కౌలు రైతుల సంక్షేమం కోసం సమగ్ర విధానం తేవాలి
రైతు సంక్షేమ హామీల అమలులో సర్కార్ విఫలం
కేంద్ర విధానాలతో వ్యవసాయ రంగం కార్పొరేట్లపరం
ఏఐకేఎస్ జాతీయ మహాసభల్లో భవిష్యత్తు కర్తవ్యాల రూపకల్పన
పోరాట స్ఫూర్తి నింపేలా మహాసభల నిర్వహ ణ
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌తో నవతెలంగాణ ముఖాముఖి
రైతాంగానికి ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు 40 రకాల హామీలు ఇచ్చినప్పటికీ, వాటిలో కొన్ని మాత్రమే అమలు చేసి, మరికొన్నింటిని పూర్తిగా విస్మరించిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని అన్నారు. కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లపరం చేసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేవిధంగా విధానాలను అమలు చేస్తోందన్నారు. రైతులను ఐక్యం చేస్తూ విధానాలపై తిరుగుబాటు చేసేందుకు భవిష్యత్తు కర్తవ్యాల రూపకల్పనకు నల్లగొండలో జరగనున్న అఖిలభారత కిసాన్ సభ(ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభ వేదిక కాబోతుందన్నారు. ఏఐకేఎస్ జాతీయ మహాసభలను పురస్కరించుకుని ‘నవతెలంగాణ’ ప్రాంతీయ ప్రతినిధి ఎమ్డీ సాదత్ అలీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
పోరాట స్ఫూర్తిని నింపేలా...
వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డమీద ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. 28 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మహాసభలకు వచ్చే 2 వేల మంది ప్రతినిధులు, పరిశీలకులు, ఎస్కేఎమ్ నాయకుల్లో చైతన్య స్ఫూర్తిని నింపేందుకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన కడవెండి, పాలకుర్తి, గుండ్రాంపల్లి...ఇలా ప్రతి ఊరి నుంచీ అమరవీరులను యాదిచేసుకుంటూ అమరజ్యోతులను తీసుకురానున్నారు. పోరాట స్మృతులను నెమరువేసుకుంటూ పలు గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ప్రభలను తీసుకొస్తున్నారు.
అన్నదాతలకు అవగాహన పెంచేలా అగ్రిఫెస్ట్
రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు అగ్రిఫెస్ట్ నిర్వహించబోతున్నాం. ఆ ఫెస్ట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, యాంత్రీకరణ పరికరాలు, తెలంగాణ పంటలను 200 స్టాళ్ల ద్వారా ప్రదర్శిస్తారు.
సాంస్కృతిక చైతన్యం నింపేలా...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సాంస్కృతిక రంగం కీలక పాత్ర పోషించింది. ప్రతి జిల్లాకూ ప్రత్యేకతను చాటే కళారూపాలున్నాయి. ఆ కళారూపాల కలబోతగా కల్చరల్ ఫెస్ట్ నిర్వహించబోతున్నాం. ఈనెల 14,15,16 తేదీల్లో తెలంగాణలోని వివిధ కళారూపాలు, వ్యవసాయ రంగ సమస్యలపై నాటికలను ప్రదర్శిస్తారు.
రైతుల సహకారంతోనే...
రైతుల ఆర్థిక సహకారంతోనే మహాసభలను జయప్రదం చేయాలని నిర్ణయించాం. తెలంగాణలో మూడు లక్షలకుపైగా రైతు కుటుంబాలను నేరుగా కలిశాం. ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రెండు లక్షల కుటుంబాల గడపలు తొక్కాం. వారి సాదకబాదకాలు తెలుసుకున్నాం. వ్యవసాయం లాభసాటే అయినప్పటికీ అన్నదాతలు అప్పుల పాలు కావడానికి కారులెవ్వరో అర్థమయ్యేలా వివరించి చైతన్యపరిచాం. 22 కమిటీల ద్వారా దాదాపు 500 మందికిపైగా వాలంటీర్లు సేవలందించనున్నారు. మూడు రోజుల పాటు దేశంలో, రాష్ట్రంలో అన్నదాతలకు అండగా చేపట్టబోయే పోరాటాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుని ముందుకు నడువబోతున్నాం.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల్లో అవినీతి చెబుతున్నదిగానీ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమైంది. ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తక్కువ నిధులతో పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలి.
రుణమాఫీ హామీ అందరికీ కాలేదు...
రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి రూ.39 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. కనీసం రూ.35 వేల కోట్లు కేటాయిస్తే మెజార్టీ రైతులకు ప్రయోజనం కలుగుతుందని భావించినప్పటికీ, చివరకు రూ.20,616 కోట్లతో సరిపెట్టింది. ఇంకా 30 శాతం మంది అర్హులైన రైతులకు రుణమాఫీ జరగలేదు. ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి బ్యాంకులకు చెల్లించినా కొందరికి రుణమాఫీ కాలేదు.
రైతు భరోసా పథకంలో ఆంక్షలు సరికాదు...
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు రూ.7,500 ఇస్తామని హామీ ఇచ్చింది. తొలుత పాత ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్నే కొనసాగించి, ఒక పంటకు నాలుగు ఎకరాల లోపు రైతులకే పరిమితం చేసింది. రైతుల అసంతృప్తి నేపథ్యంలో ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు అందించే విధానాన్ని మొదలుపెట్టింది. కౌలు రైతులకు మాత్రం నేటికీ ఈ పథకం అందడం లేదు. ఆంక్షలు లేకుండా అందరికీ ఇవ్వాలి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల్లో సగానికి పైగా కౌలు రైతులవే. పంట రుణాలు, రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంట నష్టపరిహారం వంటి పథకాలు వారికి అందట్లేదు. వారికి రుణార్హతకార్డులివ్వాలి. వాస్తవ సాగుదారులకే రైతుభరోసా ఇవ్వాలి. ఫసల్ బీమా పథకంలో చేరుతామని ప్రకటించిన ప్రభుత్వం మూడేండ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో సొంత పథకం అమలు చేసినా బాగుండేది. కానీ, ఇవేవీ చేయకపోవడం వల్ల ఎల్‌నినోతో నష్టపోయిన అన్నదాతలకు పరిహారం దక్కకుండా పోయింది. సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావాలి.
బోనస్ అన్ని పంటలకు ఇవ్వాలి..
ఆరు పంటలకు బోనస్, మరో నాలుగు పంటలకు మద్దతు ధర కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి సన్నవడ్లకే పరిమితం చేసింది. చెరుకు, పసుపు, మిర్చి, ఎర్రజొన్నలకు మద్దతు ధర నిర్ణయిస్తామన్న హామీ కూడా నెరవేరలేదు. అన్ని పంటలకూ బోనస్ ఇవ్వాలి.
భూసేకరణలో బీఆర్ఎస్ చట్టమే కొనసాగింపు...
ప్రాజెక్టులు, పరిశ్రమలు, రోడ్ల నిర్మాణం కోసం భూములు సేకరించే సమయంలో 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అసైన్డ్, పోడు భూములకు కూడా న్యాయమైన పరిహారం ఇస్తామని చెప్పింది. ధరణిని రద్దు చేసి భూభారతి ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారమివ్వాలి.
కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం.
2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన పోడు రైతులందరికీ భూ హక్కు పత్రాలివ్వాలి. సుమారు 8.5 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులకు ఇప్పటికీ పట్టాలు అందలేదు. కార్పొరేట్లకు అడ్డురాని నిబంధనలు అడవినే నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలకే అడ్డురావడమేంటి? ఖనిజవనరులను కొల్లగొడుతున్న కార్పొరేట్లకు అటవీ భూములను కట్టబెట్టడమేంటి? ప్రభుత్వం పేదోల పక్షమా? కార్పొరేట్ల పక్షమా? తేల్చుకోవాలి. ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో భూములను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయాలని చూస్తోంది. ఇది దుర్మార్గం.
వ్యవసాయ కూలీలను పట్టించుకోవడం లేదు..
వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో ఒక్కసారి మాత్రమే ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. 20 రోజుల కంటే తక్కువ పని చేసిన వారికి పథకం వర్తించదని ప్రభుత్వం ప్రకటించింది. ఇది సరిగాదు. ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇవ్వాల్సిందే.
పంటల ప్రణాళికను రూపొందించాలి..
రాష్ట్రానికి ఏయే పంటలు ఎంతమేర అవసరమో గుర్తించి పంటల ప్రణాళిక రూపొందించాలి. దిగుమతులను తగ్గించేలా, స్థానిక అవసరాలకు సరిపోయేలా పంటల సాగును ప్రోత్సహించాలి. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల శివారు ప్రాంతాల్లో కూరగాయల సాగు, పాడి పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. భూకమతాల సర్వే నిర్వహించి ప్రతి రైతుకు భూధార్ కార్డు ఇవ్వాలి.
హామీలపై ఆత్మవిమర్శ చేసుకోవాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్లలో అమలు చేసిన, అమలు చేయని హామీలపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. రైతు సంఘాలు, ప్రతిపక్షాలు, వ్యవసాయ నిపుణులను భాగస్వాములను చేసి సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర, పంట నష్టపరిహారం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి అమలు చేయాలి.







కామెంట్లు (0)