమాధానం చెప్పలేకపోయాను. ఆమె మాత్రం మెల్లగా అంది— “ఉండాలి…” ఆ మహిళ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వింది. “ఉంటే బాగుండు అమ్మా…” అంతే. ఆ మాట ముగిసిపోయింది. కానీ ఆ నిరాశ మాత్రం గాలిలో అలాగే మిగిలిపోయింది. కొద్దిసేపటికే మళ్లీ జల్లులు మొదలయ్యాయి. ఒక్కసారిగా అందరూ బస్తాల వైపు పరుగులు తీశారు. బస్తాల మీద ప్లాస్టిక్ కప్పుతున్నారు. ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునే ఆత్రం. అది కేవలం పంట కాదు. ఒక ఏడాది శ్రమ. ఒక కుటుంబం అప్పు. ఒక ఇంటి భోజనం. నేను నోట్‌బుక్‌ను జేబులో పెట్టి బస్తాల వైపు పరుగెత్తాను. ఆమె అప్పటికే ఓ మహిళతో కలిసి ప్లాస్టిక్‌ లాగుతోంది. ఆమె పూర్తిగా తడిసిపోయింది. జుట్టు చెంపలకు అంటుకుంది. ఆ క్షణంలో… ఆమె కళాకారిణి కాదు. నేను జర్నలిస్టు కాదు. మేమిద్దరం కూడా వర్షం ముందు ఓడిపోకుండా ప్రయత్నిస్తున్న మనుషుల్లా ఉన్నాం. వర్షం తగ్గాక మేం పక్కకు వచ్చి నిలబడ్డాం.

ఆమె చేతుల మీద ధాన్యం పొట్టు అంటుకుంది. చాలా సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లగా అడిగింది— “నువ్వు ఇది నిత్యం చూస్తుంటావా?” “దాదాపు.” “అలసిపోవడం లేదా?” కొద్దిసేపు మౌనంగా ఉండి అన్నాను— “అలసిపోతా…” “మరి?” దూరంగా రైతుల వరుస వైపు చూశాను. “కానీ వీళ్ల కంటే ముందుగా అలసిపోయే హక్కు నాకు లేదనిపిస్తుంది.” ఆమె ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. సాయంత్రానికి కూడా కొనుగోలు మొదలుకాలేదు. క్యూలు అలాగే ఉన్నాయి. నిరీక్షణ అలాగే ఉంది. మేమిద్దరం బయటికి నడుస్తున్నాం. గాలిలో తడిసిన ధాన్యం వాసన. దూరంగా ఓ రైతు ఫోన్‌లో ఎవరికో చెబుతున్నాడు— “ఇంకా కొనలేదు…” ఆ ఒక్క మాటలో ఎంత ఓటమి ఉంటుందో… తెలుగులో నిఘంటువులు కూడా చెప్పలేవు. ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. “రామ్…” “హ్మ్?” చాలా సేపు మాట్లాడలేదు. తర్వాత మెల్లగా అంది— “నిన్ను ప్రేమించడం ఎందుకు కష్టమో… ఇప్పుడు మరింత అర్థమవుతోంది.” నేను ఆశ్చర్యంగా చూశాను. “ఎందుకు?” ఆమె చుట్టూ చూసింది. రైతుల వరుస.
తడిసిన బస్తాలు. అలసిన ముఖాలు. తర్వాత నా వైపు తిరిగి అంది— “ఎందుకంటే… నిన్ను ప్రేమించే మనిషి… నీతో పాటు ఈ మనుషులందరి బాధతో కూడా జీవించడం నేర్చుకోవాలి.” నేను ఏమీ అనలేదు. ఆమె నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. కొద్దిసేపు అలాగే నిలబడ్డాం. మా మధ్య మాటలేమీ లేవు. కానీ ఆ నిశ్శబ్దంలో… ఆమె చెప్పిన మాట మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంది. వెనక్కి తిరిగి చూశాను. తడిసిన బస్తాల మధ్య నిలబడి ఉన్న రైతులు కనిపించారు. ఆ రోజు ఆమె నా ప్రపంచాన్ని చూసింది. నేను మాత్రం… ఆమె నా ప్రపంచంలోకి అడుగుపెట్టిన క్షణాన్ని మాత్రమే చూస్తూ నిలబడ్డాను. రామ్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్